నైరుతికి మరో నాలుగు రోజులు!

3 Jun, 2014 01:08 IST|Sakshi

* కేరళను తాకే అవకాశం.. ఆ తర్వాత వారంలో రాష్ట్రానికి!
* తెలంగాణకు వడగాడ్పుల సూచన

 
సాక్షి, విశాఖపట్నం:
ఆగ్నేయ బంగాళాఖాతంలో కన్యాకుమారి దక్షిణ ప్రాంతం వరకు వచ్చిన నైరుతి రుతుపవనాలు మరో నాలుగు రోజుల్లో కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్ని తాకే అవకాశాలున్నట్టు వాతావరణ నిపు ణులు సోమవారం తెలిపారు. ఆ తర్వాత వారం రోజుల్లో నైరుతి రాష్ట్రాన్ని తాకవచ్చన్నారు. వీటి ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వివరించారు. ఇలా ఉండగా విదర్భ నుంచి తెలంగాణ, దక్షిణ కోస్తా మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని వారు తెలిపారు. దీని ప్రభావంతో మరో రెండురోజుల పాటు రాష్ట్రంలోని కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల వర్షాలు పడవచ్చని చెప్పారు.
 
 తాజాగా కురిసిన వర్షాలకు కోస్తాంధ్రలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దక్షిణ కోస్తాలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవగా, ఉత్తర కోస్తాంధ్రలో మాత్రం రెండు మూడు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలోని గుంటూరు, రాయలసీమలోని చిత్తూరుతో పాటు తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశాలున్నట్టు భారత వాతావరణ కేంద్రం తన నివేదికలో వెల్లడించింది. సోమవారం  రెంటచింతలలో గరిష్టంగా 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు పేర్కొంది.

మరిన్ని వార్తలు