అండమాన్‌కు ‘నైరుతి’

18 May, 2019 03:42 IST|Sakshi

నేడో, రేపో రాక

రాయలసీమలో రెండ్రోజులు వడగాడ్పులు 

కోస్తాలో తేలికపాటి జల్లులు 

ఐదు రోజులపాటు ఎండలు 

మండుతాయన్న విపత్తుల నిర్వహణ శాఖ

సాక్షి, విశాఖపట్నం/మంగళగిరి: నైరుతి రుతు పవనాలు నేడో, రేపో అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవుల్లోకి ప్రవేశించనున్నాయి. ఇవి కేరళలో ప్రవేశించడానికి దాదాపు పది రోజుల ముందు అంటే మే 20వ తేదీ నాటికి అండమాన్‌ను తాకుతాయి. కానీ, ఈ ఏడాది రెండు రోజుల ముందుగానే ఇవి అండమాన్‌లోకి ప్రవేశించే వీలుందని ఐఎండీ శుక్రవారం రాత్రి నివేదికలో వెల్లడించింది. రానున్న రెండు రోజుల్లో రాయలసీమలో కొన్నిచోట్ల వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. అక్కడ సాధారణం కంటే 3నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని పేర్కొంది.

వచ్చే మూడు రోజులు కోస్తాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు లేదా వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది. వడదెబ్బ బారినపడి శుక్రవారం విశాఖ జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, విజయనగరం జిల్లాలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరోవైపు విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మోస్తరు వర్షాలు కురిశాయి. చోడవరంలో భారీగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం పడింది. బుచ్చయ్యపేట, దుంబ్రిగుడ, కొయ్యూరు, పాడేరు, అనకాపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో వర్షం కురిసింది. 

ఐదు రోజులూ ఎండలు మండుతాయ్‌
రాష్ట్రంలో రానున్న ఐదు రోజులపాటు ఎండలు మండుతాయని గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) తెలిపింది. శుక్రవారం ఒక ప్రకటన చేస్తూ.. శనివారం ఉభయ గోదావరి, కృష్ణా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్‌ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 46 డిగ్రీల వరకు, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 19న విజయనగరం, విశాఖ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్‌ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల వరకు, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది.

20న విశాఖ, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు, విజయనగరం, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల వరకు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది. 21న ప్రకాశం, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45  నుంచి 46 డిగ్రీల వరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల వరకు, పశ్చిమ గోదావరి జిల్లాలో 41 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. 22న తూర్పుగోదావరి, నెల్లూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 47 డిగ్రీల వరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు, గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది.

మరిన్ని వార్తలు