ఉనికి కోసమే అలజడులు

30 Nov, 2018 08:07 IST|Sakshi
ఎస్పీ అట్టాడ బాబూజీ

మావోయిస్టుల వారోత్సవాల వల్ల ఒరిగేది శూన్యం

ఎస్పీ అట్టాడ బాబూజీ

విశాఖక్రైం: ఏజెన్సీ ప్రాంతంలో తమ ఉనికిని కాపాడుకోడానికే మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహిస్తూ అలజడి సృష్టిస్తున్నారని ఎస్పీ అట్టాడ బాబూజీ అన్నారు. మావోయిస్టు వారోత్సవాల వల్ల గిరిజనులకు ఒరిగేది ఏమి లేదని చెప్పారు. అమాయక గిరిజన యువతను బలవంతంగా తమ వైపు తిప్పుకోవడానికి, వారిని భయపెట్టి బలిచేయడానికి మావోయిస్టులు పీఎల్‌జీఏ వారోత్సవాలు నిర్వహిస్తుంటారని చెప్పారు. ఈ మధ్య కాలంలో అత్యంత కీలకమైన వ్యక్తులను మావోయిస్టు పార్టీ కోల్పోయిందని, పలువురిని అరెస్టు చేశామని తెలిపారు. మావోయిస్టు ఉదయ్‌ భార్య మీనా ఎదురుకాల్పుల్లో  చనిపోవడం, మావోయిస్టునేత నూనే నర్సింహరెడ్డి (అలియాస్‌ గోపాల్‌) భార్య బూతం అన్నపూర్ణ, పెదబయలు ఏరియా కమిటీ సభ్యుడు ముదలి సోనా(అలియాస్‌ కిరణ్‌)తో పాటు పలువురు అరెస్టు అయిన నేపథ్యంలో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బతగిలిందని తెలిపారు. దీంతో బలాన్ని పెంచుకోడానికి  వారోత్సవాలు నిర్వహిస్తున్నారని చెప్పారు.

అమాయక గిరిజనులను మాయ మాటలు, పాటలతో ఆకట్టుకుని పార్టీలో చేర్చుకుంటున్నారని, పోలీసుల సమాచారం చేరవేయడానికి, చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్రేరేపిస్తున్నారని తెలిపారు.  మావోయిస్టులు నిత్యం  రకరకాల పేర్లతో వారోత్సవాలను  నిర్వహిస్తున్నారని,  దీంతో గిరిజనులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు.  వారోత్సవాల పేరుతో    ప్రభుత్వ ఆస్తులైన సమాచార వ్యవస్థలు,   కార్యాలయాలను ధ్వంసం చేయడం, ప్రజల ఆస్తులపై కరువుదాడులు చేస్తున్నారని తెలిపారు.  తమ మాట వినని గిరిజనులను ఇన్‌ఫార్మర్ల పేరుతో హత్యలు చేస్తున్నారని చెప్పారు. వారోత్సవాలపై పూర్తి స్థాయిలో నిఘా కొనసాగిస్తున్నామన్నారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరించినా, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలిసినా దగ్గరలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  

నుర్మతి ఔట్‌పోస్టును సందర్శించిన ఎస్పీ
విశాఖక్రైం,జి.మాడుగుల: జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీలో  పోలీసులు లక్ష్యంగా మావోయిస్టులు  మందుపాతర పేల్చిన ప్రాంతాన్ని  ఎస్పీ అట్టాడ బాబూజీ  సందర్శించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన నుర్మతి పంచాయతీ గాదిగుంట రోడ్డులో నిర్మాణదశలో ఉన్న వండ్రంగుల బ్రిడ్జి సమీపంలో బుధవారం ఉదయం మావోయిస్టులు రెండు చోట్ల మందుపాతరలను పేల్చారు. ఈ  ఘటనలో  కేంద్ర బలగాలకు చెందిన ఇద్దరు పోలీసులు, ఒక గిరిజనుడు గాయపడిన విషయం తెలిసిందే. సమాచారం తెలిసిన వెంటనే బుధవారం సాయంత్రం  నుర్మతి ఔట్‌పోస్టును ఎస్పీ సందర్శించారు.   ఏ ప్రాంతంలో మందుపాతర పేల్చారు, ఆ సమయంలో ఎంతమంది పోలీసులు ఉన్నారు తదితర వివరాలను తెలుసుకున్నారు. నుర్మతి ఔట్‌పోస్టు వద్దే ఎస్పీ, నర్సీపట్నం ఓఎస్‌డీ  రాత్రి బస చేశారు. గురువారం ఉదయం మందుపాతర పేలిన ప్రదేశాన్ని  పరిశీలించారు. స్థానిక గిరిజనులతో మాట్లాడారు. మావోయిస్టుల  దాడులను తిప్పికొట్టే విధంగా పోలీసుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారు.  గురువారం మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నారు.  నుర్మతి పోలీస్‌ ఔట్‌పోస్టుకు మరింత భద్రత పెంచినట్టు తెలిసింది. 

మరిన్ని వార్తలు