ప్రతిభకు కష్టం తోడైతేనే గుర్తింపు

20 Nov, 2018 08:28 IST|Sakshi
తన తండ్రి నమూనా విగ్రహంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శిల్పి వుడయార్‌

అప్పుడే గాయకులుగా, నటులుగా రాణింపు

సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలు  

తూర్పుగోదావరి, కొత్తపేట: మంచి గొంతు, తగిన ప్రతిభ ఉండాలని, కష్టపడాలని, అప్పుడే అటువంటివారు సినీ పరిశ్రమలో గాయకులుగా, నటులుగా రాణిస్తారని ప్రముఖ సినీ గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు శ్రీపతి పండితారాధ్యుల (ఎస్పీ) బాలసుబ్రహ్మణ్యం అన్నారు. నెల్లూరు కస్తూరీదేవి విద్యాలయం ప్రాంగణంలో నెలకొల్పేందుకు తన తండ్రి, సంగీత విద్వాంసుడు సాంబమూర్తి నిలువెత్తు కాంస్య విగ్రహం తయారు చేయాలని ఆయన.. స్థానిక ప్రముఖ శిల్పి, రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన శిల్పి డి.రాజ్‌కుమార్‌ వుడయార్‌ను కోరారు. ఆ మేరకు పూర్తయిన నమూనా విగ్రహాన్ని పరిశీలించేందుకు సోమవారం రాజ్‌కుమార్‌ శిల్పశాలకు వచ్చారు. విగ్రహం నమూనాపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ముఖ కవళికల్లో స్వల్ప మార్పులు సూచించారు. బాలు సమక్షంలోనే శిల్పి వాటిని సరిచేయగా పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.

విగ్రహాల్లో జీవకళ
ఈ సందర్భంగా బాలు విలేకర్లతో మాట్లాడారు. నెల్లూరులో ఘంటసాల, జాషువా విగ్రహాల సరసన తన తండ్రి సాంబమూర్తి విగ్రహం ఉందని, దానిని వేరే శిల్పి తయారు చేశారని చెప్పారు. ఒక సందర్భంలో రాజ్‌కుమార్‌ తన తండ్రి బస్ట్‌ విగ్రహం తయారు చేసి ఇచ్చారని, దానిని చూస్తే తన తండ్రిని చూసినట్టే అనిపించిందన్నారు. దీంతో నిలువెత్తు విగ్రహం తయారు చేయాల్సిందిగా కోరానని చెప్పారు. నెల్లూరులో ప్రస్తుతం ఉన్న విగ్రహం స్థానంలో వుడయార్‌ తయారు చేసే విగ్రహాన్ని ఉంచి, పాత విగ్రహాన్ని వేరేచోట నెలకొల్పుతామన్నారు. రాజ్‌కుమార్‌ శిల్పశాలను, ఆ గ్యాలరీలో చరిత్రకారులు, దేశ నాయకులు, రాజకీయ నాయకుల విగ్రహాలను తిలకించి తన్మయత్వం చెందారు. విగ్రహాల్లో జీవకళ ఉట్టిపడుతోందని, ఆ కళే తనను ఇక్కడివరకూ తీసుకువచ్చిందని శిల్పి రాజ్‌కుమార్‌ను అభినందించారు.

కొత్తవాళ్లు బాగా పాడుతున్నారు
నేపథ్య గానం గురించి మాట్లాడుతూ ‘‘సుమారు 52 సంవత్సరాలుగా పాడుతూనే ఉన్నాను. అందరికీ ఆనందం కలిగించే పాటలు పాడాను. ఇప్పటికీ అడపాదడపా పాడుతూనే ఉన్నాను. అయినా కొత్తవాళ్లకూ అవకాశాలు రావాలి కదా! నేనూ ఒకప్పుడు కొత్తవాడినే. కొత్తవాళ్లు మంచి ప్రతిభతో వస్తున్నారు. బాగా పాడుతున్నారు. మంచి ప్రతిభతో వస్తే అవకాశాలు వాటంతట అవే వస్తాయి’’ అని అన్నారు. ఒక చానల్‌లో పాటల ప్రోగ్రాం ద్వారా సుమారు 100 మంది గాయకులయ్యారని తెలిపారు. నటన విషయానికి వస్తే మిధునం సినిమాలో మంచి పాత్ర పోషించానని, ఆ సినిమా సంతృప్తినిచ్చిందని అన్నారు. చిన్నది, పెద్దది అనే తేడా లేకుండా వైవిధ్యమైన పాత్రలు వస్తే చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నానని బాలు తెలిపారు.

మరిన్ని వార్తలు