టెక్నాలజీతో.. నేరాలకు అడ్డుకట్ట

1 Feb, 2020 12:02 IST|Sakshi

ఒక సీసీ కెమెరా వందమంది కానిస్టేబుళ్లతో సమానం

ఫేస్‌బుక్, వాట్సాప్‌లో డిలీట్‌ చేసిన సమాచారాన్ని కూడా సైబర్‌ ఫొరెన్సిక్‌ ల్యాబ్‌లో రికవరీ చేయొచ్చు

దిశ చట్టంతో మహిళలకు రక్షణ    

మహిళా పోలీసులతో నేరాలు తగ్గుతాయి 

‘స్పందన’లో మొదటిస్థానంలో ఉన్నాం

‘కాఫీ విత్‌ సాక్షి’లో జిల్లా ఎస్పీ డాక్టర్‌ కె. ఫక్కీరప్ప

సాక్షిప్రతినిధి, కర్నూలు: ప్రజా రక్షణే తమ ధ్యేయమని జిల్లా ఎస్పీ కె.ఫక్కీరప్ప అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు సిబ్బంది, ప్రజల సహకారంతో అహర్నిశలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ‘సాక్షి’ దినపత్రిక యూనిట్‌ ఆఫీసులో శుక్రవారం జరిగిన ‘కాఫీ విత్‌ సాక్షి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యూనిట్‌లోని వివిధ విభాగాలను సందర్శించారు. సిబ్బందిని పరిచయం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వార్తల సేకరణ ఎలా ఉంటుంది? ఎడిటింగ్, పేజినేషన్, ప్రింటింగ్‌ గురించి తెలుసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలోని శాంతిభద్రతలు, పోలీసులు తీసుకుంటున్న చర్యల గురించి ‘సాక్షి’కి వివరించారు.  

మహిళలకు రక్షణ కవచం ‘దిశ చట్టం’
మహిళల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దిశ చట్టంతో మహిళా భద్రతకు ప్రాధాన్యత ఇస్తోంది. మహిళా పోలీసుస్టేషన్‌ను ‘దిశ పోలీసుస్టేషన్‌’గా మార్చాం. నిర్భయ చట్టాని కంటే మరింత పకడ్బందీగా శిక్ష పడే చట్టం దిశ. అయితే ప్రత్యేకమైన కేసుల్లోనే దిశ సెక్షన్‌ నమోదు చేస్తాం. ఇంట్లో భార్య, భర్త మధ్య తగాదా వచ్చి.. భార్య అనుమతి లేకుండా భర్త బలవంతం చేసినా అత్యాచారం కింద కేసు  నమోదవుతుంది. ఇలాంటి వాటికి ‘దిశ’ వర్తింపజేయం. కానీ హైదరాబాద్‌లో జరిగిన ఘటనలాగా కేసులో తీవ్రత ఉంటే  దిశ సెక్షన్‌ వర్తిస్తుంది. మూడువారాల్లో  విచారణ పూర్తయి.. దోషికి శిక్షపడే కఠిన చట్టం దిశ. ఈ చట్టం మహిళలకు ఎంతో రక్షణగా ఉంటుంది. ప్రస్తుతం దిశ స్టేషన్‌కు ఒక డీఎస్పీ ఉన్నారు. మరో డీఎస్పీ పోస్టు మంజూరైంది. వీరితో పాటు ఐదుగురు ఎస్‌ఐలు ఉంటారు. ప్రస్తుతం ఇద్దరు ఉన్నారు. మరో ముగ్గురు వస్తారు. స్టేషన్‌లోని మొత్తం సిబ్బందిలో 50 శాతానికి తగ్గకుండా మహిళా పోలీసులు ఉంటారు. స్టేషన్‌ పరిధిలో 28 మంది సిబ్బంది ఉండాలి. కానీ కర్నూలు స్టేషన్‌లో 46 మంది పోలీసులు ఉన్నారు. ‘దిశ స్టేషన్‌’గా మార్చిన తర్వాత మరో 8 మందిని తీసుకుంటున్నాం.

మహిళా పోలీసులతో నేరాల తగ్గుదల
గ్రామ సచివాలయాల్లోని మహిళా పోలీసులు ప్రస్తుతం పోలీసు ట్రైనింగ్‌ కాలేజీలో శిక్షణలో ఉన్నారు. వీరి నియామకంతో గ్రామస్థాయిలో నేరాలు తగ్గుతాయి. సంబంధిత సమాచారం పక్కాగా, వేగంగా వస్తుంది. పోలీసులు స్థానికంగా ఉండటంతో మంచి ఫలితాలు వస్తాయి. మండలానికి 20 గ్రామాల చొప్పున ఉన్నాయి.  కానిస్టేబుళ్లు పూర్తిస్థాయిలో వెళ్లలేరు. అదే సచివాలయంలో ఒక పోలీసు ఉంటే ఆయా గ్రామపరిధిపై పూర్తి అవగాహన ఉంటుంది. సమయం కేటాయిస్తారు. దీంతో గ్రామంలో పోలీసు ఉన్నారనే భయంతో నేరాల తీవ్రత తగ్గుంది. ముఖ్యంగా మహిళలు వారి సమస్యలను మహిళా పోలీసులతో చెప్పుకోవచ్చు. దీంతో చిన్న చిన్న సమస్యలు స్టేషన్‌ దాకా రావు. సచివాలయంలోనే కౌన్సెలింగ్‌ ద్వారా పరిష్కారమవుతాయి. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే పోలీసుస్టేషన్‌కు వస్తారు.

జీరో ఎఫ్‌ఐఆర్‌ ద్వారా3 కేసుల నమోదు
జీరో ఎఫ్‌ఐఆర్‌ అనేది ప్రజలకు ఉపయుక్తమైంది. ఎవ్వరైనా, ఎక్కడైనా సమస్యపై ఫిర్యాదు చేయొచ్చు. ఉదాహరణకు కర్నూలుకు చెందిన వ్యక్తి బస్సులో ప్రయాణిస్తుంటాడు. బ్యాగు చోరీ అవుతుంది. వైఎస్సార్‌ జిల్లాలోని దువ్వూరు వద్ద చూసుకుంటారు. అతను అక్కడే దిగి దువ్వూరు స్టేషన్‌లో ఫిర్యాదు చేయొచ్చు. దీంతో బాధితులు తమ గ్రామం, స్టేషన్‌ పరిధి చూసుకోవాల్సిన పనిలేదు. ఎక్కడ ఫిర్యాదు చేసినా కేసు నమోదవుతుంది. మన జిల్లాలో ఆత్మకూరుతో పాటు మరో రెండు చోట్ల జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. 

సైబర్‌ ఫొరెన్సిక్‌ ల్యాబ్‌తోనేరాలకు చెక్‌
సాధారణ నేరాల కంటే సైబర్‌ నేరాలు 244శాతం పెరిగాయి. సైబర్‌మిత్ర అమలులోకి వచ్చిన తర్వాత సైబర్‌ ఫొరెన్సిక్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేశాం. సైబర్‌ టూల్స్‌పై ప్రత్యేక శిక్షణ తీసుకున్న సిబ్బంది ఉన్నారు. ల్యాబ్‌ సాయంతో చాలా కేసులు పరిష్కారమయ్యాయి. సైబర్‌ కేసులు నమోదైతే.. ఫేస్‌బుక్, వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌లోని సమాచారాన్ని మొబైల్, కంప్యూటర్‌లో తొలగించినా తిరిగి మొత్తం సమాచారాన్ని రివకరీ చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఫేక్‌ అకౌంట్‌లతో నేరం చేసినా, మహిళలతో చాట్‌ చేసి మోసం చేసినా వారిని సులభంగా పట్టుకోవచ్చు. సైబర్‌ కేసుల్లో చాలామందికి నగదు రికవరీ  చేశాం. దీనికి బ్యాంకర్ల సహకారం అవసరం. బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి.. వారికి కూడా సైబర్‌ నేరాలు జరిగే తీరు, తీవ్రత వివరిస్తున్నాం.  ఖాతాల నుంచి డబ్బు తస్కరణ వంటి సందర్భాల్లో బ్యాంకు స్థాయిలోనే లావాదేవీలు నిలిపేసేలా చేస్తాం.  

ఒక సీసీ కెమెరా వందమంది కానిస్టేబుళ్లతో సమానం
సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత కేసుల ఛేదనకు తక్కువ సమయం పడుతోంది. ప్రార్థనా మందిరాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి. మతపరమైన సమస్యలు రాకుండా నివారించేందుకు ఇవి దోహదపడతాయి. సీసీ కెమెరాల ఏర్పాటుకు పెద్ద ఖర్చు కూడా కాదు. రూ.3–4 వేలలోనే కెమెరాలు లభిస్తున్నాయి. బ్యాంకులు, షాపింగ్‌మాల్స్‌ వద్ద కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. ఫ్యాక్షన్‌ గ్రామాల్లో సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఆదోని డివిజన్‌ పరిధిలో ఎక్కువగా అమర్చాం. నంద్యాల, కర్నూలులో  సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎంపీలు పోచా బ్రహ్మానందరెడ్డి, డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ ఎంపీల్యాడ్స్‌ నుంచి రూ.50 లక్షల చొప్పున అందజేశారు. ఈ నిధులతో మున్సిపల్‌ కమిషనర్ల పరిధిలో టెండర్లు నిర్వహించి.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. మునిసిపాలిటీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో అమర్చుతాం. ఇప్పటికే దొంగతనాలు తగ్గాయి. సీసీకెమెరాలు అన్ని ప్రాంతాల్లో పెడితే దొంగలు భయపడతారు. ఒకవేళ దొంగతనం జరిగినా కెమెరాలు ఉంటాయి కాబట్టి కచ్చితంగా దొంగలను పట్టుకుంటాం. ఒక సీసీ కెమెరా వందమంది కానిస్టేబుళ్లతో సమానం. 

స్పందనలో రాష్ట్రంలోనే ప్రథమం
ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహణలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. మధ్యాహ్నం 12.30 వరకూ స్పందన నిర్వహించాలి. కానీ ప్రజలు ఎంతమంది     వచ్చినా సమయంతో పనిలేకుండా ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నాం. ప్రజా సమస్యల పరిష్కారమే పోలీసు ధ్యేయం!  

నేరాలపై తీవ్రంగా స్పందిస్తున్నాం
జిల్లాలో ఏ నేరం జరిగినా సీరియస్‌గా తీసుకుంటున్నాం. కంటైనర్లను కొల్లగొట్టే కంజారా ముఠాను కూడా 20 రోజుల్లోపే పట్టుకున్నాం. అతి కిరాతకమైన ముఠా ఇది. రన్నింగ్‌లోని కొరియర్‌ వాహనాల్లోకి ఎక్కి కొల్లగొడతారు. డ్రైవర్లు గుర్తించి ప్రతిఘటిస్తే నిర్ధాక్షిణ్యంగా చంపేస్తారు. అలాంటి కిరాతక ముఠా అది! కర్నూలు తర్వాత ప్రకాశం జిల్లాలో చోరీ చేశారు. అక్కడ డ్రైవర్‌ మూతికి బట్టలు కట్టేసి రోడ్డుపక్కన పడేసి ఏకంగా కంటైనర్‌ను తీసుకెళ్లారు. ఇలాంటి కేసుల ఛేదనలో పోలీసు సిబ్బంది కృషి అభినందనీయం. టీమ్‌ వర్క్‌తోనే నేరాలు తగ్గిస్తున్నాం. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను కూడా అందరి కృషి, సహకారంతో ప్రశాంతంగా నిర్వహించాం. మంత్రాలయంలో తిక్కారెడ్డి ఘటనలో కూడా ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాం.  

ఏ సమస్య వచ్చినా 100కు డయల్‌ చేయండి
మహిళలు, ప్రజలకు ఏ సమస్య వచ్చినా స్టేషన్‌కు వెళ్లాల్సిన పనిలేదు. డయల్‌ 100కు ఫోన్‌ చేస్తే పోలీసులు స్పందిస్తారు. రోడ్డు ప్రమాదాలు, మెడికల్‌ ఎమర్జెన్సీకి 112కు కాల్‌ చేయొచ్చు. డయల్‌ 100కు ఎక్కువగా ఫోన్లు వస్తాయి. సమస్య పోలీసు పరిధి కాకపోయినా 100కు ఫోన్‌ వస్తే పోలీసులు సంబంధిత శాఖకు సమాచారం అందిస్తున్నారు.   

ప్రజావాణిలో వ్యాసాలు రాశా
పేపర్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ చూడగానే నేను సివిల్స్‌కు ఎంపికైన రోజులు గుర్తొస్తున్నాయి. మాది కర్ణాటకలోని బళ్లారి. సివిల్స్‌ ప్రిపరేషన్‌ టైంలో, ఐపీఎస్‌ అధికారిగా ఎంపికైన తర్వాత కూడా కన్నడ పత్రిక ప్రజావాణిలో వ్యాసాలు రాశా. నేను స్వయంగా కన్నడలో కంపోజ్‌ చేసి, పత్రిక కార్యాలయానికి పంపేవాణ్ని. సివిల్స్‌ విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేలా 2011 వరకూ వ్యాసాలు రాశా. పాడేరు ఏఎస్పీగా వెళ్లిన తర్వాత ఆపేశా. సిగ్నల్స్‌ సరిగా లేకపోవడం, విధినిర్వహణలో ఉండటంతో వ్యాసాలు రాయలేకపోయా.  

మరిన్ని వార్తలు