చిరునవ్వుతో ‘స్పందన’

1 Jul, 2019 08:16 IST|Sakshi
ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్త(ఫైల్‌)

నేటి నుంచి స్పందన కార్యక్రమం

ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు..

జిల్లా అధికారులందరూ హాజరుకావాల్సిందే

ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం

నిత్యం ఏదో ఒక సమస్యతో ప్రజలు కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతుంటారు. అయితే సమస్యలకు మాత్రం పరిష్కారం దొరకని దుస్థితి. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చివేయడానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘స్పందన’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే గ్రీవెన్స్‌ కార్యక్రమాన్ని స్పందన అనే పేరుతో నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుంచి స్వీకరించే ప్రతి అర్జీకి జవాబుదారీతనంతో పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేటితో ప్రారంభం కానున్న స్పందన కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లు, తదితర వివరాలపై సాక్షి కథనం..

సాక్షి, చిత్తూరు కలెక్టరేట్‌: రేషన్‌ కార్డు లేదని.. పాఠశాల, కళాశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని.. పింఛన్లు, తాగునీరు, రోడ్లు, భూ ఆక్రమణలు.. ఇలా ఏదో ఒక సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. మండల స్థాయిలో ఉన్న అధికారులను కలిసి వారి సమస్యలను విన్నవించుకుంటారు. అయితే ఆ స్థాయిలో వారి సమస్యలకు పరిష్కారం దొరకకపోవడంతో ప్రతి సోమవారమూ కలెక్టరేట్‌కు వస్తుంటారు. కలెక్టర్‌కు తమ సమస్యలను విన్నవించుకుంటే పరిష్కారం దొరుకుతుందని ఆశపడుతుంటారు.

గత సర్కారు పాలనలో ప్రజల అర్జీల పరిష్కారానికి కృషి చేసిన పాపానపోలేదు. వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్రలో ప్రజలు ఈ విషయాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తాము అధికారంలోకి వస్తే స్పందన పేరుతో ప్రజల అర్జీలకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపుతామని ఆయన హామీ ఇచ్చారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో స్పందన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

నేడు మొదటి కార్యక్రమం..
జిల్లా స్థాయిలో స్పందన పేరుతో గ్రీవెన్స్‌ కార్యక్రమం సోమవారం మొదటిసారి జరగనుంది. ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. నలుమూలల నుంచి వచ్చే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి ఎదుటే వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టనున్నారు. కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌ హాల్‌లో ప్రత్యేకంగా ప్రజల కోసం కుర్చీలను ఏర్పాటు చేస్తున్నారు. అర్జీదారులను కూర్చోబెట్టి ఆయా శాఖల అధికారుల ఎదుట తక్షణమే సమస్యను పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మరికొన్ని రోజుల్లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసి ప్రజల అర్జీలను నమోదు చేయనున్నారు. అర్జీదారులందరికీ స్పందన పేరుతో రశీదు ఇవ్వనున్నారు.

జిల్లా అధికారులందరూ హాజరుకావాల్సిందే
స్పందన కార్యక్రమానికి జిల్లాలోని ఆయా శాఖల హెచ్‌ఓడీలు హాజరుకావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. గతంలో పలు శాఖల అధికారులు తమ కింది స్థాయి సిబ్బందిని పంపి చేతులు దులుపుకునేవారు. ఇకపై అలాంటి విధానం ఉండకుండా ప్రతి శాఖ జిల్లా అధికారే స్పందన కార్యక్రమానికి తప్పకుండా హాజరుకావాల్సి ఉంటుంది. గైర్హాజరైతే శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు.

అన్ని ఏర్పాట్లు చేశాం..
స్పందన కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. అర్జీదారులను చిరునవ్వుతో పలకరించి వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నాం. స్పందన కార్యక్రమం నిర్వహణపై ముఖ్యమంత్రి సూచనలను తూచా తప్పకుండా పాటిస్తాం. అర్జీ దారులను కూర్చోబెట్టి అప్పటికప్పుడే వారి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం.      – డాక్టర్‌ నారాయణ భరత్‌ గుప్త, కలెక్టర్‌ 

 

మరిన్ని వార్తలు