మూడేళ్ల సమస్య.. మూడు నిమిషాల్లో పరిష్కారం  

30 Jul, 2019 12:00 IST|Sakshi
‘స్పందన’ కార్యక్రమంలో ఎస్పీకి సమస్య చెబుతున్న రిటైర్డు ఉద్యోగి నాగేశ్వరరావు

2017లో తాడిపత్రిలో రిటైర్డ్‌ ఉద్యోగి ఇంట్లో దొంగతనం

నేటికీ కేసు నమోదు చేయని పోలీసులు 

స్పందనలో ఎస్పీని కలిసిన బాధితుడు 

వెంటనే కేసు నమోదు చేయాలని ఎస్పీ ఆదేశం

సాక్షి, అనంతపురం సెంట్రల్‌: మూడేళ్లుగా పోలీసు స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నాడు. ఎస్‌ఐ, సీఐలను ప్రాధేయపడ్డాడు. వచ్చిన ప్రతి డీఎస్పీనీ కలిసి విన్నవించాడు. అయినా ఆయన సమస్య పరిష్కారం కాలేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమంలో సోమవారం నేరుగా జిల్లా ఎస్పీని కలిసి విన్నవించాడు. మూడేళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యను ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు మూడు నిమిషాల్లో పరిష్కరించారు. వివరాల్లోకి వెళితే... తాడిపత్రి పట్టణంలోని జయనగర్‌కాలనీలో నివాసముంటున్న రిటైర్డ్‌ పంచాయతీరాజ్‌ ఉద్యోగి నాగేశ్వరయ్య ఇంట్లో 2017 మార్చి 16న దొంగతనం జరిగింది. తన మనవడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు భార్యతో కలిసి వెళ్లాడు. తాళం వేసిన ఇంటిని గమనించిన దొంగలు వచ్చే సరికి లూటీ చేశారు. బీరువాలోని 3 కేజీల వెండి, 2 తులాల బంగారు నగలను దొంగలించారు. 

కేసు నమోదు చేయని పోలీసులు
మరుసటి రోజు ఇంటికి వచ్చిన నాగేశ్వరయ్య దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనస్థలాన్ని పరిశీలించిన పోలీసులు అన్ని వివరాలు ఆరా తీశారు. బాధితుల నుంచి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు తీసుకున్నారు. క్లూస్‌ టీంను రప్పించి దొంగల వేలిముద్రలు స్వీకరించారు. అయితే చివరకు మాత్రం కేసు నమోదు చేయలేదు. మీ కేసు ప్రత్యేకంగా రిజిస్ట్రర్‌లో నమోదు చేసుకున్నాం.. దొంగలు దొరికిన వెంటనే రికవరీ చేయిస్తామని హామీ ఇచ్చారు. అయితే సంవత్సరాలు గడుస్తున్నా కేసు గురించి పట్టించుకోలేదు. అప్పటి పోలీసు అధికారులు మారిపోవడంతో కేసు మరుగునపడింది. తాజాగా వచ్చిన పోలీసులు మీ కేసు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు కాలేదు.. మేమేమీ చేయలేమని స్పష్టం చేశారు. దీంతో బాధితుడు జిల్లా ఎస్పీ సత్యయేసుబాబును స్పందన కార్యక్రమంలో ఆశ్రయించారు. 

ఎస్పీ స్పందన
సమస్య విన్న జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు వెంటనే తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులతో ఫోన్లో మాట్లాడారు. కేసు గురించి ఆరా తీశారు. వెంటనే కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో బాధితుడు నాగేశ్వరయ్య సంతోషం వ్యక్తం చేశారు. 

శాంతిభద్రతల పరిరక్షణకు వేదిక
ఎస్పీ: ఏమ్మా ఏ ఊరు మీది. మీ ఊళ్లో బెల్టుషాపులు ఉన్నాయా?
బాధితులు: అంటే అయ్యా? 
ఎస్పీ : అదే నమ్మా సారా దుకాణాలు ఉన్నాయా? 
బాధితులు: మందు అయితే అమ్ముతున్నారయ్యా. అయినా వాళ్లను ఎవరూ పట్టుకోలేరు. ఎక్కడో దాచిపెట్టుకొని మందు(మద్యం) అమ్ముతున్నారు. మందు కోసం వస్తే ఎవరికీ తెలియకుండా గుట్టుగా తెచ్చిస్తారు. 
ఎస్పీ : పోలీసులు ఎవరైనా మీ ఊళ్లో తనిఖీలు చేశారా?
బాధితులు : పోలీసులు వత్తాంటారు.. పోతారు.. పట్టుకున్న సందర్భాలు లేవు.
ఎస్పీ : గొడవలు ఎప్పుడైనా జరిగాయా?
బాధితులు : గొడవలైతే ఎప్పుడూ జరగలేదు.
ఎస్పీ: గొడవలైతే ఏం చేస్తారు?
బాధితులు : ఏం చేయాలయ్యా?
ఎస్పీ: డయల్‌ 100 తెలుసు కదా.. ఒకటీ సున్నా సున్నా నెంబర్‌కు వెంటనే ఫోన్‌ చేసి చెప్పండి
సోమవారం స్పందన కార్యక్రమానికి వచ్చిన కొత్తచెరువు మండలం కేశవాపురం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులతో ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు చర్చించిన తీరు ఇది.. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు స్పందన కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా మారిందనేందుకు నిదర్శనమిది.

రవాణాశాఖలో ‘స్పందన’
అనంతపురం టవర్‌క్లాక్‌: రవాణా శాఖలో ఎటువంటి సమస్యలు ఉన్నా స్పందన కార్యక్రమం ద్వారా పరిష్కరించుకోవాలని రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌ శివరామప్రసాద్‌ సూచించారు. సోమవారం స్థానిక రవాణాశాఖ కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీటీసీ శివరామప్రసాద్‌ మాట్లాడుతూ వాహన దారుల సమస్యలు పరిష్కరించడానికి ఆర్టీఏ కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. వాహనదారులకు ఆన్‌లైన్, డ్రైవింగ్‌ లైసెన్సులు తదితర సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వీరారెడ్డి అనే జేసీబీ డ్రైవర్‌ తన సమస్యను పరిష్కరించాలని డీటీసీని కోరారు. డీటీసీ సమస్యకు పరిష్కారం చూపారు.  

మరిన్ని వార్తలు