ప్రజల సమస్యలు తీర్చేందుకే ‘స్పందన’

26 Jun, 2019 09:04 IST|Sakshi
ప్రజల సమస్యలను వింటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి 

సాక్షి, పులివెందుల(కడప) : ప్రజల సమస్యలు తీర్చేందుకే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘స్పందన’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్వగృహం వద్ద ఆయన ప్రజలతో మమేకమయ్యారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను ఆలకించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినందుకే  ప్రజావేదిక తొలగించడానికి వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రజా వేదికే కాకుండా రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులను ఎవరూ స్వాధీనం చేసుకున్నా చర్యలు తీసుకుంటామన్నారు. జగన్‌ అధికారం చేపట్టి నెల రోజులు కూడా గడవకమునుపే తనదైన శైలిలో పరిపాలన చేస్తున్నారన్నారు. జగన్‌ పరిపాలనలో తీసుకుంటున్న నిర్ణయాలు చూసి ప్రజలంతా హర్షిస్తున్నారన్నారు.

టీడీపీ నాయకులు తమ అవినీతి కప్పిపుచ్చుకునేందుకు బీజేపీలో చేరుతున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కచ్చితంగా సాధించి తీరుతామన్నారు. కేంద్రంలోని బీజేపీకి ఎలాంటి మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. అయినా కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కృషి చేస్తామన్నారు. నవరత్నాల పథకాలతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా అండగా ఉండి ముందుకెళతామన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామిలను ఏ ఒక్కటి కూడా మరిచిపోకుండా అమలు చేస్తామన్నారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లుగా ప్రజలకు పాలకులుగా కాకుండా సేవకులుగా ఉండి సేవలందిస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రజలకు సువర్ణపాలన అందించడమే తమ లక్ష్యమన్నారు. మంగళవారం ఉదయం పులివెందుల వైఎస్సార్‌సీపీ నేత వైఎస్‌ మనోహర్‌రెడ్డితో కలిసి ఆర్‌ఎంపీ డాక్టర్లు వైఎస్‌ అవినాష్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ఎంపీతో మొరపెట్టుకున్నారు. 429జీఓను పునరుద్ధరించాలని విన్నవించుకున్నారు. దీనికి సానుకూలంగా స్పందించారు. 

మరిన్ని వార్తలు