అయిన వాళ్లే మోసం చేశారు!

20 Aug, 2019 12:21 IST|Sakshi
ఫిర్యాదులు స్వీకరిస్తున్న అర్బన్‌ ఎస్పీ పి.హెచ్‌.డి.రామకృష్ణ

సాక్షి, గుంటూరు ఈస్ట్‌ : జిల్లా పోలీసు కార్యాలయంలోని అర్బన్‌ జిల్లా సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వందకు పైగా ఫిర్యాదులు వచ్చాయి. పలువురు వృద్ధులు తమ సంతానం తమ వద్ద ఆస్తులు తీసుకుని అన్నం పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదులు విచారించి న్యాయం చేస్తామని బాధితులకు అర్బన్‌ ఎస్పీ పి.హెచ్‌.డి.రామకృష్ణ  హామీ ఇచ్చారు. బాధితుల సమస్యల్లో కొన్ని ....

అధిక వడ్డీ వసూలు చేసి బెదిరిస్తున్నాడు
పాతగుంటూరుకు చెందిన ఎక్సైజ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ శెట్టిపల్లి వెంకట సుబ్బారావు వద్ద 2014లో మద్యం వ్యాపార నిమిత్తం రూ.25 లక్షలు అప్పుగా తీసుకున్నా. వివిధ దఫాలుగా అధికవడ్డీతో రూ.47,27,500 చెల్లించాను. నా నుంచి తీసుకున్న సంతకం చేసిన ఖాళీ బాండ్‌ పేపర్లు, 6 ప్రామిసరీ నోట్లు నాకు ఇవ్వకుండా ఇంకా వడ్డీ డిమాండు చేస్తున్నాడు. నా ఆస్తి అక్రమంగా రాసుకుంటానని ,అక్రమ దావాలు వేసి పరువు తీస్తానని బెదిరిస్తున్నాడు.
–శంకరరావు, గుంటూరు

అంగడి జ్యోతి కుటుంబానికి న్యాయం చేయాలి
వైద్యుల  అభిప్రాయం సరైన సమయంలో అధికారులు పంపని కారణంగా ప్రభుత్వం నుంచి మాకు  అందాల్సిన సహాయంలో రూ.3 లక్షలు రద్దయ్యాయి. అట్రాసిటీ యాక్ట్‌ ప్రకారం అందాల్సిన రాయితీలు అందలేదు. మొదట పోస్టుమార్టం చేసిన డాక్టర్‌ భారతి కేసు విచారణలో అలసత్వం వహించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి. మంగళగిరి పోలీసుల చర్యలు మాకు అనుమానంగా ఉన్నందున జ్యోతి హత్య కేసు సీబీఐకు అప్పగించాలి. హత్య జరిగిన ప్రదేశంలో సెల్‌ఫోన్‌లు, హ్యాండ్‌బ్యాగ్‌లు ఎక్కడ ఉన్నాయో నేటికీ గుర్తించలేదు.నిందితులకు వెంటనే శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి.
– అంగడి ప్రభాకర్, అంగడి జ్యోతి సోదరుడు

కుమారులు అన్నం పెట్టడం లేదు
రూ. 2కోట్లు విలువ చేసే పొలాన్ని ఇద్దరు కుమారులు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. నాకు కిడ్నీ ఆపరేషన్‌ అయినా పట్టించుకోలేదు. ప్రస్తుతం అన్నం కూడా పెట్టడం లేదు.
–భీమిరెడ్డి చినసాంబిరెడ్డి, కొత్తపాలెం,మంగళగిరి మండలం

కుమారుడు ఇల్లు ఆక్రమించుకున్నాడు
రెండవ భార్య చనిపోయింది.ఒంటరిగా నివసిస్తున్నా.మొదటి భార్య కొడుకు నేను ఇంట్లో లేని సమయంలో ఇంటి తాళం పగులగొట్టి ఇల్లు ఆక్రమించుకున్నాడు.ఇంట్లోకి వెళితే కొట్టి బయటకు నెట్టేశాడు. పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. అనారోగ్యం కారణంగా నడవలేని స్థితిలో ఉన్న నేను అడుక్కుని తింటున్నా. 
–తాడిబోయిన బోసు, తాడికొండ

కుదువ పెట్టిన నగలు తిరిగి ఇవ్వడం లేదు
లాలాపేటలోని కిరణ్‌ జ్యూయలర్స్‌ యజమాని వద్ద 2016లో  210 గ్రాముల బంగారు నగలు కుదువ పెట్టి రూ.1,70 లక్షల నగదు తీసుకున్నాను. వడ్డీతో కలిపి మొత్తం చెల్లించగా రసీదులు ఇచ్చాడు. ఆ సమయంలో కిరణ్‌ అనారోగ్యం కారణంగా షాపు మూసివే సి ఇంట్లో ఉన్నాడు. నగలు వేరే చోట కుదువ పెట్టా నని త్వరలో తెచ్చి ఇస్తానని నమ్మించాడు. నగలు ఇవ్వకపోగా బెదిరిస్తున్నాడు. 
–పి.కౌషిక్, పాతగుంటూరు 

ప్రభుత్వ టీచర్‌ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు
కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు  సురేష్‌ తో 2012లో నాకు వివాహం అయింది. 2013లో నన్ను పుట్టింట్లో వదిలి వెళ్లి పోయాడు. కాపురానికి తీసుకు వెళ్తానని చెప్పి రాకపోవడంతో 2015లో కోర్టులో కేసు వేశాను. అయితే నా భర్త 2014 లో ఓ మహిళను వివాహం చేసుకుని కుమార్తె పుట్టిన అనంతరం ఆమెను వదిలి వేశాడని తెలిసింది. ప్రస్తుతం అతనితో పాటు పనిచేసే మరో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని వివాహం చేసుకున్నాడు. నాకు న్యాయం చేయాలి. 
–నీలం శాంతి, సంజీవ నగర్, గుంటూరు

అక్క, బావ అన్యాయం చేశారు
పిత్రార్జితమైన అపార్టుమెంట్‌లోని ఫ్లాట్‌ను  2015లో నలుగురు అక్కలకు రూ.9.60 లక్షలు చెల్లించి రిజిష్టర్‌ కార్యాలయం ద్వారా హక్కు విడుదల దస్తావేజు రిజిస్టర్‌ చేయించుకున్నాను. రెండవ అక్క అనిత భర్త బొల్లెద్దుల ప్రసాద్‌ మా నాన్న పేరు మీద ఉన్న ఎస్‌బీఐ షేర్లు  ట్రాన్స్‌ఫర్‌ కోసం అని చెప్పి ఖాళీ స్టాంప్‌ పేపర్ల మీద నా నుంచి సంతకాలు తీసుకున్నాడు. నేను ఇంటిని అక్క అనితకు అమ్మినట్లుగా విక్రయ స్వాధీన అగ్రిమెంటు తయారుచేయించాడు. నేను ఇంట్లో లేని సమయంలో తాళాలు పగుల గొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. ప్రశ్నించినందుకు నన్ను గాయపరిచారు. విచారించి న్యాయం చేయాలి. 
–కొత్తసిరి అమూల్య, ఏటీ అగ్రహారం

స్నేహితులే ముంచేశారు
2018 డిసెంబర్‌లో కొత్తకారు కొనుగోలు చేశాను. 2019 ఏప్రిల్‌లో నా మిత్రుడు గోపి నా కారు తీసుకువెళ్లి అతని మిత్రులైన పూర్ణ, పవన్‌కుమార్‌కు  ఇచ్చాడు. వారు ప్రకాశం జిల్లాలో కారును చెట్టుకు ఢీకొట్టి ప్రమాదానికి గురిచేశారు. డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తికి ఎల్‌ఎల్‌ఆర్‌మాత్రమే ఉండటంతో నాకు బీమా సొమ్ము కూడా రాలేదు. కొత్త కారు కొనిస్తామని హామీ ఇచ్చి డబ్బులు కూడా ఇవ్వడం లేదు. జూలై 15న ఎస్పీ స్పందనలో ఫిర్యాదు చేస్తే కాపీ తమకు రాలేదని పాతగుంటూరు పోలీసులు తిప్పుతున్నారు. నాకు న్యాయం చేయాలి.
–గుడిపూడి విజయబాబు, మంగళదాసు నగర్, గుంటూరు

భూమికి ఎన్‌ఓసీ ఇప్పిస్తానని మోసం చేశాడు
2014లో వినుకొండలోని రెండు ఎకరాల 43 సెంట్ల పొలాన్ని నలుగురు భాగస్వాములతో కలిసి కొనుగోలు చేశాం. రిజిస్ట్రార్‌ ఆఫీసులో సంప్రదించగా డి లిస్టులో ఉందని తెలిసింది. నా భాగస్వాముల్లో ఒకరికి స్నేహితుడైన బలగం ప్రకాష్‌ కలెక్టర్‌ కార్యాలయంలో పలుకుబడి ఉందని చెప్పి ఎన్‌ఓసీ ఇప్పిస్తానని నమ్మించాడు. పలు దఫాలుగా రూ.40 లక్షలు చెల్లించాం. డబ్బులు అడుగుతుంటే బెదిరిస్తున్నాడు. న్యాయం చేయాలి. 
–రొడ్డా బ్రహ్మానంద రెడ్డి, స్తంభాల గరువు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా