మ్యాచ్‌ఫిక్సింగ్... బయటపడింది

21 Feb, 2014 01:56 IST|Sakshi
మ్యాచ్‌ఫిక్సింగ్... బయటపడింది
  • కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలు
  •  విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదంతో తేటతెల్లం
  •  వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు భాను విమర్శ
  •  జగ్గయ్యపేట అర్బన్, న్యూస్‌లైన్ : రాజ్యసభలో తెలంగాణ బిల్లును ఆమోదించటంతో కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం పార్టీల కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను విమర్శించారు. గురువారం రాత్రి ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. 58 ఏళ్లు కలిసివున్న తెలుగుజాతిని అత్యంత కిరాతకంగా విభజించిన పాపం ఆ మూడు పార్టీలకే దక్కుతుందని, దీంతో భారతదేశ పార్లమెంటు చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారని భాను అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందిన భారతదేశంలో కేవలం తమ స్వార్థం కోసం ఆ రాష్ట్ర అసెంబ్లీలోని మెజార్టీ సభ్యుల ఆమోదం కూడా లేకుండా ఏకపక్షంగా, నిరంకుశంగా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రంలోని ఉభయసభల్లో ఆమోదించటం అప్రజాస్వామికమన్నారు. తెలుగుజాతిపై కక్షకట్టినట్లుగా వారు వ్యవహరించటం దురదృష్టకరమని చెప్పారు.

    కేంద్ర మంత్రులు దద్దమ్మల్లా కూర్చున్నారు...

    కేంద్ర మంత్రులు జేడీ శీలం, కావూరి సాంబశివరావు, చిరంజీవి కూడా చర్చ సమయంలో పల్లెత్తుమాట కూడా మాట్లాడకుండా దద్దమ్మల్లా కూర్చోవటం దారుణమని భాను విమర్శించారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం సయయంలో తెలుగుదేశం సభ్యుడు సుజనాచౌదరి బిల్లుకు ఆమోదం తెలియజేయటంతో కాంగ్రెస్, తెలుగుదేశం కుమ్మక్కు రాజకీయాలు మరోసారి బహిర్గతమయ్యాయన్నారు.
     
    చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతం మరోసారి రుజువైందన్నారు. దేశ చరిత్రలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈ విధంగా కేంద్రప్రభుత్వంతో కుమ్మక్కై మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడటం ద్వారా నీచరాజకీయాలకు తెరతీసినట్లయిందన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, సీపీఎం మాత్రమే కాక దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు కూడా రాజ్యసభలో బిల్లును వ్యతిరేకి ంచటం గమనార్హమన్నారు. దేశ ప్రజలు ఈ వ్యవహారాన్నంతా గమనిస్తున్నారని చెప్పారు. అప్రజాస్వామికంగా వ్యవహరించిన పార్టీలకు తగిన సమయంలో బుద్ధిచెప్పటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు