స్పీకర్‌ స్థానంలో ఉండి అనరాని మాటలు

9 Feb, 2019 02:35 IST|Sakshi

అసెంబ్లీలో స్పీకర్‌ కోడెల  రాజకీయ వ్యాఖ్యలు 

సాక్షి, అమరావతి: చట్టసభలో స్పీకర్‌ స్థానంలో ఉన్న వ్యక్తి నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఈ ఉద్దేశంతోనే సభలోని అన్ని పక్షాలూ స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటాయి. స్పీకర్‌ కూడా అన్ని పార్టీలనూ సమానంగా చూడాలి. కానీ, రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ మాత్రం సభలోనే రాజకీయ వ్యాఖ్యలు చేశారు. సభానాయకుడి(ముఖ్యమంత్రి) సీటులోకి చంద్రబాబు మళ్లీ రావాలని పేర్కొన్నారు. మరోసారి ఆ సీటులోకి మీరే రావాలని ఆకాంక్షిస్తున్నానని సీఎం చంద్రబాబును ఉద్దేశించి అన్నారు.

రాష్ట్ర విభజన అనంతరం తొలి అసెంబ్లీ చివరి సమావేశాల్లో చివరి రోజున శుక్రవారం కోడెల మాట్లాడారు. ‘‘నాపై అనేక ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. పార్టీ మారిన వారిని అనర్హులుగా ప్రకటించలేదని ప్రతిపక్షం, వరుసగా మూడుసార్లు అసెంబ్లీ సమావేశాలకు రాని ప్రతపక్ష సభ్యులను డిస్మిస్‌ చేయాలని అధికారం పక్షం వారు డిమాండ్‌ చేస్తూ వచ్చారు. అన్నింటిపైనా ఆలోచించి న్యాయబద్ధంగా పనిచేశానని భావిస్తున్నా. మరోసారి ఆ సీటు(ముఖ్యమంత్రి)లోకి మీరే(చంద్రబాబు) రావాలని ఆకాంక్షిస్తున్నా’’ అని స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ పేర్కొన్నారు.   

>
మరిన్ని వార్తలు