సీపీఎస్‌ రద్దు చేయాల్సిందే..

12 Aug, 2018 04:04 IST|Sakshi
విజయవాడ జింఖానా గ్రౌండ్‌లో ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన క్విట్‌ సీపీఎస్‌ సభలో ఐక్యత చాటుతున్న నాయకులు

ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య బహిరంగ సభలో వక్తల ఉద్ఘాటన

ఉద్యమంలో చంద్రబాబులా యూటర్న్‌లు తీసుకోవద్దు

సీపీఎస్‌పై టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్,జనసేన వైఖరి స్పష్టం చేయాలి

సీపీఎస్‌ రద్దు చేయిస్తామన్న వైఎస్సార్‌సీపీకి ధన్యవాదాలు

ఏపీఎన్‌జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు టీడీపీ ఏజెంట్‌.. ఆయన్నురానివ్వద్దని సభలో నినాదాలు

సాక్షి, అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం (సీపీఎస్‌) రద్దు చేసే వరకూ పోరాటం ఆపేదిలేదని ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. రాష్ట్రంలో సీపీఎస్‌ అమలు చేసేదిలేదని టీడీపీ ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించే వరకూ సీఎం చంద్రబాబు నాటకాలు నమ్మేది లేదని సంఘాల నేతలు ప్రకటించారు. ఉద్యమంలో చంద్రబాబు మాదిరిగా యూటర్న్‌లు తీసుకోవద్దని సంఘాలను పలువురు నేతలు కోరారు. ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో విజయవాడలోని జింఖాన గ్రౌండ్స్‌లో శనివారం బహిరంగ సభ నిర్వహించారు. సీపీఎస్‌ అమలుతో రాష్ట్రంలో లక్షా 50 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్మెంట్‌ తరువాత పెన్షన్‌ భద్రత కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కనీస స్పందనలేదని ద్వజమెత్తారు. ఉద్యోగుల పొట్టకొట్టే ఈ విధానంపై టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, జనసేన వైఖరి తక్షణం ప్రకటించాలని వారు డిమాండ్‌ చేశారు.

తాము అధికారంలోకి వస్తే సీపీఎస్‌ రద్దు చేయిస్తామని ఇప్పటికే ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. ఎన్నికల వరకు చూడకుండా సీపీఎస్‌ రద్దు కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోను, ఎంపీలు రాజ్యసభలోను ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టాలని పలువురు కోరారు. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయని, ఉపాధ్యాయ, ఉద్యోగులకు అండగా ఉండే రాజకీయ పార్టీలకే మేము దన్నుగా ఉంటామని ప్రకటించారు. సీపీఎస్‌ రద్దు అనేది రాజకీయ నినాదంగా మారాలని, అందుకోసం రానున్న మూడు నెలల్లో పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దీనిలో భాగంగానే సెప్టెంబర్‌ 1న చేపట్టే కలెక్టరేట్‌ల ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఫ్యాప్టో రాష్ట్ర అధ్యక్షుడు పి.బాబురెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో సీపీఎస్‌ రద్దుకు మద్దతు ఇస్తున్న టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఏపీలో నోరు మెదపకుండా రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఫ్యాప్టో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.హృదయరాజు మాట్లాడుతూ.. క్రమశిక్షణతో మెలిగే ఉపాధ్యాయులు తిరగబడితే ఏం జరుగుతుందో పాలకులకు తెలియజెప్పాలన్నారు. ఎమ్మెల్సీలు రెడ్డప్ప బాలసుబ్రహ్మణ్యం, బొడ్డు నాగేశ్వరరావు, కత్తి నర్సింహారెడ్డి, వై.శ్రీనివాసరావు, రాము సూర్యారావు మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగినా సీపీఎస్‌ రద్దు కోసం మండలిలో తమ వాణి వినిపిస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సమాఖ్య జాతీయ నాయకుడు జి.నాగేశ్వరరావు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఏ గఫూర్, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పెద్దన్న, ఏపీఎన్‌జీవో అధ్యక్షుడు పి.అశోక్‌బాబు తదితర నేతలు ఉపాధ్యాయుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. 

క్విట్‌ సీపీఎస్‌ నినాదంతో మూడు జాతాలు
క్విట్‌ సీపీఎస్‌ నినాదంతో చేపట్టిన మూడు జాతాలు 13 రోజులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి విజయవాడ చేరుకున్నాయి. 12 ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కుప్పం, అనంతపురం జిల్లా లేపాక్షి , శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ప్రారంభించిన ఈ జాతాలు అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రజలకు తమ ఇబ్బందులు వివరించి వారి మద్దతు కోరాయి. శనివారం విజయవాడ రైల్వే స్టేషన్‌ నుంచి జింఖానా గ్రౌండ్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వర్షం పడుతున్నా లెక్కచేయక గంటల తరబడి ర్యాలీ, బహిరంగ సభల్లో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

అశోక్‌బాబు గో బ్యాక్‌ అంటూ నినాదాలు..    
ఉపాధ్యాయులకు సంఘీభావంగా వచ్చిన ఏపీఎన్‌జీవో నేత అశోక్‌బాబుకు చేదు అనుభవం ఎదురైంది. అశోక్‌బాబు గో బ్యాక్‌ అంటూ, ఆయనను రానివ్వద్దని పలువురు టీచర్లు పెద్దఎత్తున నినాదాలు చేశారు. అశోక్‌బాబు టీడీపీ ఏజెంటని పలువురు పేర్కొన్నారు. దీంతో సభలో అలజడి రేగింది. ఫ్యాప్టో అధ్యక్షుడు బాబురెడ్డి, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు జోక్యం చేసుకుని సభికులకు నచ్చజెప్పారు. అశోక్‌బాబు మాట్లాడేటప్పుడు కూడా సభలో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

మరిన్ని వార్తలు