అందరికీ 'కంటి'వెలుగు అందిస్తాం

10 Oct, 2019 09:08 IST|Sakshi

విద్యార్థుల్లో దృష్టి లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంధత్వ నివారణ లక్ష్యంగా ‘కంటి వెలుగు’ అమలు చేయనుంది. ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం 11 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రారంభిస్తారు. తొలి దశలో ఈనెల 10 నుంచి 16 వరకు విద్యార్థులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. మలి దశలో దృష్టి లోపాలు ఉన్న విద్యార్థులకు మందులు కళ్లద్దాలు పంపిణీ చేస్తారు. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు.      

సాక్షి, చిత్తూరు : నిత్య జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉన్న కళ్లను మారుతున్న జీవనశైలి కారణంగా అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆహారపు అలవాట్లు, కనీస జాగ్రత్తలు పాటించకపోవడం, రాత్రిళ్లు ఎక్కువగా మేల్కొని టీవీ, సెల్‌ఫోన్లు చూడడం ద్వారా అనేకమంది దృష్టి లోపాల బారిన పడుతున్నారు. ఈ పరి ణామం కొందరి కళ్లల్లో వెలుగును శాశ్వతంగా దూరం చేస్తుండగా మరికొందరికి శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తోంది. ఇటువంటి బాధల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భావించారు. దృష్టిలోపం నివారణ దిశగా అడుగులు వేస్తున్నారు. అక్టోబరు 10న ప్రపంచ కంటి దృశ్య దినోత్సవం సందర్భంగా వైఎస్సార్‌ కంటి వెలుగును ప్రారంభించనున్నారు. 

మొత్తం రెండు దశలు..
తొలి దశలో 15 ఏళ్లలోపు పిల్లలకు, రెండో దశలో మిగిలిన వారికి కంటి పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మొత్తం 6,256 ఉన్నాయి. ఇందులోని 5,73,491 మంది విద్యార్థులకు స్క్రీనింగ్‌ చేయనున్నారు. కంటి పరీక్షలకు సంబంధించి బాల ఆరోగ్య రక్ష అధికారులు, పీహెచ్‌సీ వైద్యాధికారులకు, మండల విద్యాధికారులకు, ఏఎన్‌ఎంలు, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి కిట్లు, కరపత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమం కింద 3 మీటర్ల దూరంగా ఉన్నవి కన్పించకపోతే దృష్టి దోషం ఉన్నట్లు భావించనున్నారు. దృష్టి దోషం ఉన్నవారిని గుర్తించి ఆర్‌బీఎస్‌కే వాహనాల్లో పీహెచ్‌సీలో నిర్వహించే ప్రత్యేక వైద్య శిబిరాలకు తీసుకెళ్తారు. కంటి వైద్య నిపుణులు మరోసారి వారికి పరీక్షలు నిర్వహించి సమస్య ఉన్నవారికి కళ్లద్దాలు అందజేస్తారు. మెల్లకన్ను, శుక్లం ఉంటే వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా శస్త్రచికిత్సలకు సిఫారసు చేస్తారు. 

రెండోదశలో..
పెద్దలకు, వృద్ధులకు స్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆశా, అంగన్‌వాడీ వర్కర్లు, సచివాలయ ఏఎన్‌ఎంలు ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహిస్తారు. కంటి సమస్యలున్న వారిని గుర్తించి ఆరోగ్య ఉప కేంద్రానికి ప్రత్యేక శిబిరానికి తీసుకువెళ్తారు. అక్కడ మెడికల్‌ ఆఫీసర్, ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌ కంటి పరీక్షలు చేస్తారు. అవసరమైన వారికి కళ్లద్దాలు ఇస్తారు. శస్త్రచికిత్సకు సిఫారుసు చేస్తారు. 

నేటి నుంచి ఎస్సార్‌ కంటి వెలుగు
డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబరు 10 నుంచి 16 వరకు నిర్వహించనున్నట్లు డీఎంఅండ్‌హెచ్‌ఓ రామగిడ్డయ్య బుధవారం తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రారంభిస్తారన్నారు.  

మరిన్ని వార్తలు