గ్రానైట్ తరలిపోతోంది!

23 Jul, 2015 00:39 IST|Sakshi

జిల్లాలోని నీలి గ్రానైట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీనికి మంచి ధర పలుకుతోంది. కొంతమంది వ్యాపారులు దీన్నే అవకాశంగా మలుచుకున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా విలువైన గ్రానైట్ బ్లాకులను అర్ధరాత్రి వేళ ఎవరి కళ్లు పడకుండా దర్జాగా పక్క రాష్ట్రాలకు, పాలిషింగ్ యూనిట్లకు తరలించేస్తున్నారు. దీన్ని నివారించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. గ్రానైట్ వ్యాపారులతో అధికారులు కుమ్మక్కై ఈ తంతును నడిపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
 
 టెక్కలి: డివిజన్ కేంద్రమైన టెక్కలి పరిసరాల్లో సుమారు 40 వరకు గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. వీటిలో కొన్ని క్వారీల నుంచి అధికారుల ఆన్‌లైన్ పర్మిట్లతో బ్లాకులు తరలిస్తుండగా, మరికొన్ని క్వారీల్లో మాత్రం అర్ధరాత్రి సమయం ఎటువంటి అనుమతులు లేకుండా జాతీయ రహదారుల గుండా భారీ వాహనాలపై యథేచ్ఛగా బ్లాకులను తరలించే పనిలో ఉంటున్నారు. టెక్కలి, కోటబొమ్మాళి, నందిగాం సమీపంలో సుమారు 65 వరకు గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. కొన్ని బ్లాకులను ఆయా యూనిట్లకు తరలించి మరి కొన్ని బ్లాకులను టెక్కలికి సమీపంలోని ఒడిశాతోపాటు మరికొన్ని రాష్ట్రాలకు రాత్రి సమయాల్లో తరలిస్తున్నారు. టెక్కలి పరిసర ప్రాంతాల్లోని గ్రానైట్ వ్యాపారులు బ్లాకుల పర్మిట్ల కోసం మైన్స్ కార్యాలయానికి ప్రతిరోజూ సుమారు ఐదు నుంచి 35 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా బ్లూ, బ్రౌన్ గ్రానైట్లకు సంబంధించి గ్యాంగ్స్, సూపర్ గ్యాంగ్స్, కట్టర్ విభాగాలుగా ఒక్కో దరఖాస్తుకు సుమారు 2,475 రూపాయలు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
 
  ఇదే ప్రక్రియతో గత నెల సుమారు ఒక కోటీ 19 లక్షల 92 వేల 623 రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులే చెబుతున్నారు. అయితే ఇదంతా కొంత మేరకు మాత్రమే జరుగుతున్న ప్రక్రియ. రాత్రి సమయాల్లో తరలిపోతున్న గ్రానైట్ వల్ల నెలకు సుమారు 50 లక్షల వరకూ ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా అర్ధరాత్రి సమయలో దాడులు లేకపోవడంతో ఎక్కడా కేసులు నమోదు చేసిన పరిస్థితి లేదు. ప్రభుత్వ ఆదాయానికి గండిపడేలా సాగుతున్న ఈ అక్రమ వ్యాపారాలపై అధికారులకు కొంతమంది ఫిర్యాదులు అందజేసినా వారు కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. క్వారీల్లో కూడా గనులు, భూగర్భ శాఖ అధికారులతో పాటు విజిలెన్స్ తనిఖీలు సైతం లేకపోవడంతో అక్రమ వ్యాపారాలకు మరింత పెట్రేగిపోతున్నారు. ఏటా కోట్లాది రూపాయలు వ్యాపారాలు కొనసాగుతున్న గ్రానైట్ పరిశ్రమలో  అక్రమ వ్యాపారాలు జోరందుకుంటున్నాయి.
 
 నీలి గ్రానైట్ చరిత్ర ఇది
 అంతర్జాతీయ స్థాయి గ్రానైట్ వ్యాపారంలో టెక్కలి నీలి గ్రానైట్‌దిప్రత్యేక స్థానం. టెక్కలితో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాల్లోని 40 క్వారీల నుంచి  ఏటా సుమారు 50  కోట్ల రూపాయల విలువైన నీలి గ్రానైట్ ప్రపంచ వ్యాప్తంగా సరఫరా జరుగుతోందని అధికారుల అంచనా. ఇక్కడ నీలి గ్రానైట్‌కు మన దేశంతో పాటు విదేశాల్లో గిరాకీ ఉంది. ఏటా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే గ్రానైట్ వస్తు ప్రదర్శనలో ఇక్కడి నీలిగ్రానైట్ ఉత్పత్తులకు ప్రత్యేక స్థానం లభిస్తోంది. 1992 సంవత్సరంలో తమిళనాడుకు చెందిన గ్రానైట్ వ్యాపారస్తులు ఈ ప్రాంతంలో క్వారీలను ప్రారంభించారు. ఇక్కడ నుంచి నీలి గ్రానైట్ ముందుగా బెంగళూరు, మద్రాసు, తమిళనాడు, కర్ణాటక, సేలం తదితర ప్రాంతాలకు తరలివెళ్తుంది. అక్కడ నుంచి ఇటలీ, జర్మనీ, పోలెండ్, స్విట్జర్లాండ్, చైనా, తైవాన్, సింగపూర్ తదితర ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతోంది. ఇక్కడ అధికంగా గ్రానైట్ క్వారీలు ఉండడంతో దానికి అనుసంధానంగా గ్రానైట్ పాలిసింగ్ యూనిట్లు వెలుస్తున్నాయి. 40 గ్రానైట్ క్వారీలకు గాను సుమారు 65 వరకు పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి.  
 

మరిన్ని వార్తలు