వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్

12 Aug, 2014 01:32 IST|Sakshi
వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్

* కర్ణాటక తరహాలో రూపకల్పన: ఏపీ మంత్రివర్గం నిర్ణయం
* పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది, నీరు-చెట్టు,
* డ్వాక్రా సంఘాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యత
* ‘ఎన్టీఆర్ ఆరోగ్య సేవ’ పథకం ద్వారా పేదలు, ఉద్యోగులు,
* పాత్రికేయులకు రూ. 2.5 లక్షల వరకు నగదు రహిత వైద్యం
* ఆదివాసీ జిల్లా ఏర్పాటు ప్రతిపాదన లేదు
* ప్రభుత్వ ఆస్పత్రుల పటిష్టానికి సంఘాలు.. ఎమ్మెల్యే సూచించిన వ్యక్తి చైర్మన్
* అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా

 
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సోమవారం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు వెల్లడించారు. కర్ణాటక తరహాలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఉంటుందని చెప్పారు. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌కు, టీడీపీ ప్రవేశపెట్టనున్న ప్రత్యేక బడ్జెట్‌కు తేడా ఏమిటని విలేకరులు ప్రశ్నించగా.. వ్యవసాయ శాఖ మంత్రి అధ్యయనం చేస్తున్నారని మాత్రమే సమాధానమిచ్చారు.
 
‘ఎన్టీఆర్ ఆరోగ్య సేవ’ పథకం ద్వారా పేదలు, ఉద్యోగులు, పాత్రికేయులకు గరిష్టంగా రూ. 2.5 లక్షల వరకు నగదు రహిత వైద్యం అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆదివాసీ జిల్లా ఏర్పాటు ప్రతిపాదన లేదని చెప్పారు. స్థానికతపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం విజయనగరం జిల్లా బుడ్డిపేటకు చెందినదని, ఆయనే ఇప్పుడు స్థానికతకు ‘1956’ నిబంధన పెట్టారని ఎద్దేవా చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించినప్పుడు సంబరాలు చేసుకున్న కేసీఆర్.. ఇప్పుడు అదే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్నారు. తెలంగాణకు ప్రత్యేక ఉన్నత విద్యామండలి ఏర్పాటు, వ్యవసాయ వర్సిటీ పేరు మార్పు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అంశాల్లో వివాదాలు సృష్టించారన్నారు.
 
మంత్రివర్గం తీసుకున్న మిగతా నిర్ణయాలు..
 -    పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది, నీరు-చెట్టు, డ్వాక్రా సంఘాల ద్వారా పేదరిక నిర్మూలన.. ఈ నాలుగు కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
 -    ప్రసిద్ధ ఆలయాలకు సందర్శకులను, ఆదాయాన్ని, ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడానికి ‘టెంపుల్ టూరిజం’ అమలుకు ప్రాధాన్యత
 -    ప్రభుత్వ ఆస్పత్రులను పటిష్టం చేయడానికి ప్రత్యేక చర్యలు. స్థానిక ఎమ్మెల్యేలు సూచించిన వ్యక్తిని చైర్మన్‌గా, ఆర్‌ఎంవో, ఆస్పత్రి సూపరింటెండెంట్, పాలన అధికారి సభ్యులుగా ‘ఆస్పత్రి అభివృద్ధి సంఘం’ ఏర్పాటు.
 ఆయా ఆసుపత్రుల్లో వసతుల కల్పన బాధ్యతలు అభివృద్ధి సంఘానికి
 -    మాతా శిశు మరణాలను తగ్గించడానికి సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని సౌకర్యాల కల్పన
 -    ఆధార్ ఫీడింగ్‌ను నూరు శాతం పూర్తి చేయాలని నిర్ణయం
 -    మంత్రులు సొంత జిల్లాలకే పరిమితం కాకూడదు. కేంద్రం నుంచి ఆయా శాఖలకు రావాల్సిన నిధులు సాధించడంపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు మంత్రులు, శాఖాధిపతులు, కార్యదర్శులు కలిసి వ్యూహరచన చేయాలి. విజయవంతంగా అమలు చేయడానికి పరస్పరం చర్చించుకోవాలి
 -    నిరంతర విద్యుత్ సరఫరా(24ఁ7)కు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. అక్టోబర్ 2 నుంచి నిరంతర విద్యుత్ సరఫరా. ప్రస్తుతం రోజుకు 143 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా, 142 మిలియన్ యూనిట్లు సరఫరా అవుతోంది. హర్యానా నుంచి 200 మెగావాట్లు, నెల్లూరు జిల్లాలోని మీనాక్షి పవర్ ప్రాజెక్టు నుంచి 120 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం జెన్‌కో వద్ద 2.5 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉంది. అందువల్ల విద్యుత్ సరఫరాలకు ఇబ్బందులు ఉండవు
 -    శాసనసభ సమావేశాలను అర్థవంతంగా నిర్వహించాలని నిర్ణయం
 -    విజయవాడలోని కంచి కామకోటి పీఠం వారి వేంకటేశ్వరస్వామి దేవాలయానికి ప్రభుత్వం ఇచ్చిన 532 చదరపు మీటర్ల స్థలం లీజును మరో 35 ఏళ్లుపొడిగింపు. లీజు రుసుం ఏడాదికి రూ. 6 వేలు పెంపు.
 
 18 నుంచి బడ్జెట్ సమావేశాలు
 ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి.గవర్నర్ నరసింహన్ సోమవారం నోటిఫికే షన్ జారీ చేసినట్లు శాసనసభ కార్యదర్శి కె.సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. 18న ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 20న బడ్జెట్ సమర్పించనున్నారు. అసెంబ్లీ సమావేశాల తేదీలు, అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం చంద్రబాబుఅధ్యక్షతన సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో చర్చించారు.సమావేశాలు సెప్టెంబర్ 13 వరకు జరగనున్నాయి. శాసనమండలి సమావేశాలు ఉదయం 10 గంటలకు పబ్లిక్ గార్డెన్స్‌లోనిమండలిహాలులో మొదలవుతాయి.ఎజెండాపై శాసనసభా వ్యవహారాల మండలి (బీఏసీ)లో చర్చించి నిర్ణయిస్తారు. కేబినెట్ సమావేశం అనంతరం సమాచార, పౌర సంబంధాల మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేసే విధంగా సమావేశాలను అర్థవంతంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా అన్ని పార్టీల సభ్యులు చర్చల్లో పాల్గొనాలి. సభ గౌరవాన్ని పెంపొందించే విధంగా వ్యహరించాలి’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు