మహాత్మా..మహర్షీ

30 Jan, 2015 00:58 IST|Sakshi
మహాత్మా..మహర్షీ

చెదిరిన బాపూజీ కలలు
గాంధీజీ వ్యక్తిగత సహాయకుడు వి.కల్యాణం ఆవేదన
బాపూజీ చివరి క్షణాల ప్రత్యక్షసాక్షి గాంధీజీ వ్యక్తిగత సహాయకుడు  వి.కల్యాణం (బాపూజీ చివరి క్షణాల ప్రత్యక్షసాక్షి)

 
అది భారతదేశ చరిత్రలో చీకటి రోజు.. జనవరి 30, 1948.. సాయంత్రం 5 గం.17 నిమిషాలు..ఢిల్లీలోని బిర్లాహౌస్ ప్రాంగణం.. ప్రార్థనా మందిరానికి వెళ్తున్న 78 సంవత్సరాల మహాత్మాగాంధీ తుపాకీగుళ్లకు  నేలకొరిగారు. నాధూరాం గాడ్సే జరిపిన ఈ కాల్పుల ఘటనతో అక్కడి వారంతా నిశ్చేష్టులయ్యారు. ఆ సమయంలో గాంధీజీ వెన్నంటే ఉన్న మహాత్ముని వ్యక్తిగత కార్యదర్శి వి.కల్యాణం వెంటనే ఈ వార్తను నాటి ప్రధాని నెహ్రూకు ఫోన్ ద్వారాను, హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు స్వయంగా తెలియజేశారు. 1943-48 మధ్యకాలంలో మహాత్మునికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసి, గాంధీజీ చివరి క్షణాల వరకూ ఆయనతో సన్నిహితంగా మెలిగిన కల్యాణం మహాత్మునితో తనకున్న అనుభవాలను-జ్ఞాపకాలను పంచుకున్నారు. జయప్రకాశ్‌నారాయణ, సి.రాజగోపాలాచారి సెక్రటరీగా కూడా కల్యాణం పని చేశారు. విశాఖపట్నం ఏయూలోని గాంధీ స్టడీ సెంటర్ ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొనేందుకు చెన్నయ్ నుంచి వచ్చిన ఆయన సాక్షితో ముచ్చటించారు.
 
 
 గాంధీ మహాత్ముని వ్యక్తిగత కార్యదర్శిగా నాకు ఆ మహనీయునితో ఐదేళ్ల సాన్నిహిత్యం ఉందని ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా    పనిచేసిన వి.కల్యాణం  చెప్పారు.  ఏయూలోని గాంధీ స్టడీ సెంటర్ ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొనేందుకు చెన్నయ్ నుంచి వచ్చిన ఆయన సాక్షితో ముచ్చటించారు. ఆయన ఏమన్నారంటే..

 - ఏయూ క్యాంపస్

మహరాష్ట్రలోని వార్థా సేవాశ్రమంలో నేను చేరే నాటికి బాపూజీకి అంత సన్నిహితుణ్ణి అవుతానని అనుకోలేదు. సేవాశ్రమానికి జమ్నాలాల్ బజాజ్ ఇచ్చిన వ్యవసాయక్షేత్రంలో కూరగాయలు పండిస్తూ, అక్కడ పండిన వరి, గోధుమ  ఆశ్రమ అవసరాలకు వినియోగించేవాళ్లం. సోప్స్, ఆయిల్ సొంతంగా తయారు చేసుకునే వారం. దుస్తులు కూడా మేమే రాట్నంపై తయారు చేసుకుని ధరించేవాళ్లం. ఆశ్రమాన్ని పరిశుభ్రంగా ఉంచటంతో అద్దంలా కనిపించేంది. ఇప్పుడు స్వచ్ఛభారత్ పేరుతో ప్రధాని మోడీ ఆచరించమంటున్న పరిశుభ్రతా కార్యక్రమాన్ని నేను 80 ఏళ్ల నుంచే ఆచరిస్తున్నాను. ఇప్పటికీ రోజులో 11 నుంచి 12 గంటల వరకూ ఎవరి సహాయం లేకుండా అన్ని పనులు చేసుకుంటున్నాను. గాంధీజీకి దేశంలోని వివిధ ప్రాం తాల నుంచి వచ్చే ఉత్తరాలను ఏ భాషకాభాషగా విభజించి ఆయనకు అందులో ముఖ్యాంశాలు చేరవేయటం ఆశ్రమంలో నా పాత్ర.

 మహాత్ముని మార్గం పట్టదా..

స్వాతంత్య్రానంతరం భారతదేశం ఎలా అభివద్ధి చెందాలో మహాత్ముడు కన్న స్వప్నాలు చెదిరిపోయాయి. కాంగ్రెస్ స్థానంలో లోక్ సేవక్ సంఘ్ ఆవిర్భవించాలన్న ఆయన ఆశయం నెరవేరలేదు. చెడు వినవద్దు..కనవద్దు..చూడవద్దు..అన్న ప్రబోధంకాంగ్రెస్ రాజకీయ పార్టీగా అవతరించి నెహ్రూతో సహా అందరూ గాంధీ విలువలకు తిలోదకాలిచ్చారు. అవినీతిపరులైన ఎంపీలను సైతం అప్పటి పాలకులు వత్తాసు పలికారు. దేశంలో ఉన్న పల్లెలన్నీ విద్య, వైద్యపరంగా వెనుకపడ్డాయి. హార్స్‌రేడింగ్, లాటరీలు, మద్యాన్ని నిషేధించాలని గాంధీజీ పదేపదే చెప్పేవారు. అవేవీ నేటికీ ఆచరణ కాలేదు. 67 సంవత్సరాల స్వాతంత్య్ర భారతం గాంధీ ఆలోచనలు పట్టించుకోకపోవటం దురదష్టకరం.

నా దృష్టిలో బ్రిటిష్ పాలనలోనే భారతదేశం చక్కగా ఉండేది. ఇప్పుడూ అడ్మినిస్ట్రేషన్‌లో అధ్వాన పరిస్థితి అదే విధంగా అపరిశుభ్రతలో మాత్రమే మనం ముందున్నాం. ఇది విచారకరవిషయం. ఆంగ్లేయుల పాలనలో ‘లా’ కచ్చితంగా అమలయ్యేది. చివరికి సైకిల్‌కు లైట్ లేకపోయినా అప్పట్లో జరిమానా వేసేవారు. ఇప్పుడంతా లంచాల మయమైపోయింది. ఎవరు తప్పు చేసినా ధనం ముసుగులో అది చెల్లిపోతుంది. 1922-47 మధ్య కాలంలో ఈవ్‌టీజింగ్, దోపిడీలు, అత్యాచారాలవంటి కేసులు అసలు కనిపించేవి కావు. అన్ని వ్యవస్థలూ భ్రష్టు పట్టి దేశంలో జీవించటమే సామాన్యుడికి శాపంగా మారింది.

డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఎంకెగాంధీ.ఇన్ వెబ్‌సైట్ కు రోజూ 3వేల క్లిక్కులు వస్తే .. అందులో 90 శాతానికి పైగా యువతవే.   ఆత్మకథ, సత్యశోధన (మై ఎక్సపెర్‌మెంట్ విత్ ట్రూత్) ఇప్పటి దాకా అన్ని భాషలు కలిపి 50 లక్షలకు పైగా ప్రతులు విక్రయించారు. ఏటా రెండు లక్షల కాపీలు అమ్ముడవుతున్నాయి. అది ఓ వ్యక్తిత్వ వికాస గ్రంథంగా యువత ఆదరిస్తోంది.

నేడు మహాత్మునిపై ప్రత్యేక ప్రసంగం

గురువారం మధ్యాహ్నం విశాఖకు చేరుకున్న వి. కల్యాణంకు ఏయూలోని గాంధీ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఏబీఎస్‌వీ రంగారావు, ఏపీ సర్వోదయ మండలి రావిప్రోలు సుబ్రహ్మణ్యం గాంధీ స్టడీ సెంటర్ నిర్వాహకులు, పలువురు గాంధీ అభిమానులు స్వాగతం పలికారు. సక్రవారం ఉదయం 8 గంటలకు ఏయూ ప్రాంగణంలో ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం 9గంటలకు ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో నిర్వహించే గాంధీ వర్థంతి సభలో ఆయన ప్రధాన ప్రసంగం చేస్తారు. విశిష్ట అతిథిగా ఏయూ వీసీ జీఎస్‌ఎన్ రాజు పాల్గొంటారని ప్రొఫెసర్ రంగారావు తెలిపారు.

మరిన్ని వార్తలు