కరెంటు కొనుగోళ్లపై నేడు ప్రత్యేక కమిటీ భేటీ

7 Nov, 2019 05:42 IST|Sakshi

పవన, సౌర విద్యుత్‌ కొనుగోళ్లపై కేంద్రానికి సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ  

ఇప్పటికే అప్పుల్లో ఉన్న డిస్కంపై మరింత భారం మోపొద్దని స్పష్టీకరణ

సంపద్రింపుల కోసం నలుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం

ఢిల్లీలో జరిగే భేటీకి హాజరు కానున్న రాష్ట్ర అధికారులు

సాక్షి, అమరావతి: పవన, సౌర విద్యుత్‌ కొనుగోలు వల్ల విద్యుత్‌ సంస్థలపై(డిస్కంలు) పడే ఆర్థిక భారంపై సంప్రదింపులు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. డిస్కంలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబర్‌ 12న రాసిన లేఖను కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. విద్యుత్‌ కొనుగోళ్లు, డిస్కంల సమస్యలపై సంప్రదింపుల కోసం నవంబర్‌ 4న ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో కేంద్ర సంప్రదాయేతర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి శాఖ (ఎంఎన్‌ఆర్‌ఈ) కార్యదర్శి, కేంద్ర విద్యుత్‌ శాఖ కార్యదర్శి, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్నారు.

కమిటీ తొలి సమావేశం గురువారం ఢిల్లీలో జరగనుంది. పవన, సౌర విద్యుత్‌ కొనుగోలు వల్ల డిస్కంలకు ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యలపై చర్చించనున్నారు. పవన, సౌర విద్యుత్‌ కొనుగోలును కేంద్రం తప్పనిసరి చేయడం వల్ల డిస్కమ్‌లు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నాయని దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. ఇలాంటి కరెంటు కొనాలంటే యూనిట్‌కు రూ.3.50 చొప్పున పరిహారంగా రాష్ట్రాలకు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి.  

మరిన్ని వార్తలు