‘ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టి’

30 May, 2020 16:03 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణా కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టామని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌ లాల్‌ తెలిపారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.... రాష్ట్రం సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నాం. ప్రభుత్వ లక్ష్యాన్ని ఛేదించేందుకు సాంకేతిక టెక్నాలజీని  వినియోగిస్తున్నాం. రాత్రివేళల్లో గస్తీని ముమ్మరం చేశాం.  ప్రత్యేక నిఘా వ్యవస్థతో మెరుపు దాడులు చేస్తున్నాం. సీసీ కెమెరాలు, మొబైల్‌ చెక్‌పోస్టులతో పాటు ఇన్‌ఫార్మర్లను ఏర్పాటు చేసుకున్నాం. అధికారులు ఎంత పటిష్టంగా పనిచేసినా ప్రజల సహకారం కీలకం. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరిస్తేనే ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో చేరుకోగలం. ఇప్పటి వరకు 485 కేసులు నమోదు చేశాం. 955 మంది పై కేసులు పెట్టాం. 730 వాహనాలు సీజ్ చేశాం. 29629.075 టన్నుల ఇసుక స్వాధీనం చేసుకొన్నాం. ఇసుక, మద్యం అక్రమ రవాణాలో పట్టుబడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పాత నేరస్థులైతే పీడీయాక్టు ప్రయోగిస్తాం. నిబంధనలు ఉల్లంఘించే వారిపై రౌడీషీట్స్‌ తెరవాలని యోచిస్తున్నాం. ఆస్తులను కూడా జప్తు చేసేందుకు వెనకాడం. అక్రమార్కులను వెంటనే రిమాండ్‌కు తీసుకునేలా జ్యుడీషియల్‌ వ్యవస్థనూ సంప్రదిస్తున్నాం.  ఇసుక, సిలికా, గ్రావెల్‌ నిల్వలు ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం అని వినీత్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు