‘పది’కి సన్నద్ధం

9 Dec, 2019 04:20 IST|Sakshi
విజయవాడలోని సాంఘిక సంక్షేమశాఖ బాలికల వసతి గృహంలో రాత్రిపూట చదువుకుంటున్న విద్యార్థినులు

సంక్షేమ హాస్టళ్లలో ప్రత్యేక కసరత్తు

నాలుగు సబ్జెక్ట్‌ల్లో విద్యార్థులకు ట్యూషన్‌

ఎప్పటికప్పుడు స్లిప్‌ టెస్ట్‌లు, మోటివేషన్‌ క్లాసులు

ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్‌

సాక్షి, అమరావతి: అది విజయవాడలోని సాంఘిక సంక్షేమ శాఖ స్పెషల్‌ హాస్టల్‌. సమయం సాయంత్రం ఆరున్నర. పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ప్రకటించడంతో హాస్టళ్లలో విద్యార్థులు పట్టుదలతో చదువుతున్నారు. నిశ్శబ్ద వాతావరణంలో పుస్తకాలలో లీనమైపోయారు. సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అధికారులు కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. స్టడీ అవర్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు సరఫరా చేశారు. అలాగే సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్స్‌తో సాంఘిక సంక్షేమ శాఖ స్పెషల్‌ హాస్టళ్లలో ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంగ్లిష్, హిందీ, మ్యాథమ్యాటిక్స్, సైన్స్‌ సబ్జెక్టుల్లో ప్రత్యేకంగా ట్యూషన్‌ చెప్పిస్తున్నారు. ఈ ఏడాది పదో తరగతిలో ఉత్తీర్ణతా శాతం పెంపునకు సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. హాస్టళ్లు, స్కూళ్లలో విద్యార్థుల చదువుపై పర్యవేక్షణతో పాటు వారికి కావాల్సిన సౌకర్యాలు కూడా కల్పిస్తున్నది. 

హాస్టళ్లలో, స్కూళ్లలో ప్రత్యేక పాఠాలు..
హాస్టళ్లలో విద్యార్థులకు మోటివేషన్‌ క్లాసులు చెప్పిస్తున్నారు. ఉదయం రెండు గంటలు, సాయంత్రం మూడు గంటల పాటు అభ్యసన సమయాలు కేటాయిస్తున్నారు. పిల్లలు ఎలా చదువు పరిశీలనకు డిప్యూటీ డైరెక్టర్‌లు, జాయింట్‌ డైరెక్టర్‌లు ఎప్పటికప్పుడు విజిట్స్‌ నిర్వహిస్తున్నారు. నిరంతరం స్లిప్‌ టెస్ట్‌లు పెడుతూ.. విద్యార్థుల మార్కుల ద్వారా వారి అభ్యసన తీరును పరిశీలిస్తున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఆల్‌ ఇన్‌ వన్‌ స్టడీ మెటీరియల్‌ను విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. బృంద చర్చలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక స్కూలు ముగిసిన తరువాత ఒక గంటపాటు స్టడీ అవర్‌ కొనసాగిస్తున్నారు. అలాగే పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 759 సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో 13,070 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. మొత్తం 1,066 ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్లల్లో వీరు విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరిలో 8,071 మంది బాలురు, 4,999 మంది బాలికలు ఉన్నారు. తెలుగు మీడియంలో ఎక్కువ మంది చదువుతున్నారు. 

మరిన్ని వార్తలు