అటవీ సంపద అడవి బిడ్డలదే..

2 Mar, 2016 00:33 IST|Sakshi

పాలకులకు కనువిప్పు కలిగించే ‘దండకారణ్యం’
  విప్లవ నటుడు ఆర్.నారాయణమూర్తి
 
 పెద్దాపురం(సామర్లకోట) : అటవీ సంపదను విదేశీయులకు, బహుళజాతి సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంద ని, దానిపై పోరాటంగానే ‘దండకారణ్యం’ చిత్రాన్ని నిర్మించినట్టు ప్రముఖ దర్శక, నిర్మాత, విప్లవ నటుడు ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. మంగళవా రం పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడా రు. స్నేహచిత్ర బ్యానర్‌పై దండకారణ్యం చిత్రాన్ని రూపొందించినట్టు చెప్పారు. ఈ చిత్రంలో గద్దర్ మూడు పాటలు పాడారని తెలిపారు.
 
  అడవితల్లి పురాణాల ప్రకారం, సీతారాములకు, పాండవులకు నీడను ఇచ్చిందని, అటువంటి దండకారణ్య సంపదను విదేశీయులకు కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. స్వాతంత్య్రం కోసం విదేశీ యులను తరిమికొట్టేందుకు పోరాటాలు చేస్తే, నేటి పాలకులు విదేశీయులను వెల్‌కం ఇండియా అంటూ స్వాగతం పలుకుతున్నారని దుయ్యబట్టారు. అడవిలో ఉండి దోచుకోవడానికి కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం రెడ్‌కార్పెట్ పరుస్తోందని విమర్శించారు. దండకారణ్యంలో ఆదివాసీల పాదాల కింద ఉన్న సహజ సంపదను వెలికితీస్తూ, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 ఆదివాసీల అనుమతి లేకుండా ఎటువంటి ఖనిజ సంపదను వెలికితీయడానికి వీల్లేదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా ఖాతరు చేయడం లేదని ఆరోపించారు. ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దేశంలో 14 రాష్ట్రాల్లో ఉన్న దండకారణ్యాల నుంచి సంపదను దోచుకుపోతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని మండిపడ్డారు. ఆదివాసీల హక్కుల రక్షణ కోసం ఉద్యమాలు చేసే ఉద్యమాలను అణచివేయడం కోసం మిలటరీ బలగాలను దింపుతున్నారని ఆరోపించారు.
 
 దాంతో దండకారణ్యం రణరంగంగా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్‌కౌంటర్ల పేరుతో పోలీసులు, ఆదివాసులు చనిపోతున్నారని, ఈ మారణహోమాలు ప్రభుత్వాలే సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వాలు బేషరతుగా మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
 

మరిన్ని వార్తలు