నేడు హైకోర్టుకు ‘సిట్‌’ నివేదిక

13 Nov, 2018 04:45 IST|Sakshi

     ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు

     నివేదికతో ఏసీపీ హైదరాబాద్‌ పయనం

     కొద్దిరోజులుగా పోలీసు అధికారుల కసరత్తు 

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించిన వివరాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు హైదరాబాద్‌ పయనమయ్యారు. ఈ కేసు పురోగతిని మంగళవారం తమకు సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలంటూ అడ్వొకేట్‌ జనరల్‌ను ఉమ్మడి హైకోర్టు ధర్మాసనం ఆదేశించిన నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం సిట్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఏసీపీ బీవీఎస్‌ నాగేశ్వరరావు, మరికొంతమంది సిబ్బందితో హైదరాబాద్‌ వెళ్లారు. దర్యాప్తు నివేదికను రూపొందించేందుకు సిట్, ఇతర ఉన్నతాధికారులు కొద్దిరోజులుగా కసరత్తు చేశారు. ఉన్నత న్యాయస్థానం ఏయే అంశాలపై దృష్టి సారిస్తుందో ముందుగా అంచనా వేసి అందుకనుగుణంగా వీరు నివేదికను సిద్ధం చేశారు.

అక్టోబర్‌ 25న విశాఖపట్నం ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్‌ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న జనుపల్లి శ్రీనివాసరావు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తును స్వతంత్ర సంస్థకు అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదే అంశంపై వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మరో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్లను విచారిస్తున్న హైకోర్టు ధర్మాసనం.. సిట్‌ దర్యాప్తు పురోగతిపై తమకు సమగ్ర నివేదిక ఇవ్వాలని, సిట్‌కు నేతృత్వం వహిస్తున్న అధికారి, ఆ బృందంలో ఉన్న ఇతర పోలీసు అధికారుల వివరాలను కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ మేరకు సిట్‌ అధికారులు మంగళవారం హైకోర్టుకు తమ నివేదికను సమర్పించనున్నారు.

మరిన్ని వార్తలు