ప్రత్యేక బృందాలతో దర్యాప్తు

16 Nov, 2014 01:13 IST|Sakshi

తాడేపల్లిగూడెం : సంచలనం కలిగించిన యువతి సజీవ దహనం కేసులో పురోగతి సాధించే దిశగా పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. యువతి మృతదేహానికి శనివారం సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం చేశారు. ఇప్పటికే  కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఐడీ పార్టీ సభ్యులు, ఇతర సిబ్బంది జాతీయ రహదారి బైపాస్‌పై ఉన్న చెక్‌పోస్టులు, టోల్ గేట్ల వద్ద సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. దీంతో పాటు తాడేపల్లిగూడెం, పెంటపాడు, తాడేపల్లిగూడెం మండలం అనంతపల్లి, చేబ్రోలు పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవల కనిపించకుండా పోయిన యువతులకు సంబంధించి నమోదు చేసిన కేసులలో ఫొటోల ఆధారంగా, హత్యకు గురైన యువతి ముఖ కవళికలను సరిపోల్చి చూస్తున్నారు. కాలిపోగా మిగిలిన యువతి చేతుల వే ళ్ల నుంచి ఫింగర్‌ప్రింట్‌ను తీసుకున్నారు. ఆధార్‌కు ఆ ముద్రలను అనుసంధానం చేసి, క్లూ లాగే పనిలో పోలీసులు ఉన్నారు.
 
 యువతి దహనం కాగా మిగిలిన భాగాలలో ఉన్న కపాలం (స్కల్) నుంచి సూపర్ ఇంపోజిషన్ పద్ధతిలో ఆనవాళ్లను తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. హైద్రాబాద్‌లో పోలీసు విభాగానికి చెందిన ఫోరెన్సిక్ ల్యాబ్‌కు యువతి స్కల్‌ను పంపించారు. కపాలం, దవడ ఎముక, పుర్రెపై ఎత్తుపల్లాల ఆధారంగా టెక్నాలజీ సాయంతో సూపర్ ఇంపోజిషన్ పద్ధతిలో ఒక ఆకారం వస్తుంది. దీనిని బట్టి వచ్చిన ఆకారంతో , మిస్సింగ్ కేసులలో ఉన్న యువతుల ఫొటోలను, ముఖ కవళికలను సరిపోల్చుతారు. మ్యాచ్ ఆయితే తర్వాత ప్రక్రియలోకి వెళతారు. యువతి ఫొటో ఆధారంగా ఆమె చదివిన విద్యాసంస్థ, కుటుంబ నేపథ్యం, పరిచయాలు, పూర్వ చరిత్ర, యువతికి ఉన్న స్నేహితులు, వారి ప్రవర్తన, యువతికి ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? అనే కోణంలో పరిశోధన సాగించి, నిందితులను పట్టుకొనే వీలుంటుంది. కాగా యువతి డీఎన్‌ఏ సేకరించి విజయవాడ, హైదరాబాద్ ల్యాబ్స్‌కు పంపించారు.

మరిన్ని వార్తలు