రైతు భరోసా.. ఇక కులాసా

26 Sep, 2019 13:07 IST|Sakshi

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం

ఇప్పటికే 2.80 లక్షలమందికి అర్హత

క్షేత్రస్థాయిలో పరిశీలన

94 వేల మంది కౌలు రైతుల గుర్తింపు

ప్రత్యేకాధికారుల నియామకం

వైఎస్సార్‌ భరోసా.. రైతుల జీవితాల్లో వెలుగులునింపనుంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని అక్టోబర్‌ 15 నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతమైంది.   

సాక్షి ప్రతినిధి, ఏలూరు: రైతు భరోసా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగం పుంజుకుంది. ఏటా మే నెలలో రైతులు సాగు మొదలుపెట్టేందుకు పెట్టుబడిగా రూ.12,500 ఇస్తామని ఎన్నికల ముందు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలుపొందిన వెంటనే ఈ హామీ అమలుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఈ ఏడాది అక్టోబర్‌ 15 నాటికి రైతు భరోసా అందించాలని నిర్ణయించింది. లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీని కోసం ప్రతి నియోజకవర్గానికీ ఒక ప్రత్యేక అ«ధికారిని కలెక్టర్‌ ముత్యాలరాజు నియమించారు. ప్రధానమంత్రి కిసాన్‌ పథకం కింద వెబ్‌ల్యాండ్‌ సమాచారం ఆధారంగా 3,45,978 మందిని అర్హులుగా గుర్తించారు. ప్రస్తుతం ఆ డేటాను వైఎస్సార్‌ భరోసా పథకానికి కూడా అన్వయించి పరిశీలన చేస్తున్నారు. మంగళవారం వరకు 3,14,183 మంది రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించి 2,61,801 మందిని అర్హులుగా గుర్తించారు. తాజాగా   మరో 18,641 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. మిగిలిన వారిని కూడా నిబంధనలకు అనుగుణంగా అర్హత ఉంటే ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇంకా 20 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉండటంతో ఆన్‌లైన్‌ చేసే ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ భూ యజమాని ఇంటికి వెళ్లి డేటాను సిద్ధం చేయడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరు క్షేత్రస్థాయిలో తిరిగి పరిశీలిస్తారు. భూ యజమానుల కుటుంబాలకు అక్టోబర్‌ 15న రూ.12,500 ఇస్తారు.

కౌలు రైతులకూ వర్తింపు
కౌలు రైతులకు కూడా ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుతకౌలు రైతుల్లో  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ భూమిలేని సాగుదారునికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని వర్తింపజేయనుంది. ఇప్పటి వరకూ జిల్లాలో 2.40 లక్షల మంది కౌలు రైతులకు ఎల్‌ఈసీ కార్డులు అందజేశారు. అయితే గత ప్రభుత్వం టార్గెట్లు పెట్టడంతో  బినామీ పేర్లతో పెద్ద ఎత్తున కౌలు రైతు కార్డులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలన చేయడంతో 94 వేల మందికి మాత్రమే అర్హత ఉన్నట్టు గుర్తించారు. అయితే జిల్లాలో కౌలు రైతులు భారీగా ఉండటంతో అందరికీ పథకం వర్తించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు.  ఈ పథకం చేపలు, రొయ్యల చెరువులకు వర్తించదు.

ప్రత్యేకాధికారుల నియామకం
ఈ పథకాన్ని సక్రమంగా అమలయ్యేలా చూడడానికి లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించారు. నిడదవోలు నియోజకవర్గానికి కుక్కునూరు సబ్‌ కలెక్టర్‌ ఆర్‌వీ సూర్యనారాయణను, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ వైవీ ప్రసన్నలక్ష్మిని పోలవరం నియోజకవర్గానికి, ఏలూరు ఆర్డీఓ బీఎస్‌ నారాయణరెడ్డిని ఉంగుటూరు నియోజకవర్గానికి,  కొవ్వూరు ఆర్డీఓ బి.నవ్యను కొవ్వూరు నియోజకవర్గానికి, నరసాపురం ఆర్డీఓ అబ్దుల్‌ నిజాముద్దీన్‌  సలీమ్‌ఖాన్‌ను నరసాపురం నియోజకవర్గానికి, హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎ.దుర్గేష్‌ను ఆచంట నియోజకవర్గానికి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎస్‌.కరుణకుమారిని గోపాలపురం నియోజకవర్గానికి,  ఇడా సెక్రటరీ ఝాన్సీరాణిని దెందులూరు నియోజకవర్గానికి,  స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఆర్‌.ప్రభాకరరావును తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి, మైనార్టీస్‌ ఏడీ బి.భిక్షారావును భీమవరం నియోజకవర్గానికి, హార్టికల్చర్‌ డీడీ టీవీ సుబ్బారావును ఉండి నియోజకవర్గానికి, డీఎఫ్‌ఓ(ఎస్‌ఎఫ్‌) ఎం.శ్రీనివాసరావును తణుకు నియోజకవర్గానికి, జెడ్పీ సీఈఓ వి.నాగార్జునసాగర్‌ను ఏలూరు నియోజకవర్గానికి, ఫిషరీస్‌ డీడీ కె.ఫణిప్రకాష్‌ను చింతలపూడి నియోజకవర్గానికి,  ఏపీఎంఐపీ పీడీ కే.సజానాయక్‌ను పాలకొల్లు నియోజకవర్గానికి ప్రత్యేకాధికారులుగా నియమించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా