గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

5 Apr, 2015 02:18 IST|Sakshi

అధికారులకు జేసీ ఆదేశం
 
పాతగుంటూరు : గ్రామాల అభివృద్ధికి అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అధికారులకు ఆదేశించారు. జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో శనివారం డ్వామా ఆధ్వర్యంలో ఎంపీడీవోలు, ఏపీవోలతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా గ్రామాల్లో రోడ్లు, సైడు కాల్వలు, పారిశుద్ధ్య నిర్మూలన వంటి కార్యక్రమాలు చేపట్టవచ్చని వివరించారు.

ఇతర శాఖల నుంచి వచ్చే నిధులను, ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు కలుపుకుని గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. ప్రధానంగా గ్రామంలోని శ్మశానవాటికల్లో ఉన్న మొక్కలను తొలగించి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకునేలా అధికారులు ప్లానింగ్ చేసుకోవాలన్నారు. నీరు- చెట్టు కార్యక్రమం ద్వారా గ్రామాల్లో మొక్కలు నాటడం, పంట పొలాల్లో చెక్‌డ్యామ్‌లు నిర్మించడం వంటి కార్యక్రమాలు చేపట్టవచ్చన్నారు.

చెత్తాచెదారాన్ని వర్మి కంపోస్టు ఎరువు కింద వాడాలన్నారు. గ్రామాలకు కేటాయించిన బడ్జెట్ ఆధారంగా ప్రణాళిక ఉండాలని సూచించారు. డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్ హరిబాబు చౌదరి మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కూలికి వంద రోజులు పనిదినాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. 2015-16 సంవత్సరానికి రూ.76.9 కోట్లు మంజూరయ్యాయని, 81 లక్షల పనిదినాలను కల్పించే విధంగా చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. ముందుగా మరుగుదొడ్లు పనితీరుపై మండలాల వారీగా పీడీ, ఎంపీడీవోలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని  సూచించారు.

లబ్ధిదారులు వచ్చేలా చర్యలు తీసుకోవాలి

ఈనెల 7న చంద్రన్న సంక్షేమ పాలన కార్యక్రమం ప్రారంభం కానుందని, దాన్ని విజయవంతం చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ ఆర్.మల్లికార్జునరావు అధికారులను కోరారు. 2013-14 సంవత్సరం, 2015-16 సంవత్సరాలకు వివిధ రుణాలు పొందేందుకు ఎంపికైన లబ్ధిదారులను ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చేలా ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక బీఆర్ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు, వివిధ శాఖల అధికారులు హాజరవుతారని చెప్పారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.బాలాజీనాయక్, గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి జి.విజయకుమార్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ జయరాజ్, జెడ్పీ సీఈఓ బి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు