ఏరువాక సాగింది...

14 Jun, 2014 00:03 IST|Sakshi
ఏరువాక సాగింది...

విఘ్నేశ్వరా ఈ ఏడాదైనా సాగుకు ఆటంకం లేకుండా చూడు.. భూమాతా మా ఇంట ధాన్యరాశులు నిండాలని దీవించు.. అంటూ అన్నదాతలు వేడుకున్నారు. వ్యవసాయ పరికరాలను, వృషభ రాజులను పూజించి సాగుకు శ్రీకారం చుట్టారు. హలాల నెత్తుకుని పొలాలకు బయలుదేరిన ఇంటి యజమానులకు మహిళలు హారతులిచ్చారు. జ్యేష్ట శుద్ధ పౌర్ణమి రోజున ఏటా ఏరువాక పండుగను ఘనంగా నిర్వహించుకోవడం గ్రామాల్లో ఆనవాయితీ. ఈ సందర్భంగా శుక్రవారం నరసరావుపేట మండలం యల్లమంద గ్రామంలో ఏరువాక ఇలా సాగింది..
 
 నరసరావుపేట రూరల్ : ఏరువాక సాగింది.. కర్షకుల కళ్లల్లో ఆనందం ఉప్పొంగింది.. భూమితల్లి మురిసిపోయింది. తమ ఇంటి యజమానులు పొలాల వెంట బయలుదేరుతుంటే మహిళాలోకం హారతి పట్టింది.
 
  పెద్దా, చిన్న, సన్నకారు రైతులు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు వృషభరాజులకు ప్రత్యేక పూజలు చేసి హలాలు భుజానెత్తుకొని కోటి ఆశతో సాగు పనులు చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఏరువాక జేష్ట శుద్ధ పౌర్ణమినాడు పండుగను ఘనంగా నిర్వహించుకోవడం మండలంలోని పలు గ్రామాల్లోని రైతులకు ఆనవాయితీగా వస్తోంది. విఘ్నేశ్వరా.. ఈ ఏడాదైనా మా సాగుకు, మా ఇంట దిగుబడురాసులకు విఘాతం కలిగించవద్దు అని వేడుకుంటూ గ్రామాల్లోని గణపతి ఆలయాల్లో రైతులు ప్రత్యేక పూజలు చేశారు.
 
  మండలంలోని యల్లమంద, పాలపాడు, పెదరెడ్డిపాలెం, కేసానుపల్లి, పెట్లూరివారిపాలెం, ఇక్కుర్రు, పమిడిపాడు, కొండకావూరు, గురవాయిపాలెం తదితర ప్రాంతాల్లో ఏరువాక సాగింది. అన్నదాతలు ముల్లుకర్ర చేతపట్టి, మర్రి ఆకులు మరచెంబులో నీరు, విఘ్నేశ్వరునికి ఉండ్రాళ్లు నైవేద్యంగా సమర్పించారు. నలుదిక్కులా పసుపు, కుంకుమ వెదజల్లి సాగుకు శ్రీకారం చుట్టారు. యల్లమంద గ్రామంలో వందలాదిమంది మహిళలు నూతన వస్త్రాలు ధరించి విఘ్నేశ్వరాలయం వరకు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆడపడుచులు తమ పుట్టింటికి వచ్చి సేద్యానికి సహకారం అందించే వ్యవసాయ పనిముట్లు, అరకలు, ఎడ్లకు ప్రత్యేక పూజలు చేశారు.

మరిన్ని వార్తలు