శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ

28 Apr, 2019 09:16 IST|Sakshi
వరాహస్వామి ఆలయంలో మహోసంప్రోక్షణ నిర్వహిస్తున్న అర్చక స్వాములు

తిరుమల: తిరుమలలోని వరాహస్వామివారి ఆలయంలో శనివారం శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ నిర్వహించారు. ఇందులో భాగంగా ఐదు రోజుల పాటు ప్రత్యేక ఆరాధనలు, అభిషేకాలు నిర్వహించారు. తిరుమల శ్రీభూవరాహస్వామి ఆలయ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ సందర్భంగా 4 రోజుల పాటు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించా రు. ఈనెలæ 22న ఉదయం రుత్విక్‌ వరణం, రాత్రి అంకురార్పణ చేశారు. 23న కళాకర్షణం చేపట్టారు. 25న అష్టబంధన కార్యక్రమం, 26న మహాశాంతి హోమం, మహాశాంతి అభిషేకం నిర్వహించారు. శనివా రం ఉదయం 11.07 నుంచి మధ్యాహ్నం 1.16 గంటల మధ్య కర్కాటక లగ్నంలో శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ నిర్వహించారు. ఉదయం మహాపూర్ణాహుతి, తర్వాత ఆలయ విమాన గోపురానికి యాగశాలలోని కలశంతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం నిలిపి వేశారు.

విశేష ఆరాధనలు, నైవేద్యాలు
విమాన గోపుర శిఖరంలో నలుగురు దేవతలుంటారు. వీరిని విమానం ప్రపధ్యే.., విష్ణుమయం ప్రపధ్యే.., దేవావాసం ప్రపధ్యే.., వైకుంఠోద్భవం ప్రపధ్యే.. అనే మంత్రాలతో ప్రార్థిస్తారు. గోపురం చుట్టూ 24 మంది ఆవరణ దేవతలు ఉంటారు. మహాసంప్రోక్షణతో యాగశాలలో కుంభంలో ఉన్న దేవతామూర్తుల శక్తిని బింబం(విగ్రహం)లోకి ఆవాహన చేశారు. విమానగోపురంలోని దేవతల శక్తితో పాటు వరాహస్వామి, విష్వక్సేనుడు, రామానుజాచా ర్యులు, పుష్కరిణి వద్ద ఉన్న ఆంజనేయస్వామి విగ్రహాలకు తిరిగి దైవశక్తి చేకూరింది. దేవతా మూర్తుల విగ్రహాలకు 12 జీవస్థానాలు, 4 ఉపస్థానాలు, 48 కళలు ఉంటాయి.

కళాకర్షణతో తొలగించిన ఈ 48 కళలను మహాసంప్రోక్షణతో తిరిగి ఆవాహన చేశారు.. మహాసంప్రోక్షణ అనంతరం విశేష ఆరాధనలు, నైవేద్యాలు సమర్పించారు. ఆ తర్వాత అక్షతారోపణం చేపట్టారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. రాత్రి 7 నుంచి 9గంటల వరకు వరాహస్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమాల్లో టీటీడీ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్, జేఈఓ కెఎస్‌ శ్రీనివాసరాజు, సీవీఎస్వో గోపినాథ్‌ జెట్టి, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, వీఎస్వోలు మనోహర్, ప్రభాకర్, డెప్యూటీ ఈఓలు హరీంద్రనాథ్,  నాగరత్న, ఆలయ ఓఎస్డీ పాల శేషాద్రి, బొక్కసం బాధ్యులు గురురాజారావు తదితరులు పాల్గొన్నారు.

మహద్భాగ్యం
మహాసంప్రోక్షణ నిర్వహించే అవకాశం రావడం మహద్భాగ్యంగా భావిస్తున్నట్టు టీటీడీ ఈఓ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. గతంలో 1982లో ఈ ఆలయంలో మహాసంప్రోక్షణ జరిగిందని, తిరిగి ఇప్పుడు నిర్వహించే అవకాశం తమకు దక్కిందని అన్నారు. ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేసేందుకు ఈ బాలాలయ కార్యక్రమాల సందర్భంగా కొలతలు తీసుకున్నట్టు ఈవో తెలిపారు. ఇక్కడి సేనాధిపతి వారికి, ఆంజనేయ స్వామికి, రామానుజులకు బంగారు పూత పూసిన మకరతోరణాలు సమర్పించామని, వీటి విలువ దాదాపు రూ.7 లక్షలని తెలిపారు. అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణకు భక్తులందరూ సహకరించారని, టీటీడీ అర్చకస్వాములు, ఇంజినీరింగ్‌ తదితర అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది బాగా కృషి చేశారని కృతజ్ఞతలు తెలియజేశారు.

37 ఏళ్ల తర్వాత వరాహస్వామి ఉత్సవమూర్తి దర్శనం
తిరుమలలో వరాహస్వామి ఉత్సవమూర్తి శనివారం రాత్రి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వరాహస్వామివారి ఆలయంలో మహాసంప్రోక్షణ పూర్తయిన సందర్భంగా స్వామివారి ఊరేగింపు జరిగింది. ఈ ఆలయంలో గతంలో 1982వ సంవత్సరంలో మహాసంప్రోక్షణ నిర్వహించినపుడు వరాహస్వామి ఉత్సవమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు. తిరిగి 37 ఏళ్ల తరువాత శనివారం స్వామివారు ఊరేగింపుగా రావడంతో పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్‌ కుమార్‌ సింఘాల్, జేఈఓ  కెఎస్‌ శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు  వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారులు  మోహనరంగాచార్యులు, అనంతశయన దీక్షితులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు