‘ఉపాధి’తో వారికి జీవనోపాధి

3 May, 2020 03:35 IST|Sakshi

తిరిగొచ్చిన వలస కూలీల కోసం ప్రత్యేక విధానం తేవాలి

పది ఎకరాలున్న రైతుల పొలాల్లోనూ ఉపాధి పనులకు అవకాశం కల్పించాలి

కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన

ఈ ఏడాది ఉపాధి పథకంలో కొత్తగా మరో 16 రకాల పనులకు అనుమతి తెలపాలని ప్రతిపాదన

సాక్షి, అమరావతి: ప్రత్యేక పనిలో నైపుణ్యం ఉండి.. ఇప్పటి దాకా వేర్వేరు నగరాలు, పట్టణాల్లో ఉపాధి పొందుతూ,  ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పెద్ద సంఖ్యలో తిరిగి గ్రామాలకు వచ్చిన ప్రత్యేక కేటగిరీ వలస కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా జీవనోపాధిని కల్పించే కార్యక్రమాల అమలు చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరింది. కరోనా నేపథ్యంలో వేలాది మంది కార్మికులు సొంత గ్రామాలకు తిరిగొచ్చారని, వారు మరింత కాలం గ్రామాల్లోనే ఉండాల్సి ఉంటుందని తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం.. వివిధ వృత్తుల్లో పాక్షిక, పూర్తి స్థాయి నైపుణ్యం ఉన్న వారికి సంబంధిత పనులను ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టేలా ఒక విధానం అమలు చేయాలని కోరింది. ఉపాధి హామీ పథకం ద్వారా ఎలాంటి కొత్త పనులకు అనుమతించాలన్న విషయంపై రెండు రోజుల క్రితం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ అన్ని రాష్టాల గ్రామీణాభివృద్ది శాఖ అదికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర అధికారులు ఈ ప్రతిపాదన చేశారు. పథకంలో ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ప్రవేశపెట్టాల్సిన పనులపై రాష్ట్ర అధికారులు చేసిన ప్రతిపాదనలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఒక నివేదిక కూడా కేంద్రానికి  పంపింది. 

రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిపాదనలివీ..
► పది ఎకరాలున్న రైతుల పొలాల్లో కూడా ఉపాధి హామీ పథకంలో పండ్ల తోట పెంపకం, బీడు భూముల చదును వంటి పనులకు అనుమతించాలి. ప్రస్తుతం వ్యవసాయ,  అనుబంధ పనుల్లో ఇప్పటి వరకు అయిదెకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకంలో అనుమతి ఉంది. కరువు మండలాలు, గిరిజన ప్రాంతాల్లోనైనా ఈ పరిధిని పది ఎకరాలకు పెంచాలి. 
► వరుసగా రెండు మూడేళ్ల పాటు వంద పనిదినాలు ఉపాధి హామీ పథకంలో పని పొందిన కుటుంబాలకు అదనపు పని దినాలు కల్పించే విషయం పరిశీలించాలి. ఆ కుటుంబాలు ఉపాధి హామీ పథకంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయని పేర్కొంది. 
► వేలాది రజక కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేలా దోభీ ఘాట్‌ల నిర్మాణాలకు అనుమతి తెలపాలి. ప్రతి దోభీ ఘాట్‌లో అవసరమైన వసతుల కల్పనకు అనుమతించాలి. 
► గ్రామాల్లో ఎండిపోయిన బావుల్లో తిరిగి నీటి ఊట ఏర్పడేలా పూడికతీత పనులకు అనుమతివ్వాలి.
► రైతులు పండించిన కూరగాయలకు మంచి ధర వచ్చే వరకు తమ గ్రామంలోనే నిల్వ ఉంచుకునేలా చిన్న పాటి కోల్డు స్టోరేజీల నిర్మాణంతో పాటు గ్రామాల్లో హెల్త్‌ సబ్‌ సెంటర్లు,  విలేజ్‌ అగ్రి క్లినిక్‌లు, కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి అనుమతించాలి. 

మరిన్ని వార్తలు