ఐపీఎస్‌లకు ఎస్పీజీ శిక్షణ

13 Jan, 2014 03:49 IST|Sakshi

 సాక్షి, హైదరాబాద్:  రాష్ట్ర పోలీసుశాఖ సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. నాలుగు నెలల్లో పార్లమెంట్,h జరుగనున్న నేపథ్యంలో ఐపీఎస్ అధికారులకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి వచ్చే అగ్రనేతలు, వివిధ పార్టీల ద్వారా పోటీచేసే అభ్యర్థులకు భద్రత కల్పించడంపై ఈ శిక్షణలో ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధానమంత్రితోపాటు దేశవ్యాప్తంగా పలువురు కీలక నేతలకు భద్రత కల్పించడం ఎస్పీజీ ప్రత్యేకత. ఈ నేపథ్యంలో వీవీఐపీల భద్రతకు సంబంధించి తొలిసారి ఎస్పీజీ ద్వారా ఐపీఎస్‌లకు శిక్షణ అందిస్తున్నారు. జిల్లా ఎస్పీ, డీఐజీ, ఐజీ, శాంతిభద్రతల వ్యవహారాలను పర్యవేక్షించే అదనపు డీజీల వరకూ ఈ శిక్షణ అందిస్తున్నారు. రాజాబహదూర్ వెంకటరామారెడ్డి రాష్ట్ర పోలీసు అకాడమీ (ఆర్‌బీవీఆర్ అప్పా)లో మూడు దశల్లో శిక్షణ కొనసాగుతోంది.
 
 ఎన్నికల సందర్భంగా క్షేత్రస్థాయి వ్యవహారాలను పర్యవేక్షించే అధికారులను దశలవారీగా ఈ శిక్షణకు పంపుతున్నారు. ఇప్పటివరకూ 50 మంది ఐపీఎస్ అధికారులకు శిక్షణ పూర్తయిందని, వచ్చే నెలాఖరువరకూ వివిధ దశల్లో పలు బ్యాచ్‌లకు శిక్షణ అందిస్తామని ఆర్‌బీవీఆర్ అప్పా డెరైక్టర్ ఎం. మాలకొండయ్య ‘సాక్షి’కి తెలిపారు. నేతల భద్రత కోసం రాష్ట్రస్థాయిలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులకు కూడా ఎస్పీజీ  శిక్షణ అందిస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు