మురిగిన నిధులే తిరిగొచ్చాయి

11 Feb, 2014 01:36 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి: ఈసారీ అవే విదిలింపులు. పాత కేటాయింపులతోనే సరిపుచ్చారు. ఆర్థిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్(2014-15) జిల్లావాసులను ఉసూరుమనిపించింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల ముందుకు వచ్చిన ఈ బడ్జెట్‌లో జిల్లాకు కొత్తగా ప్రత్యేక కేటాయింపులేవి లేకపోవడం తీవ్ర నిరాశను కలిగించింది. 2013-14 బడ్జెట్‌లాగానే ఈ బడ్జెట్‌లో సింగూర్ ప్రాజెక్టు, సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూలకు పాత కేటాయింపులు కేటాయించారు.

జిల్లాలో మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు సింగూర్‌కు రూ.40 కోట్లు, పుల్కల్ మండలం సుల్తాన్‌పూర్‌లో నిర్వహిస్తున్న జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలకు రూ.121 కోట్ల నిధులను ఈ బడ్జెట్‌లో కేటాయించారు. జహీరాబాద్ మండలం చిరాగ్‌పల్లితో పాటు రాష్ట్రంలో మరో రెండు ప్రాంతాల్లో సమీకృత చెక్‌పోస్టుల నిర్మాణాల కోసం రూ.25 కోట్ల నిధులు కేటాయించారు. ఇవి మినహా జిల్లాకు ప్రత్యేక కేటాయింపులేవీ లేవు.  

 మళ్లీ అదే కథ..
 సింగూర్ ప్రాజెక్టుపై కాల్వలతోపాటు ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్నాయి. సుమారు రూ.58.36 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన సింగూర్ కాల్వల పథకం పనులు 55 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ఈ పథకం పూర్తి కావాలంటే ఇంకా రూ.26 కోట్ల నిధులు అవసరం. రూ.20.36 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పనులు 42 శాతం పూర్తయ్యాయి. ఎత్తిపోతల పూర్తికావాలంటే రూ.12 కోట్లు నిధులు అవసరం. దాదాపు రూ.38 కోట్ల నిధులను ఖర్చు చేస్తే ఈ రెండు నిర్మాణాలు పూర్తయి ఆయకట్టుకు నీళ్లు పారనున్నాయి.

 గతేడాది కింద ఈ పనుల ఏ స్థితిలో ఉన్నాయో ప్రస్తుతం అలానే ఉన్నాయి. పనుల్లో ఏమాత్రం పురోగతి లేకపోవడంతో గతేడాది బడ్జెట్‌లో కేటాయించిన రూ.40 కోట్ల నిధులు మురిగిపోయాయి. దీంతో సింగూర్ ప్రాజెక్టు గత బడ్జెట్‌లో కేటాయించిన రూ.40 కోట్లనే ఈ ‘సారీ’ విదిలించారు. వచ్చే ఏడాదికాలంలోనైనా ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే కేటాయించిన నిధులు వినియోగంలోకి రానున్నాయి. సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాల పరిస్థితి కూడా దాదాపు అంతే. గత బడ్జెట్‌లో కేటాయించిన రూ.121 కోట్ల నిధులను పూర్తిగా వినియోగించుకోకపోవడంతో మళ్లీ వాటినే తిరిగి కేటాయించారు.

 ప్రాణ‘హిత’మే
 ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు ఈసారి కేటాయింపులు పెరిగాయి. గత బడ్జెట్‌లో రూ.737.05 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్‌లో రూ. 1051.05 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 16.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నాయి. ఒక్క మెదక్ జిల్లాలోనే 5,19,152 ఎకరాల ఆయకట్టుకు నీరు పారనున్నాయి. కేటాయించిన నిధులను సకాలంలో వినియోగించుకుంటేనే సమీప భవిష్యత్తులో ప్రాజెక్టు పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు