వలస కూలీలు వచ్చే లోపు ప్రత్యేక క్వారంటైన్‌ సెంటర్లు

4 May, 2020 03:54 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న మంత్రి ఆళ్ల నాని. చిత్రంలో కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ చైర్మన్‌ కృష్ణబాబు

రైళ్ల ద్వారా వలస కూలీలు, విద్యార్థులు, యాత్రికుల్ని తీసుకొస్తాం

డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

సాక్షి, అమరావతి: ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి చెందిన వలస కూలీలు వచ్చే లోగా ప్రత్యేక క్వారంటైన్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. ఆదివారం విజయవాడలో కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ చైర్మన్‌ కృష్ణబాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 14 రాష్ట్రాల్లో ఏపీకి చెందిన వారు రెండు లక్షల మంది ఉన్నారని, ఇతర రాష్ట్రాల వారు 12,794 మంది ఇక్కడ రిలీఫ్‌ క్యాంపుల్లో ఉన్నారన్నారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని తీసుకొచ్చే విషయంలో మొదటి ప్రాధాన్యత వలస కూలీలకు, కార్మికులకు ఉంటుందన్నారు. రెండో దశలో యాత్రికులు, విద్యార్థులు, పర్యాటకులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. తొమ్మిది రైళ్ల ద్వారా రాష్ట్రానికి చెందిన వారిని తీసుకొస్తామని వివరించారు. వీరి కోసం ప్రతి గ్రామ సచివాలయంలో 10–15 పడకలను సిద్ధం చేస్తామన్నారు. మొత్తం లక్షకు పైగా పడకలతో క్వారంటైన్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆళ్ల నాని ఇంకా ఏమన్నారంటే..

► రెడ్‌ జోన్లలో ఆర్టీసీ బస్సుల్లో నిత్యావసరాలు, కూరగాయల కోసం మొబైల్‌ రైతు బజార్లు ఏర్పాటు చేస్తాం.
► ప్రతి పీహెచ్‌సీలో మందులు అందుబాటులో ఉంచి సబ్‌ సెంటర్ల ద్వారా పంపిణీ చేస్తున్నాం. ఇందుకోసం మోటార్‌ సైకిళ్లు, కిట్‌ బ్యాగ్‌లు అందుబాటులో ఉంచాం.
► మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే సోమవారం విజయవాడ నుంచి రెండు రైళ్లు బలార్షాకు బయలుదేరతాయని కృష్ణబాబు తెలిపారు.
► ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు spandana.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
► మౌంట్‌ అబూలో ఉన్న ఏపీకి చెందిన 670 మందికి రైలు ఏర్పాటు చేశారు. ఎన్నారైలకు ఆయా దేశాలు రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించాయి. 6 వేల మంది గల్ఫ్‌ నుంచి, 4,500 మంది ఇతర దేశాల నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరిని పంపేందుకు విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ, ఏపీలో ఉన్నవారిని గ్రూప్‌ల ద్వారా పంపిస్తాం. అనుమతి ఉంటే చెక్‌పోస్టుల వద్ద వారిని అనుమతించాలి.   

మరిన్ని వార్తలు