వినాయక చవితికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

6 Sep, 2013 01:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ సి.వినోద్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు ఈ ప్రత్యేక  బస్సులు ఈ నెల 6, 7 తేదీల్లో బయల్దేరి వెళతాయి. రోజూ  తెలంగాణ జిల్లాలకు రాకపోకలు సాగించే 2,836 రెగ్యులర్ బస్సులతోపాటు 6న 145, 7వ తేదీన 300 బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
 
  ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ చార్జీలనే తీసుకుంటారు. నగరంలోని మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్ల నుంచి, పలు  ఆర్టీసీ టికెట్ బుకింగ్ కేంద్రాల నుంచి ఈ ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. పై రెండు రోజుల్లో ఆదిలాబాద్‌కు 15, నిజామాబాద్‌కు 20, కరీంనగర్‌కు 90, వరంగల్‌కు 60, ఖమ్మంకు 30, నల్లగొండకు 60, మహబూబ్‌నగర్‌కు 60, మెదక్‌కు 60 బస్సుల చొప్పున నడుపుతారు. ప్రయాణికుల రద్దీ మేరకు హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్ల నుంచి మరో 40 బస్సులను కూడా సిద్ధంగా ఉంచనున్నట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు