ప్రత్యేక హోదా కోసం పోరాడుదాం

8 Mar, 2015 01:07 IST|Sakshi

తాడేపల్లిగూడెం :రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చే వరకు పోరాటం చేద్దామని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు డీవీవీఎస్ వర్మ ఇతర పార్టీలకు పిలుపునిచ్చారు. స్థానిక సుబ్బారావుపేటలోని హ్యాంగ్ అవుట్‌లో శనివారం జరిగిన లోక్‌సత్తా జిల్లా సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన విలేకర్లతో మాట్లాడారు. అప్పటి ప్రధాని మన్మోహ న్‌సింగ్ రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తానంటే దాన్ని 15 ఏళ్లుగా ప్రకటించాలని రాజ్యసభలో వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే, పదేళ్లపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామన్నారని వర్మ అన్నారు. తీరా కేంద్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలన్నింటిని తుంగలో తొక్కిందన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం మాని ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్న పది రాష్ట్రాల సరసన మరో రాష్ట్రంగా మాత్రమే ఆంధ్రాను చేర్చి అన్యాయం చేశారన్నారు.
 
 ఖర్చు లేని రైల్వే జోన్ ప్రకటన, రైల్వే డబ్లింగ్‌లు వంటివి కూడా ఏమీ లేవన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.18000 కోట్లు ఖర్చు అవుతుందని, బడ్జెట్‌లో కేవలం వంద కోట్లు కేటాయిం చడంలో ఆంతర్యం ఏమిటన్నారు. లోక్‌సత్తా నాయకులు జయప్రకాష్ నారాయణ్ చేపట్టిన సంకల్పదీక్ష అంతా బూటకమన్నారు. దీనికి సంబంధించి పత్రంలో ఉదాహరించిన నాలుగు డిమాండ్లు చూస్తే ఆ విషయం పూర్తిగా అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, ఆ హామీని దగా చేసిన కేంద్రానికి జేపీ కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు సాగిరాజు జానకిరామరాజు, కార్యదర్శి కె.కె.విశ్వేశ్వరరావు, జాతీయ ఉపాధ్యక్షుడు చెన్నుపాటి వజీర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్‌రెడ్డి, మహిళా సత్తా నాయకురాలు ఎస్.మనోరమ, జిల్లా నాయకులు ఎం.వెంకటేశ్వరరావు, వివిధ మండలాల నుంచి వచ్చిన పార్టీ నేతలు పాల్గొన్నారు.
 
 లోక్‌సత్తా పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
 తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్) : ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు అనే అంశంపై లోక్‌సత్తా పార్టీ ఉద్యమిస్తుందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటాన్ని సాగిస్తుందని లోక్‌సత్తా పార్టీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ జానకి రామరాజు, కేకే విశ్వేశ్వరరావులు తెలిపారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయం నుంచి తాలూకా ఆఫీస్ మీదుగా పోలీస్ ఐలాండ్ వరకు  భారీ ర్యాలీ నిర్వహించారు.
 
 ఈ ర్యాలీలో జాతీయ అధ్యక్షుడు కఠారి శ్రీనివాసరావు, రాష్ట్ర అధ్యక్షుడు డీవీవీఎస్ వర్మ, ప్రధాన కార్యదర్శి రమేష్‌రెడ్డి, మహిళా  రాష్ట్ర నాయకురాలు మనోరమ, ఉపాధ్యక్షులు చెన్నుపాటి వజీర్, ఐ.రామమూర్తి, జిల్లా నాయకులు ఎస్.వెంకటేశ్వరరావు, పి.కృష్ణ, ఎ.అప్పారావు,  శివరామకృష్ణ, న్యాయవాది రాజగోపాల్, స్థానిక నాయకులు ఎస్‌ఏకే జిలాని, టి.రామకృష్ణ, కె.లక్ష్మీనారాయణ, కాశీ విశ్వనాధం, కమల, ఆర్ రాజా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు