ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీ విఫలం

9 May, 2016 02:04 IST|Sakshi
ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీ విఫలం

పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి

పీలేరు:  రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పన విషయంలో టీడీపీ, బీజేపీ పూర్తిగా విఫలమయ్యాయని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. ఆదివారం ఎమ్మెల్యే పీలేరులో మాట్లాడుతూ కేంద్రంలో బీజీపీ, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ప్రత్యేక హోదా కల్పించకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా లేకుంటే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని సీఎం చంద్రబాబుకు తెలిసినా, ఈ విషయంపై గట్టిగా కేంద్రాన్ని అడిగే దమ్ము, ధైర్యం లేదని దుయ్యబట్టారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన సీఎం రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై అడగలేక పోతున్నారన్నారు. 

కేంద్రంతో టీడీపీ పొత్తుపెట్టుకుని ఎన్నికల సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా పది ఏళ్లు ఇస్తామని బీజేపీ, పదే ళ్లు పరి పోదు పదిహేనేళ్లు ఇవ్వాలని చంద్రబాబు మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించి ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చారని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ప్రత్యేక హోదా ఊసేలేదన్నారు.

ప్రత్యేక హోదా విషయంలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు మంగళవారం ఉదయం 10 గంటలకు చిత్తూరు కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాలో వేలాది మంది పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పీలేరు నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు, ప్రజలు, మేధావులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు ఈ కార్యక్రమానికి తరలిరావాలని కోరారు.

 

మరిన్ని వార్తలు