గోదావరిలో ప్రమాద సుడిగుండాలు

3 Jul, 2019 08:50 IST|Sakshi

సాక్షి, అమలాపురం : గోదావరిలో పడవలు, లాంచీల ప్రమాదాలు జరిగినప్పుడు చోటు చేసుకునే పెనువిషాదం గురించి తెలుసుకునేందుకు.. గత ఏడాది మే, జూలై నెలల్లో మంటూరు, పశువుల్లంక దుర్ఘటనలు చాలు. ఇవే కాదు ఇంతకన్నా పెద్ద ప్రమాదాలు జరగడం, పదుల సంఖ్యలో లంకవాసులు, రైతులు మృత్యువాత పడడం సర్వసాధారణంగా మారింది. గోదావరి మీద ప్రయాణం ఎప్పుడూ ప్రమాదకరమే. వరదల సమయంలోనైతే ప్రమాదాలు మరింత అధికంగా జరిగే అవకాశముంటుంది.

అప్పుడు జరిగే ప్రమాదాల్లో మృతుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం వర్షాకాలం ఆరంభమైంది. గోదావరికి వరద నీరు వస్తోంది. దీంతో గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పడవల మీద.. లాంచీల మీద ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. ధవళేశ్వరం బ్యారేజ్‌ ఎగువన ఇటు మన జిల్లాలోని దేవీపట్నం, చింతూరు.. అటు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం తదితర మండలాల పరిధిలో పలు గ్రామాలు ఉన్నాయి.

కొండలు, గోదావరి మధ్య ప్రాంతంలో ఉండడంతో వీటికి రహదారి సౌకర్యం అంతంతమాత్రమే. దీంతో పోలవరం, కొవ్వూరు, దేవీపట్నం, పురుషోత్తపట్నం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు వివిధ పనులపై నిత్యం వచ్చే ఆయా గ్రామాల ప్రజలు పూర్తిగా లాంచీలు, పడవలపై ఆధారపడి ప్రయాణించాల్సిందే.ఇక బ్యారేజ్‌ దిగువన గోదావరి పాయల మధ్య ఉన్న లంక గ్రామాల్లో పరిస్థితి ఇందుకు భిన్నం. ఇక్కడ కేవలం నాటు పడవల మీదనే ప్రయాణాలు చేయాల్సి ఉంది. వ్యవసాయం మాత్రమే జరిగే లంక ప్రాంతాలకు సహితం వరదల సమయంలో పడవల మీద దాటాల్సి వస్తోంది. జిల్లావ్యాప్తంగా పడవలు, లాంచీలు మీద రాకపోకలు సాగించే గ్రామాలు 70 వరకూ ఉంటాయని అంచనా.

వరద ఉధృతంగా ఉన్న సమయంలో సహితం లంకవాసులు దైనందిన కార్యక్రమాల కోసం పడవల మీదనే రాకపోకలు సాగిస్తూంటారు. ఇవికాకుండా కోటిపల్లి – ముక్తేశ్వరం, సఖినేటిపల్లి – నర్సాపురం, కరవాక – ఓడలరేవు, గోగన్నమఠం – బెండమూర్లంక, సలాదివారిపాలెం – పశువుల్లంక, పల్లంకుర్రు – జి.మూలపొలం, పురుషోత్తపట్నం – పోలవరం వంటి రేవుల్లో ప్రయాణికుల రాకపోకలు నిత్యం పడవలు, పంటులపై సాగుతూనే ఉంటాయి. వీటిలో కోటిపల్లి, సఖినేటిపల్లి, పశువుల్లంక(గత ఏడాది ప్రమాదం తరువాత)ల్లో పంటుల మీద రాకపోకలు సాగుతున్నాయి. పురుషోత్తపట్నం నుంచి లాంచీల ప్రయాణం సాగుతోంది. మిగిలిన అన్ని రేవుల్లోనూ ఇంజిన్‌ పడవలే శరణ్యం.

ఆ ప్రాంతాలకు పడవలే గతి

  • ముమ్మిడివరం, ఐ.పోలవరం, కె.గంగవరం మండలాల పరిధిలోకి వచ్చే సలాదివారిపాలెం, కమిని, గురజాపులంక, శేరులంక, కొత్తలంక, గోగుల్లంక గ్రామాల ప్రజలు బయటి ప్రాంతాలకు రాకపోకలు సాగించాలంటే పడవ ప్రయాణాలే దిక్కవుతున్నాయి.
  • ఆత్రేయపురం మండలం పేరవరం, వద్దిపర్రు, వెలిచేరు, వాడపల్లి గ్రామాల ప్రజలు లంక భూములకు వెళ్లేందుకు పడవలే గతి.
  • తాళ్లరేవు మండలం గోవలంక, పిల్లంక, అరటికాయలంకలకు వెళ్లే రైతులు పడవల మీదనే ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది.
  • మామిడికుదురు, అల్లవరం మండలాల్లో ప్రవహిస్తున్న వైనతేయ నదీపాయల మధ్య కరవాక – ఓడలరేవు, గోగన్నమఠం – బెండమూర్లంక, పెదపట్నంలంక – ముంజువరం కొట్టు మధ్య పడవ ప్రయాణాలు సాగుతున్నాయి.
  • పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే కనకాయలంక – దొడ్డిపట్ల మధ్య పడవ ప్రయాణాలు సాగుతున్నాయి. పడవ మీదనే జిల్లా వాసులు పశ్చిమ గోదావరికి వెళ్తూంటారు. అలాగే ఎల్‌.గన్నవరం – కోడేరులంక గ్రామాల ప్రజలు పడవల పైనే ప్రయాణం సాగిస్తున్నారు.
  • కపిలేశ్వరపురం – కేదార్లంక మధ్య నాటు పడవ ప్రయాణాలు చేయాల్సి వస్తోంది.
  • కాట్రేనికోన మండలం పల్లంకుర్రు నుంచి రామాలయంపేట, జి.మూలపొలం మధ్య; కుండలేశ్వరం – కేశనకుర్రుపాలెం మధ్య పడవల మీదనే రాకపోకలు సాగిస్తున్నారు.
  • సీతానగరం మండలం వంగలపూడి నుంచి గూటాల వరకూ వెళ్లేందుకు, పురుషోత్తపట్నం నుంచి పోలవరం వెళ్లేందుకు లాంచీలను వినియోగిస్తున్నారు.
  • వీఆర్‌ పురం మండలం తమ్మిలేరు, కొండేపూడి, కొల్లూరు, గొందూరు; కూనవరం మండలం కూనవరం నుంచి రుద్రంకోట వరకూ పడవలపై వెళ్తూంటారు.

గోదావరిలో ప్రమాదాల పరంపర
1990 : ఆత్రేయపురం మండలం పేరవరం, వద్దిపర్రు, వెలిచేరు, వాడపల్లి గ్రామాల ప్రజలు లంక భూములకు వెళ్తూండగా పడవ మునిగి 10 మంది చనిపోయారు.
1992 : ఐ.పోలవరం మండలం గోగుల్లంక, భైరవలంకల మధ్య చింతేరుపాయలో పడవ బోల్తాపడి 9 మంది మృతి చెందారు.
1995 : పాపికొండలు మార్గంలో జరిగిన అతి పెద్ద ప్రమాదంలో సుమారు 98 మంది మృత్యువాత పడ్డారు.
2004 : తాళ్లరేవు మండల పరిధిలో గోదావరి పాయపై జరిగిన పడవ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు.
2009 : దేవీపట్నం మండలం కొండమొదలు వద్ద నాటు పడవ ప్రమాదంలో 10 మంది జలసమాధి అయ్యారు.
2012 : పి.గన్నవరం మండలం లంకల గన్నవరం వద్ద వశిష్ట గోదావరి నదీపాయలో ఇంజిన్‌ బోటు బోల్తా పడి ఐదుగురు మహిళలు దుర్మరణం పాలయ్యారు.
2016 : ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక వద్ద గోదావరి వరద ఉధృతికి ఐదుగురు రైతులు మృతువాత పడ్డారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా