కనురెప్పే కాటేస్తే..

13 Nov, 2019 10:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి , ఒంగోలు : కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లిదండ్రులే తమ బిడ్డలను చిదిమేస్తున్నారు.. మానవత్వం మరిచి పేగు బంధాన్ని సైతం తెంచుకుంటున్నారు.. భార్యపై అనుమానంతో ఆమెతో పాటు బిడ్డలను సైతం హతమార్చేందుకు వెనుకాడడం లేదు.. పేగు తెంచుకు పుట్టిన బిడ్డలనే కర్కశంగా రోడ్లపై, వాగుల్లో విసిరి పడేస్తున్నారు.. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులనే కడతేరుస్తున్న కసాయి కొడుకులు.. వృద్ధాప్యంలో తల్లిని భారంగా భావించి రోడ్లపై పడేసి వెళ్తున్న దుర్మార్గపు బిడ్డలు..

కామంతో కళ్లు మూసుకుపోయి కూతురు, మనమరాళ్ళ వయస్సు ఉన్న చిన్నారులు, యువతులపై కన్నేస్తున్న మృగాళ్ళు.. జిల్లాలో జరుగుతున్న వరుస సంఘటనలు మానవ సంబంధాలు, రక్తసంబంధాలను సైతం మరిచి కర్కశత్వంతో చిన్నారుల జీవితాలను కాలరాస్తున్న వైనాన్ని చూసి పరిస్థితి ఎటువైపు వెళుతోంది.. ఎక్కడకు దారితీస్తుందో అని జిల్లా వాసులు హడలిపోతున్నారు. జిల్లాలో మూడు నెలలుగా జరుగుతున్న వరుస ఘటనలు అందరి మనస్సులను కలిసి వేస్తున్నాయి.  

  • దర్శి పట్టణంలోని సాయిబాబా దేవాలయం సమీపంలో నివాసం ఉంటున్న అన్నపురెడ్డి వెంకటరెడ్డి, ఆదెమ్మ అనే వృద్ధ దంపతులు జులై 22వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరపడంతో కొడుకే కన్న తల్లిదండ్రులను కర్కశంగా హతమార్చినట్లు తేలింది. వ్యసనాలకు బానిసై అప్పులు చేసి అవి తీర్చేందుకు పథకం ప్రకారం తల్లిదండ్రుల పేరుతో బీమా చేయించి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా అర్ధరాత్రి వారిని దారుణంగా హతమార్చాడు. 
  • భార్యపై అనుమానం పెంచుకుని అతి కిరాతకంగా హతమార్చిన సంఘటన ఆగస్టు 17వ తేదీన తాళ్ళూరు మండలం తూర్పు గంగవరం గ్రామంలో జరిగింది. 11 ఏళ్లు కాపురం చేసిన భార్యపై అనుమానం పెనుభూతంలా మారి మద్యం మత్తులో ఆమె తలను గోడకేసి కొట్టి చంపాడు. తల్లి మృతి చెందడం, తండ్రి జైలు పాలు కావడంతో వారి ఇద్దరు బిడ్డలు అనాధలుగా మారి అమ్మమ్మ ఆసరాతో జీవనం సాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. తల్లిదండ్రులు క్షణికావేశంలో చేసిన తప్పులకు బిడ్డలు బలికావాల్సి వచ్చింది.
  • తెలిసి చేసిన పాపమో.. తెలియక చేసిన పాపమో తెలియదుగానీ కొందరు యువతులు పెళ్లి కాకముందే తల్లులుగా మారి పుట్టిన వెంటనే బిడ్డలను విసిరి పారేసి తమ తప్పును కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కనిగిరి పట్టణంలోని గార్లపేట రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జులై 30వ తేదీన ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ఓ అవివాహిత బిడ్డ పుట్టగానే అక్కడే వదిలేసి వెళ్లింది.
  • చీరాల పట్టణంలోని విఠల్‌ నగర్‌లో ఆగస్టు 29వ తేదీ రాత్రి ఓ గర్భిణీ నడి రోడ్డుపై పురుడు పోసుకుంది. పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఏం అయిందో ఏమో తెలీదుగానీ పసికందుకు అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. రోడ్డుపై ఏడుస్తూ కొంత సేపటికి ప్రాణాలు విడిచింది. తప్పు చేసిన వారి కడుపున పుట్టడమే ఆ పసికందులు చేసుకున్న పాపం.
  • మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌ వద్ద సెప్టెంబర్‌ 27వ తేదీ అర్ధరాత్రి వృద్ధురాలైన కన్న తల్లిని కొడుకులు ఆటోలో తీసుకొచ్చి నడి రోడ్డుపై పడేసి వెళ్ళారు. వర్షంలో తడిచి, చీమలు కుట్టి తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆమెను స్థానికులు 108 ద్వారా ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆ తల్లి మృతి చెందింది. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కూడా కొడుకులు రాకపోవడంతో పోలీసులే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.
  • తాజాగా నవంబర్‌ 1వ తేదీన మరో తల్లిని కొడుకులు ఒంగోలు నగరంలోని భాగ్యనగర్‌ 4వ లైన్‌లో నడి రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. హాస్టల్‌ విద్యార్థినులు గమనించి ఆమెకు అల్పాహారం పెట్టి వృద్ధాశ్రమంలో చేర్చారు.
  • వ్యసనాలకు బానిసైన భర్త వేధింపులు తాళలేక పేగు తెంచుకు పుట్టిన మూడేళ్ళ పాపను చంపి తానూ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన దుర్ఘటన గుడ్లూరు మండలం చేవూరులో అక్టోబర్‌ 20వ తేదీన జరిగింది. తాను చనిపోతే తన బిడ్డ అనాథగా మారుతుందనుకుందో ఏమోగానీ తల్లితనాన్నే మరిచి కంటిపాపనే చిదిమేసింది. 
  • ఈనెల 9వ తేదీన రాచర్ల బీసీ కాలనీలో ఘోర ఘటన చోటు చేసుకుంది. పుట్టిన బిడ్డ తన పోలికలతో లేడని ఏడెనిమిది నెలల వయసున్న కుమారుడిని నేలకేసి కొట్టాడు ఆ కిరాతక తండ్రి. అంతటితో ఆ పసి బిడ్డ గొంతుపై కాలేసి తొక్కి హతమార్చాడు. ఆ ఘోరం చూసి కేకలు పెడుతున్న భార్యను రోకలిబండతో దాడి చేశాడు. ఇటీవల జరుగుతున్న ఈ ఘటనలు జిల్లా ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.   
మరిన్ని వార్తలు