నాటి సమరంలో మనవారు సైతం...

15 Aug, 2019 12:22 IST|Sakshi
కెఎస్‌ తిలక్‌

సాక్షి, విజయనగరం : భారత దేశ స్వాతంత్య్ర సమరంలో విజయనగరానికి చెందిన యోధులు ఉన్నారు. ఆ ఉద్యమంలో జిల్లా పాత్రను ప్రస్ఫుటింపజేసిన గొప్ప వ్యక్తిగా కె.ఎస్‌.తిలక్‌ నిలుస్తారు. విజయనగరంలో పుట్టి పెరిగిన తిలక్‌ దేశంలో పలు ప్రాంతాల్లో జరిగిన పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారు. యువతలో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిల్చారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. బ్రిటిష్‌ వారి ఆగ్రహానికి గురై జైలు శిక్ష అనుభవించారు. పార్లమెంట్‌కు ఎన్నికైన తిలక్‌ బెస్ట్‌ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు దక్కించుకున్నారు. కాంగ్రెస్‌తో పాటు అనేక పార్టీలు రాజకీయాల్లోకి ఆహ్వానించినా పదవుల కోసం పార్టీలు మారకుండా అదే పార్టీలో కొనసాగి, తర్వాత రాజకీయాలకు దూరమైన నైతిక విలువలు కలిగిన నాయకుడాయన. 

చురుకైన నాయకుడు ఆదిరాజు జగన్నాథశర్మ
స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మరో నాయకుడు ఆదిరాజు జగన్నాథశర్మ. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరిగిన అనేక పోరాటాల్లో ఆయన పాల్గొన్నారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. చివరికి జైలు శిక్ష అనుభవించారు. విజయనగరం మహారాణిపేటలో నివసించిన శర్మ స్వాతంత్య్రం తర్వాత తెలుగు పండిట్‌గా వృత్తిని కొనసాగించారు. ఎటువంటి ప్రయోజనాలు ఆశించకుండా పోరాటంలో పాల్గొన్న నాయకుడు ఆయన. 

జొన్నవలసలో ఉద్యమ తేజం
విజయనగరం మండలంలోని జొన్నవలసకు చెందిన మరో ఉద్యమ తేజం పూసపాటి బుచ్చిసీతారామ చంద్రరాజు. 1888లో జన్మించిన ఈయన సత్యాగ్రహ ఉద్యమ జిల్లా నాయకునిగా నామినేట్‌ అయి ఉద్యమాన్ని నడిపారు. 1930లో జైలుకు వెళ్లి కఠిన కారాగారశిక్ష అనుభవించారు. గాంధీ, ఇర్విన్‌ ఒడంబడిక ఫలితంగా 1931 మార్చి11న విడుదలయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ కీలక పదవులు అధిరోహించిన ఆయన 1973లో కన్నుమూశారు. స్వతహాగా ఆస్తిపరులైనా, అన్నింటినీ విడిచిపెట్టి తెల్లదొరలను ఎదిరించిన నాయకునిగా గుర్తింపు పొందారు.

స్వాతంత్య్రపోరులో చీపురుపల్లి యోధుడు


స్వాతంత్య్ర సమరయోధుడు మొదలవలస అబ్బాయినాయుడు 
చీపురుపల్లి : దేశంలో ఎంతో మంది సమరయోధుల త్యాగఫలంలో స్వాతంత్య్రాన్ని సాధించుకుంటే అందులో చీపురుపల్లికి చెందిన వ్యక్తుల పాత్ర కూడా కాస్త ఉండడంతో ఎంతో గొప్ప విషయం. అందులో మొదలవలస అబ్బాయినాయుడును స్థానికంగా గుర్తు చేసుకుంటారు. 1914లో శ్రీకాకుళం జిల్లాలో ని షేర్‌మహమ్మద్‌పురంలో జన్మించిన అబ్బాయినాయుడు చీపురుపల్లిలో స్థిరపడ్డారు. ఆయన యవ్వనంలోనే స్వాతంత్య్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమానికి ఆకర్షితులయ్యారు. అందులో భాగంగానే అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు.

ఆ సమయంలోనే బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని స్తంభింపజేయడానికి దేశ వ్యాప్తంగా రైళ్లను నిలిపివేయడం, పోలీస్‌ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసం చేయడం వంటి కార్యక్రమాలు జరుగుతుండగా అబ్బాయినా యుడు చౌదరి సత్యనారా యణ, గౌతు లచ్చన్నలను ఆదర్శంగా తీసుకుని చీపురుపల్లి నుంచి జి.సిగడాం, పొందూరు రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలు తప్పించి, రైల్వే టెలిఫోన్‌ తీగెలను తెంచేశారు. దీంతో ఆయన్ను పదిహేను రోజులు చీపురుపల్లి సబ్‌జైల్‌లో ఉంచారు. టంగుటూరి ప్రకాశం పం తులు, తెన్నేటి విశ్వనాథం, వి.వి.గిరి వంటి వారితో తనకు ఉన్న ఆత్మీయ సంబంధాన్ని అబ్బాయినాయుడు తన డైరీలో కూడా రాసుకున్నారు. 1981 లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధునిగా గుర్తించి గౌర వ వేతనం మంజూరు చేసింది. 1991లో చీపురుపల్లిలో కన్నుమూశారు.

మరిన్ని వార్తలు