అమ్మ భాష తెలుగు.. అక్షరమై వెలుగు

21 Feb, 2020 09:38 IST|Sakshi

నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం  

మాతృభాష గొప్పదనం మాటల్లో వర్ణించలేనిది. భావ వ్యక్తీకరణకు సులభమైన.. సులక్షణమైన మార్గం అమ్మభాష. అందుకే గాంధీ మాతృభాష గురించి ఇలా అన్నారు.. మాతృభాషా తృణీకారం.. మాతృదేవీ తిరస్కారం  అని రెండు పంక్తుల్లో మాతృభాష ప్రాశస్త్యాన్ని చాటిచెప్పారు. ప్రతి జాతి సంస్కృతి వికాసానికి మూలం మాతృభాష. ప్రపంచీకరణ నేపథ్యంలో భాషా వికాసం పెరిగింది. అయితే మనగడ కోసం ఇతర భాషలు నేర్చుకోవడంలో తప్పులేదు కానీ వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా జాగ్రత్తపడాలి. తమతమ మాతృభాషలను కాపాడుకోవాలని గుర్తు చేసేందుకే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకుంటున్నారు.   

సాక్షి, విజయవాడ : మాతృ భాషతోనే జాతి సాంస్కృతిక సంపద వెలుగొందుతుంది. ప్రపంచ వ్యాప్తంగా వేలాది భాషలు ఉన్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో కొన్ని భాషల ఉనికి ప్రమాదంలో పడటం ఆందోళన కలిగించే అంశం. మాతృ భాష కోసం బెంగాల్‌ యువకుల ఆత్మబలిదానం రగిల్చిన ఉద్యమ స్ఫూర్తితో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి పునాది పడింది.  

నేపథ్యం   
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రతి ఏటా ఫిబ్రవరి 21న  నిర్వహించాలని యునెస్కో 30వ సాధారణ సభ (1999 నవంబరు 17న) ప్రకటించింది. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా మాతృ భాషా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు.   

లక్ష్యాలు   
ప్రపంచంలోని చిన్నాచితకా దేశాలతో పాటు అతి పెద్ద దేశాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ప్రతి దేశానికి, ప్రాంతానికి ప్రత్యేక ప్రాంతీయ భాష ఉంటుంది. భాషా సాంస్కృతిక వైవిధ్యం కాపాడుకోవడం, బహు భాషల ప్రభావాన్ని ప్రోత్సహించడం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవడం భాషా వికాసానికి లక్ష్యాలుగా ఉండాలని మేధావులు సూచించారు.   
►మాతృభాషా వికాసానికి ప్రభుత్వాలు నడుంబిగించాలి. 
►అంతరించిపోతున్న భాషలను గుర్తించి కాపాడుకోవాలి. 
►మౌఖిక భాషలకు అక్షర రూపం కల్పించాలి. 
►ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా భాషా సదస్సులు నిర్వహించాలి. 
►పాలనాభాషాగా ప్రజలు మాట్లాడే భాష ఉండాలి. 
►భాషకు అనుబంధంగా ఉన్న మాండలికాలను ప్రోత్సహించాలి 

తెలుగు భాషాభివృద్ధిలో మన కవులు   
తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసినవారిలో కృష్ణానదీ తీరప్రాంతమైన పెనుగంచిప్రోలులో జని్మంచిన ఉద్యమకర్త కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, తెలుగులో తొలి కథా రచయిత్రి బండారు అచ్చమాంబ ముఖ్యులు.  
నిద్రాణమైన తెలుగు జాతిని మేల్కొలిపిన కొమర్రాజు  
1876 మే 18న పెనుగంచిప్రోలులో జని్మంచిన కొమర్రాజు తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వం రచయిత, విజ్ఞాన మండలి స్థాపకుడు. భువనగిరిలో ప్రాథమిక విద్య అభ్యసించి నాగపూర్‌లో అక్కాబావలతో ఉంటూ మరాఠీ భాష నేర్చుకున్నాడు. 1900లో బీఏ, 1902లో ఎంఏ ఉత్తీర్ణులయ్యారు. మరాఠీ భాషలో వ్యాసాలు, పద్యాలు రాశారు, తెలుగు, మరాఠీ, ఇంగ్లిషు, సంస్కృతం, బెంగాల్, ఉర్దూ, హిందీ భాషల్లో ప్రావీణ్యం పొందారు. 1901లో శ్రీకృష్ణదేవరాయేంద్ర భాషా నిలయమైన పుస్తక భాండాగారాన్ని నెలకొల్పిన తొలి తెలుగు వ్యక్తి. 1906లో విజ్ఞాన చంద్రిక మండలిని, 1910లో విజ్ఞాన చంద్రిక పరిషత్‌ను స్థాపించారు. 1916లో రచించిన తెలుగు విజ్ఞాన సర్వస్వం  పుస్తకం దక్షిణ భారతదేశంలో సంచలనం సృష్టించింది. 11 భాషా విషయక పుస్తకాలు, 2 చారిత్రక గ్రంథాలు, ఇతర శా్రస్తాలతో 20 పుస్తకాలు రాశారు. 1923లో ఆరోగ్యం క్షీణించి తిరిగిరాని లోకాలకేగారు.    

తొలి తెలుగు కథారచయిత్రి బండారు అచ్చమాంబ   
కొమర్రాజు సోదరి అయిన అచ్చమాంబ దేశంలోనే తొలి తెలుగు కథారచయిత్రి. ఆమె అనేక రచనల్లో స్త్రీవిద్య, వితంతు పునరి్వవాహం వంటి సాధక విషయాలతో హిందూసుందరి, జనాన అనే పత్రికల్లో వ్యాసాలు రాశారు.  1901లో మహిళా సంఘాన్ని స్థాపించిన తరువాత ఆమె 1902లో అబల సచ్చరిత్రమాల అనే గ్రంథాన్ని వెలువరించింది. 1901 నుంచి 1903 వరకు ధనత్రయోదశి, గుణవతి వంటి 10 కథలు రాశారు. తొలి తెలుగు కథా రచయిత్రిగా గౌరవం అందుకున్నారు. ఆమె కథల్లో భావోద్వేగాలు, స్త్రీవాదాలు, హక్కులు మొదలైన వైవిధ్యభరితాలు ఆనాడే కనపడేవి. 1904లో ఆమె రాసిన బీద కుటుంబం అనే కథ నాటి సామాజిక పరిస్థితులకు నిదర్శనంగా నిలిచింది. స్పష్టమైన అభిప్రాయాలతో రచనలు కొనసాగించి తొలి తెలుగు కథా  రచయిత్రిగా సుస్థిర స్థానాన్ని పొందారు.  

మరిన్ని వార్తలు