మహిళలకు రక్షణ చక్రం

14 Jul, 2019 07:00 IST|Sakshi

సాక్షి, విజయనగరం : గంట్యాడ మండలానికి చెందిన ఓ వివాహితను భర్త, అత్త, ఆడపడుచులు కొంతకాలంగా వేధిస్తున్నారు. వేధింపులు తాళలేక ఆమె గృహహింస నిరోధక విభాగాన్ని ఆశ్రయించింది. బొబ్బిలి మండలానికి ఓ వివాహిత తనను భర్త, అత్తమామలు వేధిస్తున్నారని గృహ హింస నిరోధక విభాగాన్ని ఆశ్రయించింది. ఈ ఇద్దరే కాదు.. నిత్యం ఎక్కడో ఓ చోట మహిళలకు వేధింపులు ఎదురవుతున్నాయి. అలాంటి బాధితులకు గృహహింస చట్టం విభాగం అండగా నిలుస్తోంది. 

అత్తింటి వారి వేధింపులు భరించలేక ఇటీవల కాలంలో మహిళలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. భర్త వేధించాడనో, అత్త వేధిస్తోందనో మనస్థాపంతో చాలా మంది వివాహితలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనివల్ల వారి పిల్లలు దిక్కులేని వారిగా మిగులుతున్నారు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం 2005లో గృహహింస నిరోధక చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈ చట్టం మహిళలకు కొండంత అండగా నిలుస్తోంది. భర్త, అత్త లేదా ఇతర కుటుంబ సభ్యుల వల్ల వేధింపులకు గురయ్యే వారు నేరుగా గృహహింస చట్టం సిబ్బందికి ఫిర్యాదు చేసినట్టయితే ఉచితంగా న్యాయ సహాయాన్ని అందిస్తారు. గృహహింస విభాగంతో పాటు అదనంగా వన్‌స్టాప్‌ క్రైసిస్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. న్యాయసహాయంతో పాటు అత్యాచారానికి గురైన మహిళలకు వైద్య సహాయం కూడా అందిస్తారు.

గృహహింస అంటే..

  • శారీరకంగా.. లేదా మానసికంగా లేదా మాటల ద్వారా ఉద్వేగపరిచినా గృహహింస కిందకు వస్తుంది. ఆర్థిక, లైంగిక హింసలు, బెదిరించడం, భయపెట్టడం, దౌర్జనానికి పాల్పడటం, ఆరోగ్యాన్ని కుంటుపరిచే విధంగా వ్యవహరించే చర్యలన్నీ గృహహింస కిందకు వస్తాయి. ఈ చట్టం ప్రకారం బాధితురాలు, ప్రతివాది మధ్య సంబంధం భార్యభర్తల సంబంధమే కానవసరం లేదు. పుట్టుక ద్వారా లేదా పెళ్లి ద్వారా, దత్తత ద్వారా కలిసి ఉంటున్న వారైనా.. ఒకే ఇంట్లో ప్రస్తుతం లేదా గతంలో కలిసి నివసిస్తున్న స్త్రీ, పురుషులు ఈ చట్టపరిధిలోకి వస్తారు.
  • గృహహింసకు గురైన మహిళ నేరుగా లేదా ఎవరితోనైనా హింస జరుగుతుందని, జరగబోతుందని రక్షణ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. 
  • బాధితులకు చట్టపరమైన సహాయం, ఉచిత న్యాయ సేవలు, ఆర్థిక సహాయం, పిల్లల సంరక్షణ తదితర బాధ్యతల విషయంలో రక్షణాధికారి చర్యలు తీసుకోవాలి.
  • ఆశ్రయం అందించే సంస్థలు, వైద్య సహాయం సమాచారం బాధితురాలికి అందజేయాలి.
  • గృహహింస నిరోధక కార్యాలయంలో ఐదుగురు సిబ్బంది ఉన్నారు. ఒక లీగల్‌ కౌన్సిలర్, ఒక సోషల్‌ కౌన్సిలర్, ఇద్దరు హోంగార్డులు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉన్నారు.

మహిళల హక్కులు

  • స్త్రీ తాను జీవితాంతం వివాహం చేసుకోకుండా ఉండాలని నిర్ణయించుకుంటే దాన్ని హక్కుగా గౌరవించాలి
  • ఈ హక్కును కుటుంబంలోని అన్నదమ్ములు, తల్లిదండ్రులు అడ్డుకోలేరు. 
  • 18 ఏళ్లు నిండిన మహిళ తన ఇష్టం వచ్చిన పురుషుడిని వివాహం చేసుకోవచ్చు. 
  • భార్య ఉన్న పురుషుడిని వివాహం చేసుకోవడానికి వీల్లేదు. 
  • హిందూ మహిళ తనకు 18 ఏళ్లు నిండేవరకు వివాహం చేసుకోకుండా ఉండవచ్చు. ముస్లిం మహిళ తన 15 లేదా 18 ఏళ్లు నిండే లోపు జరిగిన వివాహాన్ని తిరస్కరించవచ్చు. ఈ హక్కును వాడుకోవాలనుకుంటే ఆమె తన భర్తతో లైంగిక సంబంధం కలిగి ఉండరాదు. 
  • మహిళను బలవంతంగా కాపురానికి తీసుకుని వెళ్లే హక్కు ఎవరికి లేదు. 
  • 18 ఏళ్లు నిండని బాలికను ప్రేమ పేరుతో తీసుకుని వెళ్లి వివాహం చేసుకుంటే.. సెక్షన్‌ 366 ప్రకారం యువకునికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించవచ్చు. 
  • ఏ స్త్రీ అయినా భర్త బతికి ఉండగా మరో వ్యక్తిని వివాహం చేసుకోవడానికి వీల్లేదు. అలా వివాహం చేసుకుంటే నేరం. ముస్లిం మహిళల విషయంలో ఈ నిబంధన చెల్లదు. 
  • వివాహమైన ఏ మతానికి చెందిన మహిళ అయినా భర్తతో కాక మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోరాదు. 
మరిన్ని వార్తలు