మన ఆరోగ్యం.. మన చేతుల్లో

10 Jul, 2019 08:18 IST|Sakshi

సాక్షి, పార్వతీపురం(విజయనగరం) : ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. పూర్వకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక విధానాలను పాటించే వారు. ప్రతి ఆచారం వెనుక ఆరోగ్యదాయక క్రియ దాగి ఉండేది. కానీ తాత, ముత్తాతల నుంచి వస్తున్న సంప్రదాయ పద్ధతులు క్రమంగా కనుమరుగవుతున్నాయి. గతంలో నిత్య జీవితంలో కచ్చితంగా ఆచరించి ఆరోగ్యంగా ఉండేవారు. నేడు ఆధునిక పోకడలతో వాటిని విస్మరించి రుగ్మతలను కొని తెచ్చుకుంటున్నారు. చిరుతిళ్లకు అలవాటు పడి రోడ్డు పక్క తిండి తిని చేజేతులారా ఆరోగ్యాన్ని వారే పాడు చేసుకుంటున్నారు. 

అవగాహన లేని విద్యార్థులు
జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఆరోగ్య సూత్రాలు పాటించకపోవడంతో అనేక రుగ్మతలతో బాధపడుతున్నట్టు ఏటా అనేక సర్వేలు చెబుతున్నాయి. కుటుంబ పెద్దలు ఆరోగ్యకరమైన అలవాట్లను ఆచరించి భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది. ఆచారం ఆరోగ్యానికి సోపానమని, అంతా అటువైపు అడుగులేస్తే పిల్లలకు సంప్రదాయ పద్ధతులపై అవగాహనతో పాటు చక్కని ఆరోగ్యం సొంతమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. 

ఉదయ వ్యాయామంతో మేలు
నేటి పోటీ ప్రపంచంలో ఉరుకులు, పరుగులతో దినచర్య ప్రారంభమవుతోంది. ఉద్యోగం, వ్యాపారం, ఇతర వ్యాపకాల దృష్ట్యా రాత్రి ఇంటికి ఆలస్యంగా చేరుతున్న వాళ్లే అధికం. కొందరు మిత్రులతో పార్టీలంటూ అర్థరాత్రి వరకు నిద్రపోవడం లేదు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. వేకువ జామున నిద్ర లేచి కొంత సమయం నడవడం శ్రేయస్కరం. చిన్నతనం నుంచి పిల్లలను ఉదయాన్నే నిద్ర లేపి వ్యాయామం, «ధ్యానం చేయించడం అలవాటు చేయాలి. క్రమం తప్పకుండా చేయిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. న్యూరో సైన్సు ప్రకారం ఉదయం నడకతో పలు రకాల వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

కింద కూర్చొని భోజనం చేస్తే..
ఇటీవల కాలంలో డైనింగ్‌ టేబుల్, మంచం కుర్చీలు, సోఫాలపై కూర్చొని భోజనం చేయడం పరిపాటైంది. వయసుతో సంబంధం లేకుండా ఎవరూ నేలపై కూర్చోవడానికి ఇష్టపడటం లేదు. ఇది ఆరోగ్య రీత్యా మంచి మంచిది కాదన్న వాస్తవం తెలుసుకోవడం లేదు.

నేలపై కూర్చుని తినాలి
నేలపై కూర్చొని భోజనం చేయడం వల్ల మోకాళ్లు, పొట్టకు తగిన వ్యాయామం లభిస్తుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. భోజనం చేసే సమయంలో నడుం చుట్టూ ఉన్న కండరాలపై ఒత్తిడి పడి ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. 

భోజన సమయంలో నీళ్లు తాగొద్దు
భోజనం పూర్తయ్యేవరకు మధ్యలో నీళ్లు తాగకూడదని పూర్వీకులు పదే పదే చెప్పేవాళ్లు. పెద్దల మాటను పెడచెవిన పెడుతూ చాలామంది భోజనం చేస్తున్న సమయంలో ఎక్కువ నీళ్లు తాగుతున్నారు. దీనివల్ల తిన్నది సరిగ్గా జీర్ణం కాదు. అసిడిటీ వంటి ఇబ్బందులు వస్తాయి. 

ఇలా చేస్తే మంచిది..
భోజనానికి ముందు, తర్వాత అర్ధగంట వ్యవధిలో నీళ్లు తాగాలి. తినే సమయంలో ఇబ్బందిగా ఉంటే కొద్దిగా తీసుకోవచ్చు. ఇలాగైతే పొట్ట పెరగదు. ఊబకాయం బారిన పడకుండా ఉండవచ్చు. భోజనం తర్వాత నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. రాత్రిపూట నిద్రపోయే ముందు బ్రష్‌ చేయడం మేలు.

చన్నీటి స్నానంతో ఆహ్లాదం
పూర్వకాలంలో సంధ్య వేళల్లో చన్నీటి స్నానానికి పెద్దలు ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు. వేడి నీటితో స్నానం చేయడం వల్ల తల వెంట్రుకలు ఊడిపోవడం, మృదుత్వం కోల్పోవడం, బలహీనంగా మారేందుకు అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చన్నీటి స్నానంతో శరీరం సమ ఉష్ణోగ్రతలో ఉంటుంది. వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. 

కాళ్లూ, చేతులు కడుక్కోవాలి
బయటికెళ్లి ఇంటికి తిరిగి వచ్చాక కాళ్లు, చేతులు కడుక్కొని లోపలికి వెళ్లడం మంచి సంప్రదాయం. దేన్ని తాకాలో.. దేన్ని తాకరాదో పిల్లలకు అవగాహన ఉండదు. ఆకర్షించే ప్రతి దాన్ని తాకుతారు. బుగ్గిలో ఆడటం వల్ల చేతులు, కాళ్ళకు బాక్టీరియా అంటుతుంది. ఇంటికి చేరగానే చేతులు, కాళ్లను శుభ్రం చేసుకుంటే సూక్ష్మక్రిములు పోతాయి. చక్కని ఆరోగ్యానికి అవకాశం ఉంటుంది. భోజనానికి ముందు చేతుల శుభ్రత అన్ని విధాల మేలు.

ఏకాగ్రతకు భక్తి దోహదం
చిన్నతనం నుంచే భక్తితో దేవున్ని ప్రార్థించేలా నేర్పించాలి. పెద్దలు ఆచరిస్తే పిల్లలకు  అలవాటవుతుంది. దీపారాధన, ధ్యానం, మంత్రాల ఉచ్ఛారణ వంటివి ఏకాగ్రతకు  దోహదపడతాయి. ఒత్తిడిని జయించేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు