కోడి‘కూసిన’ బావి.. 

3 Jul, 2020 07:21 IST|Sakshi
పచ్చని చెట్ల మధ్య ఉన్న అడిగుప్ప గ్రామం (ఇన్‌సెట్‌లో)అడిగుప్ప రాజుల దేవర గుడ్డం పక్కన పూడిక చేరిన కోడి కూసిన బావి

గుమ్మఘట్ట: సాంకేతికత నానాటికీ పెరిగిపోతున్నా..కట్టుబాట్లకు అడిగుప్ప గ్రామంలో కొదవలేదు.వాల్మీకి సామాజిక వర్గం నివసిస్తున్న గ్రామంలో పూరీ్వకులు ఇచ్చిన మాటతో నేటికీ మద్యం తాగరు..మాంసం ముట్టడంలేదు. గ్రామ సమీపంలోని ‘కోడికూసిన బావి’ వద్ద ఏడాదికోసారి జాతర నిర్వహిస్తారు. గ్రామస్తులేకాక, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే జనం బావి వద్దకు వెళ్లి ఆసక్తిగా తిలకిస్తుంటారు. రాయదుర్గం నియోజకవర్గానికి ఎనిమిది కిలో మీటర్ల దూరంలో గుమ్మఘట్ట మండలంలో అడిగుప్ప గ్రామం ఉంది. ఇక్కడ 120 కుటుంబాలు, సుమారు 550 మంది జనాభా ఉంది. అంతా వాలీ్మకి సామాజిక వర్గానికి చెందిన వారే. మద్యం, కోడిమాంసం, కల్లు లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంటారు. పూర్వం కులదేవర రాజులయ్యకు పూరీ్వకులు ఇచ్చిన మాటకు కట్టుబడి, నేటికీ ఆచార కట్టుబాట్లను అనుసరిస్తున్నారు.  

‘గుమ్మబావి’లో ఉబికివచ్చే నీరు.. 
పూర్వీకులంతా రాజులదేవర ఆలయం చుట్టూ ప్రస్తుతం ఉన్న గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలో నివాసిస్తుండేవారు. పశువులు, మేకలు, గొర్రెల దాహార్తిని దృష్టిలో ఉంచుకుని రాయదుర్గం పట్టణానికెళ్లే రహదారిలో బావి తవ్వకానికి శ్రీకారం చుట్టారు. అందులో సమృద్ధిగా నీరు పడింది. దీంతో ఆబావిని గుమ్మబావిగా పిలుస్తారు. నీరు అన్నివేళలా ఉబికి వస్తుండడంతో చుట్టుపక్కల ఉన్న రాజులయ్య ఆలయం వద్ద పంటలు సాగుచేసేవారు. అక్కడి నుంచి నీటిని తెచ్చుకోవడం కష్టంగా ఉండడంతో ఆలయం పక్కనున్న దేవరగుడ్డం వద్ద మరో బావి తవ్వకం చేపట్టారు. సుమారు 30 అడుగుల లోతు తవ్వగానే కోడి ప్రత్యక్షమై కూత వేసింది. దీంతో బావి తవ్వకం అర్ధంతరంగా ఆపేశారు. అందులో నీటిని వాడుకోలేకపోయారు. బావి వద్దకు వెళ్లేందుకు కూడా ఇష్టపడలేకపోయారు. నాటి నుంచి నేటి వరకూ కోడికూసిన బావిగా పిలుస్తున్నారు. ఈ కారణంతో అక్కడ నివాసం ఖాళీచేసి పొలాల మధ్య స్థిరపడిపోయారు. ఇటీవల ఆ బావి పూడిక చేరిందని, దానికో ప్రత్యేకత ఉందని గ్రామస్తులు నేటికీ చర్చించుకుంటుంటారు. ఏడాదికోసారి జాతర సందర్భంగా ఆ బావివద్దకు చాలమంది వెళ్లి తిలకిస్తుంటారని గ్రామస్తులు తెలిపారు.  

మరిన్ని వార్తలు