అప్పుడు చదువకపోతేనేం..!

11 Jul, 2019 09:56 IST|Sakshi

ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాలకు వెలువడిన ప్రకటన

అనివార్య కారణాల వల్ల చిన్న వయసులోనే చదువుకు దూరమైనవారికి ఓపెన్‌ స్కూల్‌(సార్వత్రిక విద్యాపీఠం) ఆశాదీపంలా నిలుస్తోంది. ఆర్థిక కారణాలు, కట్టుబాట్లు సంప్రదాయాల పేరిట మధ్యలోనే చదువు మానేసిన వారు, ఇతర కారణాలతో అర్ధంతరంగా చదువు ఆపేసిన వారికి ఓపెన్‌ స్కూల్‌ బాసటగా ఉంటోంది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో 
ప్రవేశాల కోసం సార్వత్రిక విద్యాపీఠం ఇటీవల ప్రవేశ ప్రకటన విడుదల చేసింది.

సాక్షి, ఆరిలోవ(విశాఖపట్టణం) : ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో సార్వత్రిక, దూరవిద్య విధానంలో టెన్త్, ఇంటర్మీడియెట్‌ కోర్సులను విజయవంతంగా నిర్వహిస్తోంది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్‌తోపాటు గుర్తింపు పొందిన పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో నెలకొల్పిన అధ్యయన కేంద్రాల ద్వారా ఈ కోర్సులను అందిస్తోంది. జిల్లాలో ప్రస్తుతం టెన్త్‌కు 56 , ఇంటర్మీడియెట్‌కు 43 అధ్యయన కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. సార్వత్రిక విద్యాపీఠం ఇచ్చిన సర్టిఫికెట్లపై చాలా మందికి అపోహ ఉంది. అయితే అవన్నీ అవాస్తవాలని రాష్ట్ర ఉన్నతాధికారులు, యూనివర్సిటీ అధికారులు సైతం స్పష్టంచేస్తున్నారు. ఈ సర్టిఫికెట్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో గుర్తింపు పొందటమే కాక ఉన్నత చదువులు, ఉద్యోగాలకు నేడు సైతం అర్హమై ఉన్నాయి. ఈ కోర్సులను పూర్తి చేసిన అభ్యాసకులు త్రివిధ దళాలతోపాటు వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారు. 

ముఖ్యమైన తేదీలు 
►  ప్రాస్పెక్టస్‌ లభ్యత, ప్రవేశాల ప్రారంభం: 2019 జూన్‌ 28 నుంచి
► ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పణకు ఆఖరు తేదీ: 2019 జూలై 26
► నిర్ణీత ప్రవేశ రుసు చెల్లించేందుకు చివరి తేదీ: 2019 ఆగస్ట్‌ 31
► రూ. 200 అపరాధ రుసుంతో దరఖాస్తు సమర్పణకు ఆఖరి తేదీ: 2019 సెప్టెంబర్‌ 26
► హెల్ప్‌లైన్‌ కేంద్రాలు: సార్వత్రిక విద్యాపీఠం గుంటూరు: 0863–2239151, విశాఖపట్నం: 80084 03662

మహిళలకు ప్రత్యేక రాయితీ..
సార్వత్రిక విద్య ద్వారా టెన్త్, ఇంటర్‌ చదువుకోవడానికి అన్ని వర్గాల స్త్రీలకు ఫీజుల చెల్లింపులో ప్రభుత్వం కొంత రాయితీ ఇస్తోంది. వీరితోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, మాజీ సైనికులు, మాజీ సైనికుల పిల్లలకు ప్రవేశ రుసుం ఫీజులోను రాయితీ కల్పిస్తున్నారు. దీని కోసం అభ్యర్థులు తహసీల్దార్‌/మెడికల్‌ బోర్డు/సైనిక సంక్షేమాధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. లేని పక్షంలో జనరల్‌ కేటగిరి ఫీజులనే చెల్లించాలి.

ముఖ్యమైన అంశాలు..
వయో పరిమితి ఆగస్టు 31 నాటికి లేదా ప్రవేశం కోరే సమయానికి పదో తరగతికి 14, ఇంటర్మీడియట్‌కు 15 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు. తెలుగు, ఇంగ్లీషుతోపాటు ఉర్దూ మాధ్యమం కూడా అందుబాటులో ఉంది. సబ్జెక్టుల ఎంపికనేది అభ్యాసకులు ఆసక్తిని బట్టి, ఒక అదనపు సబ్జెక్టును ప్రవేశ సమయంలో ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.∙గ్రూపుల లిస్టులో 5 సబ్జెక్టులను ఎంపిక చేసుకోవచ్చు. గ్రూపు–ఎలో ఇంగ్లిష్‌ సబ్జెక్టు తప్పనిసరి. ఇంటర్‌లో సైన్స్‌ గ్రూపు ఎంపిక చేసుకునే వారు టెన్త్‌లో తప్పనిసరిగా గణితం, జనరల్‌ సైన్స్‌ సబ్జెక్టులను చదివి ఉండాలి.∙నియత పాఠశాలలో పదో తరగతి/కళాశాలలో ఇంటర్మీడియెట్‌ కోర్సుల్లో ఫెయిలైనప్పటికీ.. పాసైన రెండు సబ్జెక్టుల మార్కులను బదలాయించుకునే వెసులుబాటు ఉంది. ఏ కోర్సులో చేరినా రిజిస్ట్రేషన్‌ పొందిన నాటి నుంచి ఐదేళ్ల వరకు ప్రవేశం చెల్లుబాటు అవుతుంది. ఏపీ ఓపెన్‌ స్కూల్‌లో రెండు సార్లు పబ్లిక్‌ పరీక్షలు నిర్వహిస్తారు. క్తిగతంగా కానీ, ఏపీ ఆన్‌లైన్‌ ద్వారా అభ్యాసకులు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు

దరఖాస్తు పూర్తి చేయండి ఇలా..
ఓపెన్‌ స్కూల్, ఇంటర్‌లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్నవారు వ్యక్తిగతంగానైనా ఏపీ ఆన్‌లైన్, మీ–సేవ కేంద్రాల్లో అన్ని దశల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ కోసం డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.ఏపీఓపెన్‌స్కూల్‌.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో పూర్తిచేయాలి. టెన్త్‌ లేదా ఇంటర్‌ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. తదుపరి అభ్యాసకులు తమ పేరు, మొబైల్‌ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్‌చేసిన తర్వాత సబ్‌మిట్‌ చేయాలి. తర్వాత మీసేవ, క్రెడిట్‌కార్డు, డెబిట్‌ కార్డు, నెట్‌బ్యాంకింగ్, ఏపీఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ ఫీజును చెల్లించాలి. తదుపరి దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాలి.

ఈ సమయంలో అభ్యర్థులకు సంబంధించిన ఆధార్, మొబైల్‌ నంబర్, సమీప అధ్యయన కేంద్రం పేరు–కోడ్‌ నంబర్, అభ్యాసకుల పూర్తి పేరు, తల్లిదండ్రుల పేర్లు, అభ్యాసకుల ఫొటో, సంతకం, సంరక్షకుని పేరు, లింగ నిర్ధారణ, వైవాహిక పరిస్థితి, పుట్టిన తేదీ, కమ్యూనిటీ వివరాలు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, విద్యార్హతలు, మార్కుల బదలాయింపులు, సబ్జెక్టుల ఎంపిక, అదనపు సబ్జెక్టు ఎంపిక, మీడియం, ఉత్తర ప్రత్యుత్తరాలకు చిరునామా వంటి వివరాలను ఔత్సాహికులు సిద్ధం చేసుకోవాలి.

చదువు నిలిపి వేసిన వారికి మంచి అవకాశం
చదువు మధ్యలో నిలిపి వేసిన వారికి సార్వత్రిక విద్య మంచి అవకాశం. దీని ద్వారా వచ్చిన సర్టిఫికెట్‌ రెగ్యులర్‌ విద్యకు వచ్చిన దానితో సమానమే. ఇందులో ఎలాంటి సందేహం పడాల్సిన అవసరం లేదు. ఈ విధానంలో పది, ఇంటర్మీడియెట్‌ చదువుకోవడానికి అవకాశం ఉంది.  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చదువు కొనసాగించాలి. దీని వల్ల వచ్చే సర్టిఫికెట్‌తో ఉద్యోగాలు రావనే ప్రచారంలో నిజం లేదు.  
– బి.లింగేశ్వరరెడ్డి, డీఈవో 

14 ఏళ్లు నిండిన వారు అర్హులు 
సార్వత్రిక విద్యా విధానంలో చదువుకోవడానికి 14 ఏళ్ల నిండి ఉండాలి. దీనికి గరిష్ట వయోపరిమితి లేదు. బాలురు, బాలికలు, మహిళలు, ఉద్యోగం చేస్తున్నవారు చదువుకోవచ్చు. మధ్యలో చదువు మానేసినవారు ఈ విధానం ద్వారా చదువుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఏడాదికి ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ కూడా వెలువడింది. ఫీజు చెల్లించడానికి ఈ నెల 26 వరకు గడువుంది. 
– దేవి, జిల్లా కో–ఆర్డినేటర్‌ 

సెలవుల్లో తరగతుల నిర్వహణ..
సాధారణ విద్యకు భిన్నంగా సార్వత్రిక తరగతులను నిర్వహిస్తున్నారు. ఓపెన్‌ స్కూల్‌ తరగతులను సెలవు రోజుల్లోనే నిర్వహిస్తారు. ఎంపిక చేసిన స్టడీ సెంటర్లలో జరిగే తరగతులకు అభ్యర్థులు హాజరుకావాల్సి ఉంటుంది. ఇంటర్‌ సైన్స్‌ గ్రూపునకు సంబంధించి ఎంపిక చేసిన కేంద్రాలలో ప్రాక్టికల్‌ పరీక్షల క్లాసులకు హాజరు కావాలి. ప్రతి విద్యార్థి కనీసం 30 తరగతులకు హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు