సహజ నటుడు.. కర్నూలు అల్లుడు!

2 Aug, 2019 11:00 IST|Sakshi

మహాత్మునితో జై అనిపించుకున్న మహానటుడు

నేడు బళ్లారి రాఘవ జయంతి

సాక్షి, కర్నూలు(గాయత్రీ ఎస్టేట్‌) : నటనకు కొత్త  భాష్యం చెప్పి నాటక రంగంలో సమూల మార్పులకు నాది పలికిన నటుడు, ప్రయోక్త, నాటక రచయిత బళ్లారి రాఘవగా ప్రసిద్ధికెక్కినారు తాడిపత్రి రాఘవాచార్యులు. కర్నూలు ఆడపడుచును వివాహం చేసుకోవడం, ఇక్కడే న్యాయవాద వృత్తిలో ప్రాక్టీస్, కేసులు వాదించడం ద్వారా ఆయన ఈ ప్రాంతానికి సుపరిచితులయ్యారు. ఆ మహానటుని 140వ జయంతి (శుక్రవారం) సందర్భంగా ఆయన్ను స్మరించుకోవడం ప్రతి తెలుగు వాడి బాధ్యత. ఈ సందర్భంగా నటులు, ప్రయోక్తలు తమకు స్ఫూర్తిదాయకమైన ఆయన నటనా జీవితంలోని విశేషాలను గుర్తు చేసుకుంటున్నారు.  

మహాత్మున్నే మైమరిపించారు.. 
తన నటనా కౌశలత్వంతో మహాత్మున్నే మైమరిపించి రాఘవ మహారాజ్‌కు జై అనిపించుకున్న మహానటుడు.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అప్పటికప్పుడు అలవోకగా డైలాగులు చెప్పి ప్రేక్షకులను మైమరింపజేసే సహజ నటుడు బళ్లారి రాఘవ మన కర్నూలుకు సుపరిచితులే. మహాత్మా గాంధీ క్రమశిక్షణ గురించి విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌కు బాగా తెలుసు. ప్రార్థనా సమయానికి బాపూజీ ఎంత ప్రాముఖ్యం ఇస్తారో కూడా తెలుసు. అయినా గాంధీజీతో పాటు నాటకాన్ని చూడాలని ఠాగూరు ముచ్చట పడ్డారట. ఆయన అభ్యర్థనను కాదనలేక ఎట్టకేలకు జాతిపిత ఆయన వెంట ‘దీనబంధు కబీర్‌’ నాటకాన్ని చూడడానికి వెళ్లారట.

నాటకాన్ని చూడటంలో మునిగిపోయిన గాంధీజీ ప్రార్థనా సమయం ఆసన్నమైందని ఠాగూర్‌ గుర్తు చేసినా ఆయన పట్టించుకోలేదట. పైగా ఆ నాటకం చూడటమంటే ప్రార్థన చేసినట్లే అని నాటకం పట్ల మహాత్ముడు తన గౌరవాన్ని ప్రకటించారట. ముఖ్యంగా ‘దీనబంధు కబీర్‌’ నాటకంలో ప్రధాన పాత్రదారి నటన ఆయనను ఎంతగానో ఆకట్టుకుందట. పట్టరాని ఆనందంతో ‘రాఘవ మహారాజ్‌కు జై’ అని బాపూజీ నాటకశాలలోనే నినాదాలు చెయ్యడమే అందుకు ప్రబల నిదర్శనం.  

వృత్తి న్యాయవాద రంగం.. ప్రవృతి నాటకరంగం 
మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్న రాఘవాచార్యులు.. మేనమామ ధర్మవరం కృష్ణమాచార్యులు వద్ద జూనియర్‌ న్యాయవాదిగా పనిచేస్తూనే ప్రవృత్తిగా నాటక రంగాన్ని ఎంచుకున్నారు. స్వయంగా నాటక రచయిత అయిన తన మేనమామ ఆధ్వర్యంలో నాటక సమాజంలో పాలుపంచుకోకుండా కోలా చలం నడుపుతున్న ‘సుమనోరమ సభ’ ప్రదర్శించే నాటకల్లో నటించేవారు. ఆ నాటక సమాజం పక్షాన ప్రదర్శించిన రామరాజు చరిత్రలో ఆయన అద్భుత  నటనకు విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ప్రశంసలు అందుకున్నారు. న్యాయవాద వృత్తిలో బాగా సంపాదించినప్పటికి ఆయన ఎలాంటి ఆస్తులు కొనుక్కోవడం కానీ ఆస్తులు కూడబెట్టుకోవడం కానీ చేయలేదు. సంపాదనంతా నాటకాల ప్రదర్శనలు, సమాజ సేవకు వినియోగించారని చెబుతారు. 

గాంధీజీని ఆకర్షించిన అభినయ శీలి 
బళ్లారి రాఘవ గొప్ప నటుడు. పలు భాషల్లో నాటకాలు ప్రదర్శించారు. షేక్‌ష్పియర్‌ రాసిన ఎన్నో నాటకాలను ప్రదర్శించారు. గాంధీజీనే ఆకర్షించిన మహా నటుడు. వృత్తి, ప్రవృత్తుల్లో ఉన్నతంగా రాణించాడు. జాతి ప్రగతికి మూఢాచారుల నిర్మూలనకు తన వంతు బాధ్యతను నిర్వర్తించారు. రాఘవ సేవలకు గుర్తుగా ఆయన పేరుతో స్టాంప్‌ను విడుదల చేశారు. కర్నూలుతో ఆయనకు అనుబంధం ఉంది. న్యాయవాదిగా కర్నూలు కోర్టుకు వచ్చేవారు. 
–చంద్రశేఖర కల్కూర, సాహితీ వేత్త  

త్యాగధనుడు.. రాఘవాచార్యులు 
బళ్లారి రాఘవ తన సమయాన్ని, సంపదను నాటక రంగ పురోగతికి వెచ్చించిన త్యాగధనుడు. ప్రతి క్షణం సమాజం కోసం పరితపించారు. కళ.. సమాజంలో మార్పు కోసం  ఉపయోగపడాలనుకునేవారు. కళను నమ్ముకోవాలి కానీ, అమ్ముకోకూడదని విశ్వసించారు. తెలుగు నాటక రంగం ఉన్నంత వరకు ఆయన పేరు అజరామరంగా వెలుగుతూనే ఉంటుంది.  
– మమత, తెలుగు టీచర్‌  

మరిన్ని వార్తలు