ఏడాదిలో ఎంత తేడా!

31 May, 2020 03:24 IST|Sakshi

గత పాలనకు, మా ఏడాది పాలనకు వ్యత్యాసాన్ని మీరే చూడండి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

ఏడాదిలోనే 90% వాగ్దానాలు అమలు

మరో 36 హామీలపై తేదీలతో క్యాలెండర్‌ ప్రకటించాం.. ఇక మిగిలింది 16 హామీలే ..వాటినీ పరుగులు పెట్టిస్తాం

మేనిఫెస్టోలో లేకున్నా ప్రజల అవసరాల మేరకు 40 అంశాలను అమలు చేశాం

నా 11 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో కోట్లాది మంది ప్రజలను కలిశా

ఒక్కొక్కరిది ఒక్కో సమస్య.. వాటికి సమాధానమే మేనిఫెస్టో

మీరు ఇచ్చిన అధికారాన్ని 6 కోట్ల మంది సంక్షేమం కోసమే వినియోగించా

ఏడాదిలో 3.58 కోట్ల మందికి రూ.40,627 కోట్లు నేరుగా ఖాతాల్లో జమ 

10,641 రైతు భరోసా కేంద్రాలను బటన్‌ నొక్కి ప్రారంభించిన సీఎం జగన్‌

‘అవినీతికి తావులేకుండా, పైసా దారి మళ్లకుండా ఏడాదిలో 3.58 కోట్ల మంది ప్రజలకు  రూ.40,627 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశాం. పింఛన్ల కోసం గత ప్రభుత్వం నెలకు రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే మేం నెలకు రూ.1,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గత ప్రభుత్వం విస్మరించిన ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.686 కోట్లు చెల్లించడంతో పాటు ఆరోగ్య ఆసరా అనే కొత్త పథకాన్ని ప్రారంభించాం. విద్యాదీవెన, వసతి దీవెన. పిల్లల చదువులకు భరోసా, కంటి వెలుగు, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, లా నేస్తం, గోరుముద్దతోపాటు  అక్కా చెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాలు అమలు చేస్తున్నాం’

జగన్‌ అనే నేను.. మీ బిడ్డగా, సీఎంగా ఏడాది క్రితం చేసిన ప్రమాణాన్ని, ఇచ్చిన మాటను తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నానని దైవసాక్షిగా, ప్రజల సాక్షిగా స్పష్టం చేస్తున్నా. ఈ ఏడాది పాలన చిత్తశుద్ధి, నిజాయతీ, నిబద్ధతతో సాగిందని మనస్ఫూర్తిగా చెబుతున్నా.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: గత సర్కారు పాలనకు, ఏడాదిగా తమ ప్రభుత్వ పాలనకు మధ్య తేడాను ఒకసారి చూడాలని, మేనిఫెస్టో హామీల అమలులో వ్యత్యాసాన్ని మనస్సాక్షిగా గమనించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మేనిఫెస్టోలోని 90 శాతం వాగ్దానాలను ఏడాదిలోనే అమలు చేశామని గర్వంగా చెప్పగలనని, ఈ విషయాన్ని ప్రజలే లెక్క తేల్చాలని కోరారు. మేనిఫెస్టోలో 129 హామీలిస్తే 77 హామీలను అమలు చేశామని, మరో 36 హామీలు అమలుకు తేదీలతో క్యాలెండర్‌ ప్రకటించామని, ఇంకా 16 హామీలు మాత్రమే మిగిలాయని, వాటిని కూడా ఈ ఏడాది పరుగులు పెట్టిస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. మేనిఫెస్టోలో చెప్పనివి కూడా ప్రజల అవసరాలు  దృష్టిలో ఉంచుకుని 40 అంశాలను అమలు చేశామని వివరించారు. వలంటీర్ల ద్వారా మేనిఫెస్టోను ఇంటింటికీ పంపిస్తామని, అందులో ఏమేం అమలు చేశామో మీరే లెక్క తేల్చాలని ప్రజలను కోరారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ 10,641 రైతు భరోసా కేంద్రాలను శనివారం క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు. ఏడాది పాలన పూర్తి చేసిన తాను మలి ఏడాదిలో చేస్తున్న తొలి సంతకంగా దీన్ని అభివర్ణించారు. అంతకుముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దాదాపు ఐదు లక్షల మంది రైతులు, అధికారులనుద్దేశించి ముఖ్యమంత్రి జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. సీఎం ప్రసంగం వివరాలివీ..

ఎంతో సంతోషంగా ఉంది..
ఈరోజుతో మన ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయింది. ఇవాళ రైతులతో గడపడం ఎంతో ఆనందంగా ఉంది. రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మాది. తొలి ఏడాదిలోనే రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకాన్ని తెచ్చి సుమారు 49 లక్షల మంది రైతు కుటుంబాల ఖాతాల్లో దాదాపు రూ.10,200 కోట్లు జమ చేశాం. రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించడం, విపత్తు వస్తే ఆదుకోవడం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా పనిచేశాం. ఆ దిశగానే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. 

11 ఏళ్ల ప్రయాణంలో నలుమూలలా తిరిగా..
నా రాజకీయ జీవితం ప్రారంభమై 11 ఏళ్లు అవుతోంది. 2009లో ఎంపీగా ఎన్నికయ్యా. కోట్ల మంది ప్రజలను కలిసి ఉంటా. ప్రతి ప్రాంతం సమస్యను తెలుసుకునేందుకు రాష్ట్రం నలుమూలలా అడుగులు వేశా. 3,648 కి.మీ పాదయాత్రతో ప్రతి జిల్లాలో తిరిగా. నా రాజకీయ జీవితంలో దాదాపు ప్రతి గ్రామాన్ని సందర్శించి ఉంటా. స్థోమత లేక కొంతమంది చదువుకోలేకపోయారని తెలిసి బాధపడ్డా. వైద్యం కోసం అప్పుల పాలు కావడం చూశా. క్యాన్సర్‌ వస్తే అరకొర చికిత్స అందించడం చూశా. ప్రభుత్వ ఆస్పత్రుల్లో దారుణమైన పరిస్థితులు, రైతుల కష్టాలను చూశా. కనీస ధర లేక పంటలు పొలాల్లోనే విడిచిపెడుతున్న వారిని చూశా. అక్క చెల్లెమ్మల బాధలు చూశా. గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను చూశా. వారి కన్నీరు తుడిచి జీవితాలను మార్చాలనే ఆలోచన చేశా.  

► ప్రజల సమస్యలన్నింటినీ చాలా దగ్గరగా చూశా. వాటన్నిటికీ సమాధానంగా మేనిఫెస్టో రూపొందించాం.కులం, మతం, పార్టీలు చూడకుండా, మాకు ఓటు వేయకపోయినా సరే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందాలని తలిచా. కేవలం రెండు పేజీలతో మేనిఫెస్టోను విడుదల చేశాం. ఏడాది కాలంలోనే దాదాపు 90 శాతం హామీలను నెరవేర్చానని గర్వంగా చెబుతున్నా. 

‘గత ప్రభుత్వం 650కి పైగా వాగ్దానాలు చేసి పేజీల కొద్దీ మేనిఫెస్టోను విడుదల చేసి  కనీసం 10 శాతం కూడా అమలు చేయలేదు. గ్రామాల్లో జన్మభూమి కమిటీలు  మాఫియా ముఠాలుగా మారి ప్రతి పనికి లంచం దండుకున్నాయి. ఇప్పుడు ఇంటి గడప వద్దే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. పూర్తి పారదర్శకతతో అమలవుతున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతున్నాయి’

‘‘చెప్పింది చేయడమే తప్ప ఏడాదిగా మరో ఆలోచన చేయలేదు. అవ్వాతాతల మీద గుండె నిండా ప్రేమతో, అక్కా చెల్లెమ్మల పట్ల మమకారంతో, రైతుల పట్ల బాధ్యతతో, అట్టడుగు వర్గాల పట్ల అభిమానంతో, మీ పిల్లల భవిష్యత్తు పట్ల దూరదృష్టితో.. అన్ని వర్గాల ఆరోగ్యంపై శ్రద్ధతో ఏడాదిగా పనిచేస్తున్నాం’’

 విత్తనాలకూ భరోసా..
► గతంలో కల్తీ విత్తనాలు, పురుగు మందులు అన్నీ టీడీపీకి చెందిన వారే సరఫరా చేశారు. ఇవాళ ప్రభుత్వం నాణ్యతను నిర్ధారించి సరఫరా చేస్తోంది. 18వ తేదీ నుంచి విత్తనాలు సరఫరా చేస్తున్నాం. ఎవరికీ ఇబ్బంది కలగకుండా స్లిప్‌లు, సమయం సూచిస్తూ పంపిణీ చేస్తున్నారు. నాడు అధికార పార్టీ నాయకులకే ప్రాసెసింగ్‌ యూనిట్లు, కంపెనీలు.. ఒకటి గల్లా. మరొకటి శ్రీని ఫుడ్స్‌.
► ఈ ఏడాదిలో రూ.2200 కోట్లతో రైతులు ఇబ్బంది పడకుండా మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ అమలు చేశాం.టమాటా, ఉల్లి, మొక్కజొన్న, అరటి, బత్తాయిలు, బొప్పాయి కొంటున్నాం.
గుంటూరులో సీఎం వైఎస్‌ జగన్‌ ఫొటోకు  పూలాభిషేకం చేస్తున్న అమ్మఒడి, పింఛను లబ్ధిదారులు, ఆటో డ్రైవర్లు 

 ఇలాంటి విపక్షాన్ని ఇప్పుడే చూస్తున్నాం..
మేం రాజధాని ప్రాంతంలో పేదలకు భూములిస్తామంటే డెమొగ్రఫిక్‌ బ్యాలెన్స్‌ (సామాజిక సమతుల్యం) దెబ్బ తింటుందని కోర్టులో వాదించారు. భూములు సేకరిస్తుంటే కోర్టుకు వెళ్లిన విపక్షాలను చూశాం కానీ ఇక్కడ పేదలకు ప్రభుత్వ భూములు ఇస్తుంటే కూడా కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్నారు. ఇలాంటి ప్రతిపక్షాన్ని ఇప్పుడే చూస్తున్నాం. 

 నాడు మాఫీ మాయ.. నేడు రైతన్నకు భరోసా
గత ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసింది. రూ.87,612 కోట్లకు గానూ ఐదేళ్లలో కనీసం రూ.15 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. మేం ఏడాది తిరగక ముందే రైతు భరోసా ద్వారా రూ.10,200 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. తొలిసారిగా కౌలు రైతులను కూడా ఆదుకుంటున్నాం. సున్నా వడ్డీ పథకం ద్వారా జూలైలో రూ.2 వేల కోట్లు వడ్డీ కింద ఇవ్వబోతున్నాం.

 ఇదీ తేడా...
గతంలో ఏ పని కావాలన్నా జన్మభూమి కమిటీల మాఫియా సంతకాలు, లంచాలు కావాలి. ఇవాళ ఎవరి ప్రమేయం, సిఫార్సు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ, గత ఎన్నికల్లో మాకు ఓటు వేయని వారైనా సరే ఇంటి తలుపు తట్టి  ప్రభుత్వ పథకాలను సంతృప్త స్థాయిలో అందిస్తున్నాం. మీ కళ్ల ముందే గ్రామ సచివాలయాల ద్వారా గడువు విధించి మరీ 540 రకాల సేవలు అందిస్తున్నాం. దరఖాస్తు మొదలు లబ్ధిదారుల జాబితా వరకు గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నాం. ఒకటో తారీఖునే పండగైనా, ఆదివారం అయినా సరే తెల్లవారుజామునే ఇంటికి వెళ్లి అవ్వాతాతలకు వలంటీర్లు చిరునవ్వుతో పెన్షన్‌ ఇస్తున్నారు.  
► గతంలో స్కూళ్లు దారుణంగా ఉండేవి. మధ్యాహ్న భోజన పథకం బిల్లులు నెలల తరబడి పెండింగ్‌ పెట్టేవారు. ఆయాలకు ఇచ్చే రూ.1000 గౌరవ వేతనం కూడా ఇచ్చేవారు కాదు. ఇవాళ ప్రతి స్కూల్‌లో 9 రకాల సదుపాయాలు కల్పిస్తున్నాం. పిల్లలకు పౌష్టికాహారం ఇస్తూ సరుకుల బిల్లులు ఆలస్యం కాకుండా గ్రీన్‌ఛానల్‌లో పెట్టడమే కాకుండా, ఆయాల గౌరవ వేతనం రూ.3 వేలకు పెంచాం. పేద బిడ్డల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం చదువులు తెచ్చాం. విద్యా సంస్థలపై నియంత్రణ కోసం స్కూళ్లు, కాలేజీలకు వేర్వేరుగా రెండు రెగ్యులేటరీ సంస్థలు తెచ్చాం.
► గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు నెలల తరబడి బిల్లులు చెల్లించలేదు.  రూ.686 కోట్లు బకాయిలు పెట్టింది. అవన్నీ చెల్లించి ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా చేశాం. దీంతో తిరిగి చక్కటి చికిత్స అందిస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలలో కూడా ఆరోగ్యశ్రీలో చికిత్స అందుతోంది. నాడు–నేడు ద్వారా రూ.16 వేల కోట్లకు పైగా వ్యయంతో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చబోతున్నాం. 

లబ్ధిదారులు 3.58 కోట్ల మంది
ఏడాదిలో వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు 3.58 కోట్ల మంది కాగా వారి ఖాతాల్లో రూ.40,627 కోట్లు జమ చేశాం. వీరిలో 1.78 కోట్ల మంది బీసీలకు రూ.19,309 కోట్లు అందించాం. 61.28 లక్షల మంది ఎస్సీలకు రూ.6,500 కోట్లు ఖర్చు చేశాం. 18.40 లక్షల మంది ఎస్టీలకు రూ.2,136 కోట్లు ఇచ్చాం. 19.05 లక్షల మంది మైనారిటీ సోదరులు, అక్కాచెల్లెమ్మలకు రూ.1,722 కోట్లు ఇచ్చాం. 77.84 లక్షల మంది ఇతరుల కోసం రూ.10,768 కోట్లు ఖర్చు చేశాం. .
► గత ప్రభుత్వం దిగిపోయేటప్పుడు రూ.39 వేల కోట్ల మేర బకాయిలు పెట్టింది. రూ.2.60 లక్షల కోట్ల మేర అప్పులు చేసింది. దీనికి వడ్డీతో పాటు విద్యుత్‌ సంస్థలకు మరో రూ.20 వేల కోట్లు బకాయిలు పెట్టింది.
► మేం రివర్స్‌ టెండర్ల ద్వారా దాదాపు రూ.2,200 కోట్లు ఆదా చేశాం. అవినీతికి తావు లేకుండా జ్యుడీషియల్‌ ప్రివ్యూ కమిషన్‌ను ఏర్పాటు చేశాం.

పోలీసులకు వీక్లీ ఆఫ్‌..
గతంలో పోలీసులతో బండ చాకిరీ చేయించుకునేవారు. ఏనాడూ వారి కుటుంబాల గురించి ఆలోచించలేదు. ఇప్పుడు వారికి వీక్లీ ఆఫ్‌ అమలు చేస్తున్నాం. గ్రామ సచివాలయాల్లో పోలీసు మిత్రలను ఏర్పాటు చేశాం.

మద్యానికి కళ్లెం..
గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరిగాయి. దాదాపు 43 వేల బెల్టు షాపులు, మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్‌ రూమ్‌లు ఏర్పాటు చేయడంతో అక్కాచెల్లెమ్మలు ఇబ్బంది పడ్డారు. ఇవాళ 43 వేల బెల్టు షాపులు రద్దు చేయడంతోపాటు 33 శాతం దుకాణాలు తగ్గించాం. ధరలు పెంచడం వల్ల బీర్ల అమ్మకాలు 55 శాతం తగ్గాయి. ఐఎంఎఫ్‌ఎల్‌ అమ్మకాలు 24 శాతం తగ్గాయి. గతంలో వారానికి 5 నుంచి 6 బాటిళ్ల మద్యం తాగితే ఇప్పుడు 2 మాత్రమే తాగుతున్నారు.

సామాజిక న్యాయం..
గత ప్రభుత్వానికి మాటలు తప్ప బీసీలపై ప్రేమ లేదు. సామాజిక న్యాయం అసలే లేదు. మా మంత్రివర్గంలో 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలున్నారు. డిప్యూటీ సీఎం పదవులు ఈ వర్గాలకే ఇచ్చాం. సచివాలయ ఉద్యోగాలలో 82.5 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉన్నారు. నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించాం. దుర్గ గుడి పాలక మండలిలో తొలిసారిగా బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పించాం. కృష్ణా ఏఎంసీలో కూడా వారికే స్థానం దక్కేలా చేశాం. ఎస్సీలకు మూడు వేర్వేరు కమిషన్లతోపాటు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటు చేశాం..

పేదలకు ఇళ్ల స్థలాలు.. 
వైఎస్సార్‌ జయంతి రోజు 29 లక్షల ఇళ్లస్థలాల పట్టాలను పంపిణీ చేస్తాం. రూ.6 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి అర్హత ఉన్న ప్రతి నిరుపేదకు ఇంటి స్థలం అందిస్తాం. మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి రూ.24 వేలతోపాటు చేపల వేటపై నిషేధం సమయంలో మత్స్యకారులకు రూ.10 వేలు చొప్పున సాయం చేశాం. ఆటో డ్రైవర్లు, నాయీ బ్రాహ్మణులు, రజకులు ఇబ్బంది పడకుండా సాయమందించాం.

అందరి సంక్షేమం కోసం..
అవ్వాతాతల మీద గుండెనిండా ప్రేమతో, అక్కా చెల్లెమ్మల మీద మమకారంతో, రైతుల పట్ల బాధ్యతతో, అట్టడుగు వర్గాల పట్ల అభిమానంతో, మీ పిల్లల భవిష్యత్తు పట్ల దూరదృష్టితో, మీ అందరి ఆరోగ్యం పట్ల శ్రద్ధతో, మీరు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్‌ సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకున్నా. 

మరిన్ని వార్తలు