మడిలో మాణిక్యాలు

3 Jul, 2019 07:45 IST|Sakshi
తల్లిదండ్రులతో పాటు కూరగాయలు కోస్తున్న నాగమణి, సంగీత 

సాక్షి, బిబ్బిలి(విజయనగరం) : వేకువనే నిద్ర లేస్తారు. అమ్మానాన్నలతో పొలానికెళ్తారు. పంట పనులకు సాయం చేస్తారు. కోసిన కూరగాయల్ని తట్టల్లో మార్కెట్‌కు తరలిస్తారు.. కన్నవారికి కుడి భుజంలా ఉంటూనే.. చక్కగా చదువుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కంటే కూతుర్నే కనాలి.. అన్నట్టున్న ఈ బంగారు తల్లులంతా మండలానికి చెందిన విద్యార్థినులు. పేద కుటుంబాలకు చెందిన వీరిలో అత్యధికులు ఉన్నత విద్య పూర్తి చేశారు. మరికొందరు చదువుకుంటున్నారు. వ్యవసాయ పనులన్నీ ఉదయం 8 గంటల్లోగా పూర్తిచేసి మళ్లీ కళాశాలకు బయలుదేరి వెళ్తూ చదువులోనూ ముందుంటున్న రామభద్రపురం మండల విద్యార్థినులపై కథనమిది.

మండల కేంద్రంలోని ఎరుసు సత్యారావు, చిన్నమ్మి దంపతుల కుమార్తెలు శ్యామల ఎమ్మెస్సీ బీఈడీ, మాధవి డిగ్రీ, డైట్‌ శిక్షణ పూర్తి చేశారు. చింతల శ్రీనివాసరావు, పుణ్యవతి దంపతుల కుమార్తెలు సంగీత ఇంటర్‌ ద్వితీయ ఏడాది, నాగమణి డిగ్రీ మొదటి ఏడాది చదువుతున్నారు. కర్రి సాంబ, అన్నపూర్ణ దంపతుల కుమార్తెలు సాయి డిగ్రీ, ఐటీఐ, అశ్వని ఇంటర్, గొర్లి శ్రీనివాసరావు, మహాలక్ష్మి దంపతుల కుమార్తె ఝాన్సీ డిగ్రీ పూర్తి చేశారు. మరికొందరు ప్రస్తుతం చదువుకుంటున్నారు. 

 వేకువ జామునే లేచి..
వీరు ఉన్నత విద్య చదువుతున్నాం కదా.. అని ఏమాత్రం బిడియపడకుండా రోజూ తెల్లారే తల్లిదండ్రులతో కలసి పొలాలకు వెళ్లి కూరగాయలు కోసుకొని మార్కెట్‌లో విక్రయిస్తారు. మరికొందరు కుటుంబ భారాన్ని కూడా మోస్తూ పెద్ద దిక్కు అవుతున్నారు. వ్యవసాయ పనులతో పాటు పాడి పశువులను పోషిస్తూ వాటికి గడ్డి కోయడం, దాణాలు పెట్టడం, పాలు పితకడం, పాల కేంద్రాలకు పాలు సరఫరా చేయడం వంటి పనులు కష్టపడి చేస్తూ ఆదాయ మార్గాలను చూసుకుంటున్నారు.

పొలం పనులు చేస్తా
నేను ఎమ్మెస్సీ, బీఈడీ చేశాను. బాడంగి టీఎల్‌ఎన్‌ స్కూల్‌లో ఉపాధ్యాయినిగా చేస్తున్నాను. రోజూ వేకువ జామున చెల్లి మాధవి, అమ్మ, నాన్నలతో కలసి కూరగాయలు కోసేందుకు పొలానికి వెళ్తాం. కూరగాయలు కోసి మార్కెట్‌లో విక్రయించిన తరువాత చెల్లి కాలేజీకి, నేను స్కూల్‌కు వెళ్తాం. తల్లిదండ్రులకు సహాయపడుతున్నందుకు ఆనందంగా ఉంది.
– ఎరుసు శ్యామల, ఎమ్మెస్సీ, బీఈడీ, రామభద్రపురం

ఆనందంగా ఉంది
నేను, అక్క చదువుకుంటూ అన్ని పనుల్లోనూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నాం. తోడ పుట్టిన అన్నదమ్ములు లేరు కాబట్టి మేమే అమ్మ, నాన్నలకు సహాయపడుతున్నాం. పూర్వం నుంచి వ్యవసాయ కుటుంబానికి చెందిన వారం కాబట్టి ఈ పనులు చేయడం ఆనందంగా ఉంది.
– చింతల నాగమణి, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం, రామభద్రపురం.

కుమార్తెలే అండ
ఉన్నత విద్య చదువుకుంటూ వ్యవసాయ, ఇంటి పనుల్లో కుమార్తెలే సహాయపడుతున్నారు. రోజూ ఉదయం మాతో పాటు పొలంలోకి వచ్చి కూరగాయలు కోస్తారు. మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయిస్తారు. వ్యవసాయంలో కలుపు తీయడం వంటి పనులు చేస్తూ ఆసరాగా నిలుస్తున్నారు. కొడుకులు లేరన్న బాధ మాలో లేదు.
– చింతల పుణ్యవతి, సంగీత, నాగమణి తల్లి, రామభద్రపురం

మరిన్ని వార్తలు