ఐపీఎల్‌ విజయ్‌కుమార్‌

28 Jan, 2018 12:08 IST|Sakshi

సెహ్వాగ్‌ను ఔట్‌ చేసి సచిన్‌ ప్రశంసలందుకున్నాడు..

మూడు సీజన్లలో దక్కన్‌ చార్జర్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం

జిల్లాఖ్యాతిని జాతీయస్థాయిలోచాటిన విజయ్‌

క్రికెట్‌లో తనకు తానే సాటిగా రాణింపు

 యువక్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తున్న వైనం

ప్రపంచంలోనే విధ్యంసకర బ్యాట్స్‌మన్‌గా పేరొందిన వీరేంద్ర సెహ్వాగ్‌ వికెట్‌ తీసిన వీరుడతను.. క్రికెట్‌ లెజండ్‌గా పేరొందిన సచిన్‌ టెండూల్కర్‌ ప్రశంసలందుకున్న ఫాస్ట్‌బౌలర్‌.. చండప్రచండమైన వేగంతో బౌలింగ్‌ సంధించి వికెట్లు తీయగల ధీరుడు. అప్పట్లోనే తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తున్నాడని అందరి నోటా ఒకటే అభినందనల మూట. ఐపీఎల్‌లో సత్తా చాటి ఐపీఎల్‌ను తన ఇంటిపేరుగా మార్చుకున్న క్రీడా కెరటం విజయ్‌కుమార్‌ విజయ గాథ..

సాక్షి, కడప/స్పోర్ట్స్‌:  పైడికాల్వ విజయ్‌కుమార్‌ క్రికెట్‌లో పరిచయం అక్కరలేని పేరు. లారీ క్లీనర్‌ నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వరకు ఎదిగిన మేటి క్రీడాకారుడు. వల్లూరు మండలం పైడికాల్వ గ్రామానికి చెందిన కూలీ పనులు చేసుకునే దావీద్, సరస్వతిల కుమారుడైన విజయకుమార్‌ తొలినాళ్లలో లారీ క్లీనర్‌గా, తర్వాత వంటమనిషిగా పనిచేసేవాడు. ఖాళీ సమయంలో పంచె కట్టుకుని మైదానంలోకి దిగి బౌలింగ్‌ వేస్తుంటే ప్రత్యర్థులు బెంబేలెత్తేవారు. అనంతరం అతని ప్రతిభను గుర్తించిన జిల్లా క్రికెట్‌ సంఘం ప్రతినిధులు అవకాశం కల్పించడంతో ఇక వెనుతిరిగి చూడలేదు. అదే ఏడాది (2005–06) అండర్‌–22 విభాగంతో పాటు జోన్‌స్థాయి పోటీల్లో సత్తాచాటాడు. విజయ్‌ ప్రతిభను గుర్తించి అదే ఏడాది ఆంధ్రా క్రికెట్‌ సంఘం రంజీ ట్రోఫీల్లో ఆంధ్రా జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం కల్పించింది.

200పైగా వికెట్లు తీసిన రెండో ఆంధ్రా బౌలర్‌
ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వారిలో ఇప్పటివరకు అనంతపురానికి చెందిన షాబుద్దీన్‌ 248 వికెట్ల తీయగా ఆయన తర్వాత 228 వికెట్లను తీసిన రెండో బౌలర్‌గా పైడికాల్వ విజయ్‌ రికార్డు సృష్టించాడు. వైఎస్సార్‌ జిల్లాలో పుట్టిన విజయ్‌కుమార్‌ అంటే ఫాస్ట్‌ బౌలర్‌గానే కాకుండా వికెట్లు తీయడంలో దిట్టగా పేరొందాడు. వేగంగా బంతులను విసరడంతోపాటు రంజీ మ్యాచ్‌లలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించాడు. అవతల ఎంతటి బ్యాట్స్‌మన్‌ అయినా తన బౌలింగ్‌తో ముప్పుతిప్పులు పెట్టగల సామర్థ్యం విజయ్‌ సొంతం.

మూడు సీజన్లలో దక్కన్‌ చార్జర్స్‌కు ప్రాతినిధ్యం
ఆంధ్ర జట్టుకు రంజీలలో ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న విజయ్‌కుమార్‌కు ఊహించని విధంగా ఐపీఎల్‌ రూపంలో అదృష్టం కలిసివచ్చింది. ఇక విజయ్‌ వెనక్కి తిరిగి చూడలేదు. 2008, 2009, 2010 సీజన్‌లో హైదరాబాద్‌ దక్కన్‌ చార్జర్స్‌లో కీలక బౌలర్‌గా రాణించాడు. అదే సమయంలో వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు పలు అంతర్జాతీయ బ్యాట్స్‌మన్ల వికెట్లను సైతం తీశాడు. విజయ్‌ ప్రతిభను గుర్తించిన సచిన్‌ సైతం ఉజ్వల భవిష్యత్తు ఉందని అభినందించాడు. అనంతరం జరిగిన పరిణామాలతో దక్కన్‌ చార్జర్స్‌ ఉనికి ప్రశ్నార్థకంగా మారటంతో తిరిగి రంజీబాట పట్టాల్సి వచ్చింది.

దేశానికి ప్రాతినిధ్యం వహించడమే జీవితాశయం..
ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని క్రికెట్‌ అంటే ప్రాణంగా భావిస్తూ వస్తున్నా. ఎప్పటికైనా భారతజట్టులో సభ్యుడు కావాలన్నదే నా జీవితాశయం. క్రికెట్‌ సంఘం పెద్దలందరూ నాకు మద్దతుగా నిలుస్తుండటం నాలో ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. పదేళ్ల క్రితం అప్పటి కలెక్టర్లు నాకు భూమిని, నివాసస్థలాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇస్తే బాగుంటుంది.
– పైడికాల్వ విజయ్‌కుమార్, రంజీ క్రికెటర్, కడప

హామీల అమలు ఎప్పుడు..
ఐపీఎల్‌ ద్వారా జాతీయస్థాయిలో జిల్లా ఖ్యాతిని చాటిచెప్పిన పైడికాల్వ విజయ్‌కుమార్‌ నేపథ్యం గుర్తించిన జిల్లా అధికారులు క్రీడా పోత్సాహం కింద ఆయనకు 5 ఎకరాల భూమి, 12 సెంట్ల నివాస స్థలం ఇస్తామని అప్పటి కలెక్టర్‌ కృష్ణబాబు, తర్వాత వచ్చిన శశిభూషణ్‌కుమార్‌లు ఆయనకు హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఆదేశాలను సైతం వారు జారీచేశారు. దీంతో విజయ్‌ పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరిగారు. అయినప్పటికీ దిగువస్థాయి సిబ్బంది తిప్పుకుంటుండటంతో చేసేదేమీ లేక.. తిరిగి క్రికెట్‌ వైపు దృష్టిసారించారు. అదే సమయంలో తనకు వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశం వచ్చినప్పటికీ వాటిని వదులుకుని క్రికెటే ప్రాణంగా కొనసాగుతూ వచ్చాడు. రాష్ట్రానికి చెందిన ఎంఎస్‌కే ప్రసాద్‌ బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌గా ఉన్న నేపథ్యంలో ఎప్పటికైనా దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రాకపోదా అన్న ఆశతో ఎదురుచూస్తున్నాడు. తన జూనియర్లకు విలువైన సలహాలు, సూచనలు ఇస్తూ యువతకు మార్గదర్శకుడిగా నిలుస్తున్న విజయ్‌కుమార్‌కు ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని క్రీడాభిమానులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు