డ్రామాకు కేరాఫ్‌ అ‘డ్రస్’‌ 

4 Jul, 2020 12:34 IST|Sakshi
డ్రామా దుస్తులు కుడుతున్న సీతారాం, తాను కుట్టిన దుస్తులు చూపుతూ..

నాటక డ్రస్సుల తయారీలో కొండంపేట వాసి

నష్టాలు వచ్చినా తండ్రిబాటలోనే నడుస్తున్న తనయుడు 

రాజాం సిటీ /రూరల్‌: సాంస్కృతిక నాగరికతలో అత్యంత ప్రాధాన్యం ఉన్న రంగస్థల కళకు కళాకారులు వన్నె తెస్తే.. వేదిక వెనుకనే ఉంటూ రూపకల్పన చేసే వారు ఎంతోమంది ఉంటారు. ఆహార్యం, వస్త్రధారణ విషయంలో కీలకభూమిక పోషించే రంగస్థల నటులు ధరించే వ్రస్తాలను నైపుణ్యంతో కుట్టడంలో దర్జీల పాత్ర ఎంతైనా ఉంది. ఈ అరుదైన వృత్తిని చేపట్టి గతంలో రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతలకు వస్త్రాలను కుట్టి ఇచ్చిన దివంగత బాదిరెడ్డి పాపారావు తన వారసత్వాన్ని కుమారుడు బాదిరెడ్డి సీతారాంకు అప్పగించి కళారంగ అభిమానాన్ని చాటుకున్నారు.

రాజాం మండలం కొండంపేటకు చెందిన ఈయన తండ్రి చూపిన బాటలోనే నడుస్తూ అంతరించిపోతున్న కళల్లో ప్రథమ స్థానంలో ఉన్న రంగస్థల కళాకారులకు దుస్తులను కుట్టే బాధ్యతను స్వీకరించి పలువురి మన్ననలు అందుకుంటున్నాడు. రంగస్థల దిగ్గజం, బళ్లారి రాఘవ అవార్డు గ్రహీత దివంగత అమరపు సత్యనారాయణ నుంచి లోలుగు ఆచారి, యడ్ల గోపాలం, డాక్టర్‌ మీగడ రామలింగస్వామి, మొలకారెడ్డి వంటి మహామహులకు సైతం దుస్తులు సమకూర్చిన పాపారావు 2018 పరమపదించారు. అత్యంత కఠినమైన ఈ విద్యను తన పెద్ద కుమారుడికి అప్పగించారు. అప్పటికే దర్జీ పనిలో ఉన్న సీతారాం తండ్రి అప్పగించిన బాధ్యతను కష్టనష్టాలకోర్చి నేటికీ కొనసాగిస్తున్నాడు.
 

ఆదరణ కరువైనా.. 
నానాటికీ పౌరాణిక కళ అంతరించిపోతుండడంతో ఈ రంగంలోకి వచ్చేవారే కరువయ్యారు. దీంతో డ్రామాడ్రస్సులు కుట్టించేవారు లేక పలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీనికితోడు రెండు నెలలకో, ఆరు మాసాలకో వచ్చే ఆర్డర్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. పాఠశాలల్లో సాంప్రదాయ నృత్యాలు, బుర్రకథలు తదితర వస్త్రాలు అవసరమైనప్పుడు పని ఉంటుంది. ఒకసారి కుట్టిన వస్త్రం సుమారు 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఉపయోగించేలా ప్రత్యేక శైలిలో కుట్టి ఇస్తామని, దీనికి విపరీతమైన ఖర్చు ఉన్నప్పటికీ సాదకబాదకాలను భరించి కుట్టి ఇవ్వడంలో సంతృప్తి మిగులుతుందని ఆయన తెలిపారు.     

ఎక్కడెక్కడి నుంచో.. 
డ్రామాడ్రస్సులు కుట్టడంలో ఎవరూ లేకపోవడంతో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. డ్రామా డ్రస్సులతోపాటు పంచె చిలకట్టులు కూడా కుట్టడంతో హైదరాబాద్, బెంగళూరు, రాయలసీమ, వైజాగ్, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి ఎంతో మంది వచ్చి ఆర్డర్లు ఇస్తున్నారు. ఓ డ్రామా పంచె కుట్టేందుకు రెండు రోజులు సమయం పడుతుందని సీతారాం తెలిపారు. ఎంతో మంది రాజకీయ నాయకులకు పంచెలు కుట్టినట్లు పేర్కొన్నారు. 

ప్రోత్సహించాలి.. 
నా చిన్నతనం నుంచి స్కూల్‌ ముగియగానే నాన్న వద్ద బట్టలు కుట్టడం నేర్చుకున్నాను. డ్రామా డ్రస్సులు కుట్టే పని అరుదుగా లభిస్తుందని చెప్పడంతో మక్కువ పెంచుకున్నాను. ప్రస్తుతం దర్జీ వృత్తి కూడా రడీమేడ్‌ వ్రస్తాల రాకతో సంక్షోభంలో పడింది. అరుదైన డ్రామా డ్రస్సులు కుట్టే వృత్తిని గుర్తించి ప్రభుత్వం, దాతలు ప్రోత్సహిస్తే రంగస్థల కళకు పునరుజ్జీవం పోసేందుకు అవకాశం ఉంటుంది.  
– బాదిరెడ్డి సీతారాం
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా