అంగట్లో మృత్యువు

3 Nov, 2017 08:52 IST|Sakshi

స్నాక్స్‌ పేరుతో నాసిరకం పదార్థాల విక్రయం

పిల్లలను ఆకర్షించేలా ప్యాకింగ్‌

రోగాల బారిన పడుతున్న చిన్నారులు

స్పందించని ఆహార తనిఖీ అధికారులు

పాఠశాలల ఎదుటే విక్రయాలు

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నాలుగేళ్ల బాలుడు నిరీక్షణ డైమండ్‌ కంపెనీ తయారు చేసిన రింగ్స్‌(చెగోడీలు) ప్యాకెట్‌ కొనుగోలు చేశాడు. అందులో ఉచితంగా ఉంచిన బొమ్మను తినబోగా గొంతులో ఇరుక్కుని ఊపిరాడక మృత్యువాత పడ్డాడు.  బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటన తల్లిదండ్రుల్లో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పరిస్థితిపై ‘సాక్షి’ ఫోకస్‌.

ఇది రాయదుర్గంలోని ఓ జంక్‌ ఫుడ్‌ తయారీ యంత్రం. ఏడాది కాలంగా ఎలాంటి అనుమతి లేకపోయినా యథేచ్ఛగా తయారీ కొనసాగిస్తున్నారు. బొరుగుల మిక్చర్‌.. చిప్స్‌.. ఇతరత్రాలను వివిధ రకాల పేర్లతో ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో పట్టణంతో పాటు ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. రాత్రి వేళ గుట్టుగా సాగుతున్న ఈ తయారీ వ్యవహారం అధికారులకు తెలియనిది కాదు. అయినప్పటికీ మౌనం దాల్చడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రజారోగ్యం పట్ల వీరికున్న చిత్తశుద్ధి ఏపాటిదో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి అనధికార యంత్రాలతో నాసిరకం తినుబండారాలు తయారుచేసి యథేచ్ఛగా విక్రయిస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు.

టేస్టీ స్నాక్స్‌...చెటక్‌పటక్‌...క్రేజీ క్రాక్స్‌...చాకో...కుర్‌కురే.. ఒక్కోదానిపై        ఒక్కోపేరు...అందమైన ప్యాకింగ్‌...అతి తక్కువ ధర...ఆపై హోరెత్తించే ప్రచారం..     అందువల్లే ఇపుడు ఏ చిన్నారి చేతిలో చూసినా ఈ నాసిరకం చిరుతిళ్లే       కనిపిస్తున్నాయి. ధర తక్కువగా ఉండడంతో తల్లిదండ్రులు కూడా వాటినే    కొనుగోలు చేసి బిడ్డలకు తినిపిస్తున్నారు. కానీ ఈ రంగురంగుల ప్యాకెట్లలో విషం దాగుందనీ, అది చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఎవరూ గ్రహించలేకపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి వ్యాపారం      జోరుగా సాగుతుండగా... ఈ నాసిరకం చిరుతిళ్ల ప్రభావం ఇప్పుడిప్పుడే       కనిపిస్తోంది. చిన్నారులు తరచూ అనారోగ్యానికి గురికావడం...ఊబకాయంతో బాధపడడం...  మూత్రపిండాల సమస్య...ఆకలి మందగించడం లాంటి         లక్షణాలతో ఆస్పత్రులకు వెళ్తున్న చిన్నారులు ఎక్కువవుతున్నారు.

ఆహారపదార్థాల  పేరుతో విషతుల్యమవుతున్న ఇలాంటి వాటిని బహిరంగంగా  విక్రయిస్తున్నా..  ఆహార తనిఖీ శాఖ అధికారులు ఇంతవరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కనీసం తల్లిదండ్రులైనా బిడ్డల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాసిరకం చిరుతిళ్లకు చిన్నారులను దూరంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికీ కళ్లు తెరవకపోతే మాత్రం రంగురంగుల ప్యాకెట్లలోని బూతం మీ ఇంటి దీపాన్ని మింగేయడం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

విచ్చలవిడిగా అమ్మకాలు
మడకశిర: నియోజకవర్గంలోని మడకశిర, అగళి, రొళ్ళ, గుడిబండ, అమరాపురం మండలాల్లోని కళాశాలలు, పాఠశాలల వద్ద రోడ్లపైనే తినుబండారాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. నాణ్యత అంతంతమాత్రంగానే ఉంటుంది. రోడ్ల పక్కనే తోపుడు బళ్లను ఏర్పాటు చేసుకుని తినుబండారాల వ్యాపారం చేస్తుండడంతో దుమ్ము, ధూళి వీటిపై పడి నాణ్యత లోపిస్తోంది. వీటిని తింటున్న విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. పర్యవేక్షించాల్సిన  ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ కనీస తనిఖీలు నిర్వహించడం లేదు. ఈ విషయం తమ పరిధిలో కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ నాసిరకం చిరుతిళ్లను తింటున్న చాలామంది విద్యార్థులు రోగాలతో ఆస్పత్రులకు తిరుగుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాల్సి అవసరం ఉంది.

ఉరవకొండ: ఇక్కడ కనిపిస్తున్నది ఉరవకొండ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాల ఎదుట ఏర్పాటు చేసిన దుకాణం. దుకాణం నిండా నాసిరకం చిరుతిళ్ల ప్యాకెట్లను నింపేశారు. ధర తక్కువగా ఉండడంతో చిన్నారులంతా వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల ఎదుట ఇలాంటి దుకాణాల్లో ఈ నాసిరకం చిరుతిళ్లు విక్రయిస్తున్నారు. ఇక తోపుడు బండ్లపై క్రిమ్‌ బిస్కెట్లు, నాసిరకంగా తయారు చేసిన అరిసెలు కూడా విక్రయిస్తున్నారు. వీటిని తింటున్న చిన్నారులు రోగాలబారిన పడుతున్నారు.

ఆరోగ్యానికి ముప్పు
కళ్యాణదుర్గం: చిరుతిళ్లు చిన్నారులను ఆస్పత్రుల పాలు చేస్తున్నాయి. నాణ్యత ప్రమాణాలు ఏమాత్రం పాటించకుండా తయారు చేస్తున్న వీటిని తింటున్న ఎంతో మంది విద్యార్థులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కళ్యాణదుర్గం పట్టణంలో కేసీజీహెచ్, బాలికల ఉన్నత పాఠశాల, నార్తు హైస్కూల్, జూనియర్‌ కళాశాల, వివేకానంద ప్రైవేట్‌ విద్యాసంస్థల ఎదుట తినుబండారాలు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కుళ్లిపోయిన పండ్లు, పురుగులు పడ్డ తినుబండారాలను విద్యార్థులకు తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. పైగా వీటిపై దుమ్ము, ధూళి పేరుకుపోయి ఉంటోంది. వీటిని తింటున్న వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక వివిధ రకాల ప్యాకెట్లలో...వివిధ కంపెనీల పేరుతో విక్రయిస్తున్న చెగోడీలు, చిప్స్‌ మరీ నాసిరకంగా ఉంటున్నాయి. అందువల్లే వివిధ ఆరోగ్య సమస్యలతో కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని వివిధ ఆస్పత్రులకు వస్తున్న చిన్నారుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

అనంతపురం అర్బన్‌: చిన్నారులంతా ‘జంక్‌’ వలకు చిక్కి అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు. మార్కెట్‌లో విక్రయిస్తున్న చిరుతిళ్లలో కనీస నాణ్యతాప్రమాణాలు లేకపోవడంతో వాటిని తిన్నవారంతా ఆరోగ్య సమస్యలతో బాధçపడుతున్నారు.

రంగులతోనే రోగాలు
పిల్లలు కోసం తయారు చేస్తున్న చిప్స్, చాక్లెట్లు, ఐస్‌ క్యాండీలు, సొంగలు(గోల్డెన్‌ ఫింగర్స్‌) తదితర వాటిలో రోగ కారకాలైన నిషేధిత రంగులు వినియోగిస్తున్నారు. చట్ట విరుద్ధమని తెలిసినా లాభాపేక్షతో ఈ దారుణానికి పాల్పడుతున్నారు. ఇలాంటి వాటిని తినడం వల్ల పిల్లలకు గవద గడ్డలు ఏర్పడతాయి. రంగుల కారణంగా కేన్సర్‌ వచ్చే  ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

చక్కెర బదులుగా చాక్రిన్‌
తీపి పదార్థాల్లో చక్కెర లేదా బెల్లం వినియోగించాలి. అయితే చాలా మంది పారిశ్రామిక అవసరాలకు మాత్రమే వాడాల్సిన చాక్రిన్‌ వాడుతున్నారు. ఇది ధర తక్కువగా ఉండడంతో పాటు చక్కెర, బెల్లం కంటే  50 శాతం అధిక తీపిని కలిగి ఉంటుంది. అందువల్లే కొందరు వ్యాపారులు చాక్రిన్‌ ఉపయోగించి చిరుతిళ్లు తయారు చేస్తున్నారు. చాక్రిన్‌తో తయారైన పదార్థాలు తినడం వల్ల ప్రాణాంతక కేన్సర్, అల్సర్, కాలేయ, శ్వాస కోస వ్యాధులు సంక్రమిస్తామని వైద్యులు చెబుతున్నారు.

హైదరాబాద్‌ నుంచి దిగుమతి
ప్యాకెట్‌ జంక్‌ ఫుడ్‌ హైదరాబాద్‌ నుంచి భారీ స్థాయిలో జిల్లాకు దిగుమతి అవుతోంది. వీటి తయారీకి కనీసం రూ.40 లక్షలు పెట్టుబడి అవుతుండడంతో జిల్లాలోని వ్యాపారులంతా హైదరాబాద్‌ నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి జిల్లా  వ్యాప్తంగా దుకాణదారులకు విక్రయిస్తున్నారు.

మరిన్ని వార్తలు