అరుపులుండవ్‌.. మెరుపు దాడులే 

26 Nov, 2019 04:13 IST|Sakshi

శునక రూపం.. చిరుత రాజసం 

పందికోన గ్రామ సింహాల స్టైలే వేరు..

పోలీస్‌ శాఖలో సేవలు 

ఖండాంతరాలు దాటిన ఖ్యాతి 

అవి సాదాసీదా శునకాలుగానే ఉంటాయి. అంతకుమించి విశ్వాసమూ ప్రదర్శిస్తాయి. అరుపులు వాటికి చేతకావు. అనుమానమొస్తే అమాంతం దాడి చేసి.. ప్రతాపం చూపిస్తాయ్‌. గ్రామ సింహాల మాదిరిగా కనిపిస్తూ.. చిరుత రాజసాన్ని ప్రదర్శించే పందికోన శునకాలకు చాలా ప్రత్యేకతలున్నాయి. చిరుత పులితో క్రాస్‌ బ్రీడింగ్‌ వల్ల కలిగిన సంతానంగా చెప్పే ఈ శునకాలు పోలీస్‌ శాఖలో నూ సేవలందిస్తున్నాయి. 

పత్తికొండ: కర్నూలు జిల్లా పందికోన శునకాల ఖ్యాతి ఖండాంతరాలను దాటింది. మూగజీవాలకు రక్షణగా.. పంటలకు కాపలాగా ఉంటూ క్రూర మృగాలను సైతం తరిమేస్తాయి. పౌరుషానికి మారుపేరుగా నిలిచే ఈ శునకాలు పోలీస్‌ శాఖలో చేరి పలు కేసులను కూడా ఛేదించాయి. పౌరుషం, గాంభీర్యం, వేటాడే తత్వం వీటి సొంతం. 

పాలెగాళ్ల  కాలంలో.. 
పత్తికొండకు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న పందికోన గ్రామాన్ని బ్రిటిష్‌ కాలంలో పాలెగాళ్లు పాలించేవారు. అప్పట్లో భారీ కొండల మధ్య ఉండే దట్టమైన అరణ్యం నుంచి చిరుతలు గ్రామంలోకి వస్తుండేవి. ఆ క్రమంలో గ్రామంలోని సత్రంలో ఓ చిరుత పులి ప్రసవించగా.. దానికి పుట్టిన మగ చిరుత ఆడ కుక్కలతో కలిసి సంచరించేదట. తదనంతర కాలంలో ఆ చిరుత, గ్రామ సింహాల సంపర్కం వల్ల ఆడ శునకాలకు చిరుత లాంటి కుక్క పిల్లలు పుట్టాయని.. ఆ సంతానం వృద్ధి చెంది పందికోన శునకాలుగా పేరొచ్చిందని గ్రామానికి చెందిన రంగప్పరాజు, గువ్వల రంగస్వామి చెప్పారు. 

దొంగల్ని  ఇట్టే పట్టేస్తాయి 
పశువులు, మేకలు, గొర్రెల మందలకు రక్షణగా గ్రామస్తులు పందికోన శునకాలను వినియోగిస్తున్నారు. మృగాల వాసన పసిగట్టి వాటి బారినుంచి ఈ శునకాలే పశువుల్ని రక్షిస్తాయని, అవసరమైతే మృగాలను వేటాడతాయని గ్రామస్తులు చెబుతున్నారు. కొత్త వ్యక్తులను గుర్తించి నిలువరించడం.. దొంగలను ముట్టడించి దాడి చేయడం వీటి ప్రత్యేకత. ఈ శునకాలు హైదరాబాద్, అమరావతి, ఢిల్లీ తదితర ప్రాంతాలతోపాటు అమెరికా, ఇతర దేశాలకూ ఎగుమతి అయ్యాయి. వీటి విశిష్టతను గుర్తించిన అమెరికాకు చెందిన ఓ బృందం 37 సంవత్సరాల క్రితం ఈ గ్రామాన్ని సందర్శించి వీటికి షెల్టర్, వసతి సౌకర్యాల కోసం నిధులు ఇస్తామని చెప్పగా.. గ్రామస్తులు నిరాకరించారు. కొన్నేళ్లుగా కేంద్ర రక్షణ శాఖ, పోలీసు అధికారులు వీటిని తీసుకెళ్లి పౌర, రక్షణ సేవలకు వినియోగిస్తున్నారు. వైద్యాధికారులు, కొందరు గృహ యజమానులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తరచూ గ్రామానికి వచ్చి వీటిని తీసుకెళుతుంటారని గ్రామస్తులు తెలిపారు. 

పేర్లు పెట్టి.. వాతలు వేస్తారు 
పందికోన గ్రామంలో సుమారు 700 కుటుంబాలు ఉండగా.. 1,500కు పైగా శునకాలను పెంచుతున్నారు. ప్రతి ఇంట్లో ఒక శునకం కనిపిస్తుంది. కొందరైతే రెండు, మూడింటిని పెంచుతుంటారు. వాటికి పేర్లు పెట్టి పిలుస్తుంటారు. ఆడ కుక్కలకు ఇందిరమ్మ, ఇందిరమ్మబీ, మగ కుక్కలకు రాముడు, భీముడు, రాజు వంటి పేర్లుంటాయి. చిన్న వయసులోనే వీటి దేహంపై రెండు వైపులా వాతలు పెడతారు. రాత్రి వేళ కంటిమీద కునుకు లేకుండా పంట ఉత్పత్తులు, గొర్రెలకు ఇవి కాపలాగా ఉంటాయని గ్రామానికి చెందిన సిద్ధప్ప, బుల్లేని ఆదినారాయణ చెప్పారు. ఈ శునకాలు యజమానులు భుజించే ఆహారాన్నే తింటాయి. పప్పుతో కలిపిన అన్నం ఆరగిస్తాయి. జొన్న రొట్టెలు, చికెన్, మటన్‌ ఎంతో ప్రీతిగా తింటాయి. పంటల్ని నాశనం చేయడానికొచ్చే అడవి పందుల్ని వేటాడి భుజిస్తాయి. 

వీటి ప్రత్యేకత తెలుసు గానీ.. 
పందికోన కుక్కల గురించి కొన్నేళ్లుగా వింటున్నాను. వీటి ప్రత్యేకతలు తెలుసు. చిరుత పులి, కుక్కల సంపర్కం వల్ల చిరుత లాంటి ఈ శునకాలు జన్మించాయనే ప్రచారం ఉంది. ఇందులో నిజమెంత అనేది చెప్పలేం. వీటికి పౌరుషం ఎక్కువ. మొరగకుండా దొంగల్ని పట్టేస్తాయ్‌.  
– లక్ష్మీప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్, పశు సంవర్ధక శాఖ 

గొర్రెలకు ఇవే కాపలా 
నాకు 180 గొర్రెలున్నాయి. ఎప్పుడు అడవి పందులు దాడి చేస్తాయో తెలీదు. అలాంటప్పుడు ఈ కుక్కలే నాకు సహాయంగా ఉంటాయి. నేను భోజనానికి వెళ్తే ఇవే కాపలా ఉంటాయి. కొత్త వ్యక్తులు, దొంగలు, అడవి పందులను దరిదాపుల్లోకి రానివ్వవు. 
– కోదండ రాముడు, గొర్రెల యజమాని 

డిస్కవరీ ప్రతినిధులు వస్తుంటారు 
ఏటా ఢిల్లీ నుంచి డిస్కవరీ చానల్‌ ప్రతినిధులు మా గ్రామానికొచ్చి శునకాలను పరిశీలించి వెళుతుంటారు. వీటి పనితీరును పరిశీలించడానికి ఓసారి అమెరికన్లు మా పొలానికి వచ్చి రాత్రంతా పొలంలోనే ఉన్నారు. అదే సమయంలో అడవి పంది రావడంతో మా కుక్క దానిని వెంటాడి.. వేటాడి చంపేయడం చూసి ఆశ్చర్యపోయారు.  
– బోయ ఆదినారాయణ, రైతు 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు