అరుదైన శివాలయం 

5 Nov, 2019 08:09 IST|Sakshi

సాక్షి, పుట్టపర్తి : పుట్టపర్తిలో సత్యసాయి జన్మస్థలంలో వెలసిన శివశక్తి స్వరూప ఆలయం చాలా అరుదైనదిగా భక్తులు భావిస్తుంటారు. ఇక్కడి మూలవిరాట్‌ను తన స్వహస్తాలతో బాబానే ప్రతిష్టించినట్లు ప్రతీతి. నిత్యం పుట్టపర్తిని సందర్శించే భక్తులు తప్పనిసరిగా ఈ శివాలయంలో అర్చనలు, అభిషేకాలు  చేయించుకుని తరిస్తుంటారు. 125 దేశాల భక్తులతో పూజలు అందుకుంటున్న అరుదైన ఆలయంగా ఆధ్యాత్మిక చరిత్ర పుటల్లో ఈ ఆలయం స్థానం దక్కించుకుంది.  

పుట్టపర్తిలోని సత్యసాయి నివాసానికి సమీపంలో 1976లో శివశక్తి స్వరూప పేరుతో శివాలయాన్ని బాబా నిర్మించారు. సాధారణంగా శివాలయం అనగానే అందులో శివలింగాన్ని భక్తులు సందర్శిస్తుంటారు. అయితే శివశక్తి స్వరూప ఆలయంలో ఏకశిలా పాలరాతితో చేయించిన శివుడి ప్రతిమను సత్యసాయి ప్రతిష్టించారు. పుట్టపర్తికి వచ్చే 125 దేశాల భక్తులు, వివిధ రాష్ట్రాలకు చెందిన వారు నిత్యమూ ఇక్కడ అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేయిస్తుంటారు. ఇక కార్తీక మాసంలో ఆలయానికి భక్తులు పోటెత్తుతుంటారు. ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకూ అభిషేక పూజలు ఉంటాయి. ప్రతి నెలా వచ్చే మాసశివరాత్రి నాడు ఉదయం 5 నుంచి  7.30 గంటల లోపు అభిషేకాలు నిర్వహిస్తుంటారు. బహుళ అష్టమి నాడు చండీ హోమాలు ఉంటాయి.  

పుట్టపర్తిలో మరో కళికితురాయి  
దేశంలో రెండవది, రాష్ట్రంలో మొదటి ఎత్తైన శివలింగ మందిరంగా పుట్టపర్తిలోని శివశక్తి స్వరూప ఆలయం ఖ్యాతి గడించింది. ఇక్కడ ఎన్నో చూడదగిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల నిర్మాణ పనులు పూర్తి చేసుకొని పూజలందుకోవడానికి సిద్దంగా ఉన్న మరో శివలింగాకార మందిరం పుట్టపర్తి కీర్తి మకుటంలో కళికితురాయిగా నిలవనుంది. ఇది రాష్ట్రంలోనే ఎత్తైన శివలింగ మందిరంగా గుర్తింపు పొందినట్లు బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యాజమాన్యం పేర్కొంటోంది.

బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో పుట్టపర్తికి ఏడు కిలోమీటర్ల దూరంలోని సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి సమీపంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇందు కోసం సుమారు రూ.కోటి వెచ్చించారు. దాదాపు 75 అడుగుల ఎత్తుతో ఐదు ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ ఆలయంలో మ్యూజియం, మెడిటేషన్, లేజర్‌షో ఏర్పాటు చేశారు. ఈ మందిరం చుట్టూ దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల నమూనాలను అందంగా పెయింటింగ్‌ వేయించారు. లోపల శ్రీకృష్ణుని లీలలు, రేపల్లె అందాలు, గోపికల విన్యాసాలు ఆకట్టుకునే బొమ్మల రూపంలో ఏర్పాటు చేశారు. ఈ మందిరానికి ఇటీవల గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కినట్లు ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యాజమాన్యం తెలిపింది.  

మరిన్ని వార్తలు