గాంధీ అడుగుపెట్టిన గడ్డ

15 Aug, 2019 11:53 IST|Sakshi

సాక్షి, ఆముదాలవలస : అహింసా మార్గం లో ఉద్యమాలు చేసి తెల్లదొరలను ఎదురించి దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు గాంధీ. అంతటి గొప్ప వ్యక్తి ఆమదాలవలస మండలం దూసి గ్రామం సమీపంలో గల దూసి రైల్వేస్టేషన్‌లో అడుగుపెట్టి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి నింపారు. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో భాగంగా ప్రజలను ఉద్యమాల్లో భాగస్వామ్యం చేసి రైలులో ప్రయాణించారు. దీనిలో భాగంగా దూసి రైల్వేస్టేషన్‌లో దిగి సుమారు 15 నిమిషాల పాటు ప్రసంగించారు. అలనాటి గుర్తులు ఇంకనూ ఆ స్టేషన్‌లో ఉన్నాయి. బ్రిటీష్‌ పరిపాలను ఏ విధంగా తిప్పికొట్టాలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉద్యమం తీరును వివరించారు. అనంతరం రైల్వేస్టేషన్‌ ఆవరణలోనే గాంధీజీ మర్రి మొక్కను నాటారు. అప్పుడు నాటిన మొక్క వృక్షమై రెండు ఎకరాల స్థలంలో ఆవరించి ఉంది. 77 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వృక్షం గాంధీజీ నాటినట్లు స్థానికులు చెబుతున్నారు. దూసి రైల్వేస్టేషన్‌లో గాంధీజీ అడుగుపెట్టినందున అప్పట్లో గాంధీ రైల్వేస్టేషన్‌గా పేరు పెట్టాలని అనుకున్నారు. ఏళ్లు గడిచినా ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు.

మరిన్ని వార్తలు